పౌరసరఫరాల శాఖలో ఐటీ విభాగం | IT Department in the Civil Supplies Department | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల శాఖలో ఐటీ విభాగం

Feb 4 2017 2:16 AM | Updated on Sep 27 2018 4:02 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను ప్రక్షాళన చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను ప్రక్షాళన చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నిత్యావసర సరుకుల సరఫరా మొదలు పంపిణీ వరకు పీడీఎస్‌ను పటిష్ట పరిచేందుకు ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం సిబ్బందిని ఏడాది కాలానికి ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకున్నారు. వీరి ఎంపికను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ద్వారా చేపట్టారు. పౌరసరఫరాల శాఖలో  అమలవుతున్న ఐటీ ప్రాజెక్టులను పర్యవేక్షించే బాధ్యతను ఈ బృందం చూడనుంది. ఒక ప్రాజెక్టు హెడ్, ఇద్దరు ప్రాజెక్టు మేనేజర్లు, ఇద్దరు ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌తో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

మండల స్థాయి నిల్వకేంద్రాల (ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు) వద్దకు సీసీ కెమెరాలు, సరుకులు తరలించే లారీలకు జీపీఎస్, రేషన్‌ దుకాణాల వద్ద బయోమెట్రిక్, సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ వంటి వ్యవహారాల నిర్వహణను ఐటీ విభాగం పర్యవేక్షించనుంది.  దీనికోసం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కూడా వీటిని వీక్షించేలా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణల్లో ఈ–పాస్‌ యంత్రాలు, నగదు రహిత లావాదేవీలు వంటి ప్రాజెక్టులను ఐటీ విభాగం పర్యవేక్షించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement