డీజిల్‌ సంక్షోభానికి బాబు సర్కారే కారణం.. సిండికేట్‌కు ‘ఇంధనం’! | Chandrababu govt is reason for diesel crisis in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డీజిల్‌ సంక్షోభానికి బాబు సర్కారే కారణం.. సిండికేట్‌కు ‘ఇంధనం’!

Apr 29 2026 5:01 AM | Updated on Apr 29 2026 5:12 AM

Chandrababu govt is reason for diesel crisis in Andhra Pradesh

లేఖల సాక్షిగా అసలైన దోషి బాబు సర్కారే 

రిటైల్‌ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్‌ అటు డీపీటీతో లబ్ధి.. ఇటు డీజిల్‌లోనూ లూటీనే

కమర్షియల్, బల్క్‌ డీజిల్‌పై చట్ట విరుద్ధంగా బాబు సర్కారు ఉత్తర్వులు 

రిటైల్‌ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను  రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఆదేశం 

పెట్రోల్‌ బంకుల్లో రిటైల్‌ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్‌ను రాజధాని కాంట్రాక్టర్లకు సరఫరా చేయాలంటూ  పౌరసరఫరాల శాఖకు ఈనెల 23న సీఆర్‌డీఏ కమిషనర్‌ లేఖ 

ఆ మేరకు డీజిల్‌ అందించాలంటూ చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు 

బల్క్‌లో అవసరమైతే నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కాంట్రాక్టర్లు కొనుగోలు చేయాలి 

అందుకోసం అందుబాటులో ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ.. బల్క్‌లో కొంటే లీటర్‌ డీజిల్‌ రూ.153 

పెట్రోల్‌ బంకుల్లో రిటైల్‌గా కొంటే లీటర్‌ డీజిల్‌ రూ.98 మాత్రమే 

లీటర్‌కు రూ.55 చొప్పున కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కార్‌ ఎత్తుగడ

ఈనెల 24 నుంచి రాజధాని కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున డీజిల్, పెట్రోల్‌ సరఫరా చేయడంతోనే కొరత తలెత్తి సంక్షోభంగా మారిందంటున్న చమురు కంపెనీలు 

ఢిల్లీలో కేంద్ర ఉన్నతాధికారులను కలసి ఏపీలో ప్రజల అవస్థలను వివరించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి  

చంద్రబాబు సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతూ.. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ  తాజాగా లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం  

కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలను  చంద్రబాబు సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంపై సర్వత్రా ఆగ్రహం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారం రోజులుగా మండుటెండల్లో రోడ్లమీద నరకయాతన.. పెట్రోలు బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు.. సాధారణ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపా­రుల దీనావస్థ, ఇక్కట్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబు సర్కారేనని రుజువైంది. ప్రజల కళ్లకు గంతలు కట్టి సర్కారే దొంగాట ఆడు­తున్నట్లు తేలిపోయింది! దోచుకో.. పంచుకో.. తినుకో..! విధానంతో బరి తెగించి అడ్డగోలుగా వ్యవహరి­స్తున్న టీడీపీ పెద్దలు ప్రజ­లు ఏమైపోతే తమకేమంటూ జనం జీవితాలతో చెలగాట­మాడేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ఇంధన కొరతపై సమీక్షించిన సీఎం చంద్రబాబు చమురు కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. విరుచుకుపడ్డారని ఎల్లో మీడియా, సీఎంవో ఇచ్చిన లీ­కులు ఉత్తుత్తివేనని తేలిపోయింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు బడాయిల బండారం బట్టబయలైంది. 

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్‌ డీజిల్‌ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్‌ పెట్రోలు బంకులలో రాజధాని నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ బాబు ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఇది చట్ట విరుద్ధమని, ఆ ఉత్తర్వులు చెల్లవని, వెంటనే ఉప­సంహరించుకో­వాలని ఆదేశించిది. ఈ మేరకు కేంద్ర పెట్రో­లియం శాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శికి లేఖ రాసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధి­కారుల­ను కలసిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఏపీలో వారం రోజు­లుగా ప్రజల దుస్థితిని వివరించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను బాబు సర్కారు ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పి­స్తూ వాణిజ్య అవసరాల కోసం దారి మళ్లించినట్లు బహిర్గతమైంది. 

ఈ అడ్డగోలు ఆదేశాలే రాష్ట్రంలో డీజిల్‌ సమస్యకు కారణం రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్‌ బంకుల్లో రిటైల్‌ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్‌ సరఫరా చేయాలని ఆయిల్‌ కంపెనీలను ఆదేశిస్తూ ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులు

కాంట్రాక్టర్లు నేరుగా కాదు.. బల్క్‌లో కొనాల్సిందే
రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. వందల కో­ట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ  చంద్రబాబు సర్కార్‌ తీసు­కున్న నిర్ణయమే ఏపీలో డీజిల్, పెట్రోల్‌ కృత్రిమ కొరతకు దారి తీసిం­దన్నది బట్టబయలైంది. వాణిజ్య అవసరాల కోసం విని­యో­గించే కమర్షియల్, బల్క్‌ డీజిల్‌ను సాధారణ ప్రజల కోసం ఏర్పా­టైన రి­­టైల్‌ పెట్రోలు బంకులలో కాంట్రాక్టు సంస్థలకు తక్కు­వ ధరకు విక్ర­యించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 24న ఓ సర్క్యులర్‌ జారీ చేయడమే ఈ ఇక్కట్లకు అసలు కారణం. వాణిజ్య అవసరాలకు భారీ మొత్తం(బల్క్‌)లో డీ­జిల్, పెట్రోల్‌ అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లు నేరుగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) నుంచే బల్క్‌గా డీజిల్‌ కొనుగోలు చేయాలని కేంద్ర పెట్రో­లియం, సహజవాయువుల శాఖ నిబంధన విధించింది. 

వాణిజ్య అవసరాలకు బల్క్‌గా కొంటే లీటర్‌ డీజిల్‌కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్‌ బంకుల్లో రిటైల్‌గా కొంటే డీజిల్‌ లీటర్‌ ధర రూ.98 మాత్రమే. అంటే..ఒక లీటర్‌పై రూ.55 మేర రాజ­ధాని కాంట్రా­క్టర్లకు బాబు సర్కార్‌ ప్రయోజనం చేకూర్చేందు­కు సిద్ధమైనట్లు స్పష్టమవుతోందని ఓఎంసీ వర్గాలు చెబుతు­న్నా­యి. బంకుల నుంచి రిటైల్‌ ధరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్‌ను అందించడం వల్లే ఏపీలో డీజిల్, పెట్రోల్‌ దొరక్క అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందు­లు పడుతు­న్నారు. పంట కోతలు, పరిశ్రమల్లో ఉత్పత్తులు ఆగి­పో­యాయి. డీజిల్, పెట్రోల్‌ కొరతతో రాష్ట్రం స్తంభించిపోయినా అంతా బా­గుం­దంటూ ప్రభుత్వం చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

చట్ట విరుద్ధం.. వెంటనే వెనక్కి తీసుకోండి: కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని.. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చిచెబుతూ ఈనెల 25న సీఎస్‌కు కేంద్రం రాసిన లేఖ   

తొమ్మిది సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి..
సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌(అమరావతి అభివృద్ధి సంస్థ) నేతృత్వంలో రా­జధానిలో రూ.58 వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యనేత సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి భారీ ప్రయోజనం చేకూర్చారు. కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. అందులో 8 శాతం కమీషన్‌ రూపంలో వసూలు చేసుకున్నారనే విమర్శ­లు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి లాభం చేకూర్చడంతో ఆగకుండా డీజిల్‌లోనూ ప్రయోజనం కల్పిస్తూ మరో అడుగు ముందుకేశారు. 

కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆగమేఘాలపై..
అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రిటైల్‌ ధరకు పెట్రోల్‌ బంకుల నుంచి డీజిల్‌ కేటాయించి సరఫరా చేయాలంటూ సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్‌ ఈనెల 23న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు దీనిపై స్పందించి.. రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు 27,566.25 కిలోలీటర్లు(2,75,66,250 లీటర్లు) డీజిల్‌ను రిటైల్‌ ధరకు పెట్రోల్‌ బంకులలో కేటాయించి సరఫరా చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్‌ ధరకు డీజిల్, పెట్రోల్‌ అందించాలంటూ ఇదే రీతిలో పలు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 24 నుంచే రాజధాని కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్‌ను రిటైల్‌ ధరకు పెట్రోల్‌ బంకులు అందించాయి. ఆ రోజు నుంచే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడి రోజురోజుకూ తీవ్రంగా మారి సంక్షోభంగా రూపాంతరం చెందింది. 

ఇంధనం లేక తిరుపతిలో మూసివేసిన ఓ బంకు 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రం
రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్‌ ధరలకు పెట్రోల్‌ బంకుల నుంచి డీజిల్‌ అందించాలని చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్‌ నీరజ్‌ మిట్టల్‌ లేఖ రాశారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బల్క్‌గా రిటైల్‌ ధరలకు డీజిల్‌ సరఫరా అందించాలంటూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఆ ఉత్తర్వులు నిత్యావసర సరకులు (ఎసెన్షియల్‌ కమోడిటీస్‌) చట్టం–1995ను ఉల్లంఘించడమేనని ఆ లేఖలో తేల్చిచెప్పారు. 

ఇది పెట్రోల్, డీజిల్‌ కొరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీల వద్దకే ఓఎంసీల నుంచి నేరుగా బల్క్‌గా డీజిల్‌ సరఫరా చేసే వ్యవస్థ ఇప్పటికే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చి.. జనజీవనం స్తంభించిపోతున్నా సరే రాజధాని కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చుతూ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించకుండా చమురు కంపెనీలపైనే చంద్రబాబు ఎదురుదాడికి దిగడం విస్మయం కలిగిస్తోంది.

రిటైల్‌ బంకుల నుంచి డీజిల్‌ బల్క్‌ సరఫరా చట్టవిరుద్ధం

  • ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం అభ్యంతరం

  • రిటైల్‌ బంకులకు బల్క్‌ సప్లై లైసెన్సులు ఉండవని స్పష్టీకరణ 

  • ఆ ఆదేశాలను తక్షణం ఉపసంహరించు కోవాలని ఏపీ సీఎస్‌కు కేంద్రం లేఖ

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి రాజధానిలో నిర్మాణ పనుల కోసం సాధారణ పెట్రోల్‌ బంకుల (రిటైల్‌ అవుట్‌లెట్ల) నుంచి భారీ పరిమాణంలో (బల్క్‌) డీజిల్‌ సరఫరా చేయాలంటూ ఏపీ పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జి.సాయిప్రసాద్‌కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ కార్యదర్శి డాక్టర్‌ నీరజ్‌ మిట్టల్‌ ఈ నెల 25న లేఖ రాశారు. అమరావతి నిర్మాణ కార్యకలాపాల కోసం బల్క్‌ డీజిల్‌ను రిటైల్‌ అవుట్‌లెట్ల నుంచి సరఫరా చేయాలంటూ ఈ నెల 24న ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు 2002 పెట్రోలియం నిబంధనలు (ముఖ్యంగా ఫామ్‌–14 కండిషన్‌ 16(4)), పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) మార్గదర్శకాలకు విరుద్ధమని కేంద్ర కార్యదర్శి తన లేఖలో తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం రిటైల్‌ బంకుల్లో వాహనాల ఇంధన ట్యాంకుల్లోకి లేదా ఆమోదించిన కంటైనర్లలో గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం పోసేందుకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. బల్క్‌ సప్లై చేసేందుకు రిటైల్‌ బంకులకు ఎలాంటి లైసెన్సులు ఉండవని స్పష్టం చేశారు. 

విజయవాడలోని ఓ బంక్‌ వద్ద బారులు తీరిన వాహనదారులు  

భద్రతకు ముప్పు 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు 1955 నిత్యావసర వస్తువుల చట్టం కింద జారీచేసిన మోటార్‌ స్పిరిట్‌ అండ్‌ హై–స్పీడ్‌ డీజిల్‌ (సరఫరా, పంపిణీ నియంత్రణ, అక్రమాల నివారణ) ఆర్డర్‌–2005 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టులకు బల్క్‌ ఇంధనం సరఫరా చేయడానికి ఓఎంసీలకు ప్రత్యేకంగా డైరెక్ట్‌ సేల్స్‌ యంత్రాంగం ఉందని గుర్తుచేసింది. ఆ విధానాన్ని కాదని రిటైల్‌ బంకుల ద్వారా మళ్లించడం చట్టవిరుద్ధమే కాకుండా భద్రత, లైసెన్సింగ్, నిర్వహణ పరమైన ఆందోళనలను రేకెత్తిస్తుందని హెచ్చరించింది. స్థిరమైన పరికరాలకు ఇంధనాన్ని సురక్షితంగా సరఫరా చేయడానికి కేంద్రం నోటిఫై చేసిన డోర్‌ డెలివరీ ఆఫ్‌ డీజిల్‌ (డీడీడీ) పథకం అమల్లో ఉందని, పెసో ఆమోదిత బౌజర్ల ద్వారా సరఫరా చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏపీ పౌరసరఫరాలశాఖ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకునేలా సీఎస్‌ జోక్యం చేసుకోవాలని కేంద్ర కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ కోరారు.

ఇవీ నిబంధనలు..
నిబంధనల ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులను రిటైల్‌ అవుట్‌లెట్లలో వాహనాల ఇంధన ట్యాంకులు, అనుమతించిన కంటైనర్లలోనే నింపాలి. అది కూడా గరిష్టంగా 200 లీటర్లకు మించి నింపకూడదు. రిటైల్‌ అవుట్‌లెట్లలో బల్క్‌ అవసరాల కోసం విక్రయించేందుకు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పెట్రోల్, డీజిల్‌ కొరతకు దారి తీసే ప్రమాదం ఉంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్‌గా డీజిల్‌ విక్రయించేందుకు చమురు కంపెనీలకు ఇప్పటికే పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement