అగ్రిగోల్డ్‌కు ఆ అనుమతులివ్వండి

అగ్రిగోల్డ్‌కు ఆ అనుమతులివ్వండి - Sakshi


* సీఆర్‌డీఏ పరిధిలో భూములను అభివృద్ధి చేసే వీలు కల్పించండి

* సీఆర్‌డీఏ అధికారులకు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం

* తదుపరి విచారణ 26కు వాయిదా


సాక్షి, హైదరాబాద్: సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూములను అభివృద్ధి చేసేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని హైకోర్టు గురువారం అధికారులను ప్రశ్నించింది. రెండు వారాల్లో అనుమతులు ఇవ్వాలని గతేడాది డిసెంబర్‌లో తాము ఆదేశాలు ఇచ్చామని, వాటిని ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి అనుమతులు ఇవ్వకుంటే సంబంధిత అధికారులకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది.



తదుపరి విచారణకు బాధ్యతాయుతమైన అధికారి కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.



వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ తరుపు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న తమ భూములను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులను ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటివరకూ అనుమతులు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top