హైదరాబాద్లో ‘ప్లేబాయ్’ | Now Playboy club in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ‘ప్లేబాయ్’

Aug 6 2014 2:18 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో ‘ప్లేబాయ్’ - Sakshi

హైదరాబాద్లో ‘ప్లేబాయ్’

అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ... అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్ ప్లేబాయ్ గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది.

హైదరాబాద్ : అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ... అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్ ప్లేబాయ్ గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న పబ్‌ను శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్లేబాయ్ గ్రూప్ వాస్తవానికి 2012లోనే దేశంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించింది. గోవాతో పాటు ఢిల్లీ, ముంబైలలో క్లబ్బులు, పబ్‌ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలోనే అశ్లీలానికి తావు లేకుండా వీటిని నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చినా అనుమతి లభించలేదు.

గోవాలోని క్యాండోలిమ్ బీచ్ సమీపంలో 22 వేల చదరపు అడుగుల సువిశాల ఓపెన్ ఎయిర్ క్లబ్ ఏర్పాటుకు అక్కడి సర్కారుకు గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా పేరున్న ఆ నగరంలోనూ దీని ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. ప్లేబాయ్ పేరుతో ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు సన్‌షైన్ రిసార్ట్స్ పేరుతో గోవాలో ఏర్పాటైంది. ఇప్పుడు ప్లేబాయ్ సంస్థ కన్ను హైదరాబాద్‌పై పడింది. పబ్ ఏర్పాటుకు అనుమతి లభించడంతో శుక్రవారం నగర శివారులోని ఓ ప్రముఖ హోటల్‌లో లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లేబాయ్ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది.

ఈ అంశంలో కొసమెరుపు ఏమిటంటే... ప్లేబాయ్ పబ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావడానికి సిటీలో పని చేస్తున్న అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడం. ఈ నేపథ్యంలోనే సంస్థకు చెందిన ఆహ్వానపత్రాలతో పాటు వీఐపీ పాస్‌లకూ భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. అయితే నగరంలో ఏర్పాటు కానున్న   పబ్‌లో ఎలాంటి అశ్లీలానికీ తావు లేకుండా నిబంధనలు విధించినట్లు తెలిసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement