ఆర్టీసీకి నష్టాల ‘జాతర’ | losses 'fair' to the RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి నష్టాల ‘జాతర’

Feb 22 2016 3:20 AM | Updated on Oct 9 2018 5:58 PM

ఆర్టీసీకి నష్టాల ‘జాతర’ - Sakshi

ఆర్టీసీకి నష్టాల ‘జాతర’

జాతరలు.. పుష్కరాలు.. కోట్లలో జనం ఒకచోటికి చేరే ఇలాంటి వేడుకల్లో ఆర్టీసీ పాత్ర అంతాఇంతా కాదు.

మేడారంతో ఖజానాకు చిల్లు.. రూ.4 కోట్లు నష్టం
 
 సాక్షి, హైదరాబాద్: జాతరలు.. పుష్కరాలు.. కోట్లలో జనం ఒకచోటికి చేరే ఇలాంటి వేడుకల్లో ఆర్టీసీ పాత్ర అంతాఇంతా కాదు. సందర్శకులను అక్కడికి చేర్చటం, తిరిగి సొంతూళ్లకు తరలించడంలో ఆర్టీసీ బస్సులదే కీలక భూమిక. ఆ సమయంలో ఏ బస్సును చూసినా కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తే ఆర్టీసీకి కాసులే... కాసులు అనుకుంటారు. కానీ చివరికి లెక్కలు తేల్చేసరికి ఆర్టీసీ నష్టమే మిగులుతోంది.

ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకుండా చోద్యం చూస్తుండటంతో భారీ వేడుకలు ఆర్టీసీకి గుదిబండలుగా మారుతున్నాయి. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో లక్షల మందిని తరలించి రికార్డు సృష్టించిన ఆర్టీసీ చివరికి చేతులు కాల్చుకోగా, తాజాగా మేడారం జాతర కూడా అదే పరిస్థితిని కల్పించింది. 2014లో మేడారం జాతరకు ఉమ్మడి ఆర్టీసీ విస్తృతంగా సేవలందించి 16 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ టీఎస్‌ఆర్టీసీ సొంతంగా 18 లక్షల మందిని తరలించి సత్తా చాటింది. గత జాతరలో రూ.20 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.22 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

ఇంత ఆదాయం వచ్చినా అంతకు కోటిన్నర మించి ఖర్చు ఉండే అవకాశం ఉందని అధికారులు సూత్రప్రాయంగా తేల్చారు. గోదావరి పుష్కరాల తరహాలో భక్తులు అధికసంఖ్యలో పోటెత్తితే ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో ఈసారి చాలామంది జాతర ప్రారంభానికి ముందే మేడారం బాటపట్టారు. వారు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఆర్టీసీ జాతర వేళ భారీ సంఖ్యలో సమకూర్చిన ప్రత్యేక బస్సులను పూర్తిగా వినియోగించాల్సిన అవసరం రాలేదు. దీంతో దాదాపు 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. రోజువారీ వీటికి రావాల్సిన ఆదాయం రాకపోవడంతోపాటు, వీటికోసం ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు భత్యాల చెల్లింపు ఖర్చు మీదపడింది. దీనివల్ల రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. వెరసి ఈ జాతర రూ.4 కోట్ల మేర  నష్టాన్నే మిగిల్చినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement