నింగీ నేలను కలుపుతూ.. 

Kite Festival started in the city - Sakshi

     కైట్‌ ఫెస్టివల్‌ ప్రారంభించిన మంత్రులు మహమూద్, చందూలాల్‌

     తొలిరోజు పతంగుల పండుగను తిలకించిన 50 వేల మంది

సాక్షి, హైదరాబాద్‌: రంగు రంగుల పతంగులు రకరకాల ఆకృతులతో నింగీ నేలను కలుపుతూ రివ్వున ఎగిరాయి.. ఆకాశానికి నిచ్చెన వేశారా అనిపించేలా గాలిపటాలు దూసుకుపోయాయి.. వంద లాది పతంగులు ఒకేసారి గాలి లోకి ఎగిరి అద్భుతాన్ని ఆవిష్కరించాయి. శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అంత ర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా కనిపించిన దృశ్యాలివీ. ఉదయం ప్రారంభమైన ఈ కైట్‌ ఫెస్టివల్‌ రాత్రి వరకు కొనసాగగా.. తొలిరోజు దాదాపు 50 వేల మంది నగరవాసులు తిలకించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగుల పోటీదారులతో పరేడ్‌ మైదానం కోలాహలంగా మారింది. 3 రోజులపాటు పతంగుల పండుగ నగరవాసులకు కనువిందు చేయనుంది. 

అందరినీ ఏకతాటిపైకి తేవడానికే.. 
భాగ్యనగరంలో ఉన్న సకలజనులను ఏకతాటిపైకి తేవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వివిధ రకాల ఫెస్టివల్స్‌ను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శనివారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో భాషా సాంస్కృతిక శాఖ–పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ను  మహమూద్‌ అలీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ప్రారంభించారు.  

మహమూద్‌  మాట్లాడుతూ 15 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ.. పతంగుల పండుగలో నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ బాల్యదశలో దోస్తులతో కలసి సంక్రాంతి ఆనందంగా జరుపుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది సింగపూర్, థాయిలాండ్, కొరియా, జపాన్, చైనా సహా పది దేశాలు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 కైట్‌ ఫ్లేయర్‌ బృందాలు పాల్గొంటున్నాయని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top