నగరం బయటకు కాలుష్య పరిశ్రమలు

Pollutant industries out of the city - Sakshi

తరలింపు ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌లో 1,234 కాలుష్యకారక పరిశ్రమలు

ఇప్పటికే 13 పరిశ్రమలను మూసేయించామని వెల్లడి

‘ఔటర్‌’ లోపలి 40 చెరువులను శుద్ధి చేస్తున్నాం

90 శాతం మురుగు మూసీ నదిలోకి వెళ్తోంది

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో 54 నాలాలున్నాయని, 90 శాతం మురుగు నీరు మూసీ నదిలోకి వెళ్తోందని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ బయోలాజికల్‌ ఆక్సిజన్‌ లెవల్స్‌ (బీవోడీ) గతేడాది సెప్టెంబర్‌లో తగ్గాయని.. అనుకోకుండా వచ్చిన మురుగు నీటితో ఈ పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో శుద్ధీకరణ చేస్తామన్నారు.

గ్రేటర్‌ పరిధిలో 1,234 కాలుష్యకారక పరిశ్రమలున్నాయని.. వీటిని నగ రం బయటకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 3 నెలల్లో 100 పరిశ్రమలను తరలిస్తామని, ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే 13 కంపెనీలను మూసేయించామని వెల్లడించారు.

చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత అని  మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లే చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాలుష్యం బారిన పడుతున్నాయని చెప్పారు.

బుధవారం అసెంబ్లీలో గ్రేటర్‌లోని చెరువుల పరిరక్షణ, నాలాల శుద్ధి, కాలుష్యకారక పరిశ్రమల తరలింపుపై ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, పాషా ఖాద్రీ, కె.పి.వివేకానంద్, ఎం.కృష్ణారావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘జీహెచ్‌ఎంసీ పరిధిలో 185, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులున్నాయి. ఇవి మురుగు నీరు చేరి కలుషితమవుతున్నాయి. ఔటర్‌ రింగురోడ్డు లోపలి 40 చెరువులను శుద్ధి చేస్తున్నాం. మొదటి దశలో రూ.287 కోట్లతో 20 చెరువులు శుద్ధి చేస్తున్నాం’అని వివరించారు.

503 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం: కడియం
అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కార్పొరేట్‌ కాలేజీలను నియంత్రించేందుకు ర్యాంకుల విధానం తొలగించి గ్రేడింగ్‌ విధానం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చైతన్య, నారాయణ కాలేజీలకు కొత్తగా అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 190 కళాశాలపై దాడులు చేసి జరిమానా విధించాం. వీటిలో నారాయణ 61, చైతన్య 50, గాయత్రి కాలేజీలు 13 ఉన్నాయి’అన్నారు. రాష్ట్రంలో 503 రెసిడెన్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.  

వచ్చే ఏడాది 13 కొత్త గనులు: జగదీశ్‌రెడ్డి
సింగరేణి కాలçరీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది 13 కొత్త గనులు ప్రారంభించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వాటిలో 6 భూగర్భ, 7 బహిరంగ గనులు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రస్తుత బహిరంగ గనులను విస్తరించాలని యోచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం వెలుపల కూడా సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు.  

752 కోట్లతో వంతెనలు: తుమ్మల
గోదావరి, కృష్ణ, మంజీర, మానేరు నదులపై అవసరమైన చోట వంతెనలు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రధాన నదులపై రూ.752.75 కోట్లతో ఇప్పటికే 11 వంతెనలు నిర్మిస్తున్నామని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top