కర్షకుల కన్నీరు పట్టదా?: వంశీచంద్‌రెడ్డి | MLA Vamsi Chand Reddy comments on TRS government | Sakshi
Sakshi News home page

కర్షకుల కన్నీరు పట్టదా?: వంశీచంద్‌రెడ్డి

Published Sun, Apr 9 2017 3:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కర్షకుల కన్నీరు పట్టదా?: వంశీచంద్‌రెడ్డి - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కర్షకులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పండిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్దతు ధర రాక కష్టపడి పండించిన పంటను రైతే తగలబెట్టుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు.

కరువు, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. మార్కెట్‌ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పంట పెట్టుబడికి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర అందించాలని డిమాండ్‌ చేశారు. కరువు దృష్ట్యా పాడి రైతులకు ఉచితంగా పశుగ్రాసం, మందులు సరఫరా చేయాలని వంశీచంద్‌ కోరారు. 

Advertisement
Advertisement
Advertisement