‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో సీఎం రేవంత్ తదితరులు
ఆక్రమణలు, కబ్జాలతో గోవాలో భూములు అన్యాక్రాంతం
డ్రగ్స్‌తో తప్పుదారి పడుతున్న రాష్ట్ర యువత
ఈ పరిస్థితులన్నీ మారాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి
గోవా సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోవాలో భూముల అన్యా క్రాంతం, డ్రగ్స్ దందాకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆక్రమణలు, కబ్జాలతో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, మరోవైపు డ్రగ్స్ వ్యాపారానికి బీజేపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వడంతో యువత తప్పుదారి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను సరిచేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గోవాలో భూముల అన్యాక్రాంతం, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును పరిరక్షించాలనే లక్ష్యంతో గోవా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
అందుకే ‘ప్రాపర్టీ సావంత్’ అంటున్నారు..
‘గోవా ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారు. మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోనే పరాయివారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ గోవాకు రావాల్సి ఉన్నప్పటికీ, ఢిల్లీలో నిరసన కార్య క్రమాల నేపథ్యంలో రాలేకపోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రతినిధిగా నన్ను గోవాకు పంపించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్రా న్ని అభివృద్ధి చేయకుండా ఆస్తులను ఇతరులకు అప్పగించే పనిలో ఉన్నారు.
అందుకే ప్రజలు ఆయన్ను ‘ప్రాపర్టీ సావంత్’ అని పిలుస్తున్నారు. ‘నషా ముక్త్ భారత్’ గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గోవాలో ఈ సమస్యను ఎందుకు అరికట్టడం లేదు? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. గోవా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
2027 రుతుపవనాల నాటికి గోవాలో కాంగ్రెస్ సర్కార్!
‘రావణుడు బీజేపీ అయితే, రాముడు కాంగ్రెస్. బీజేపీని ఓడించాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలి. గోవా ప్రజలు రెండుసార్లు బీజేపీని నమ్మి మోసపోయారు. మూడోసారి ఆ పార్టీని నమ్మొద్దు. గోవాలో కాంగ్రెస్‌కు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేసినా అది చివరకు బీజేపీకే ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞానేశ్ కుమార్ పేరుతో పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. గోవాలో.. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి. దేశంలో నైరుతి రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశించి, ఆ తర్వాత గోవాకు చేరుకుంటాయి. 2026 రుతుపవనాల సమయంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2027 రుతుపవనాల నాటికి గోవాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది..’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గోవా నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు త్రివర్ణ పతాకం ఎగరడం ఖాయమని అన్నారు.


