చమురెటు పోతోంది!? | Petrol pumps closed in many places in Telangana | Sakshi
Sakshi News home page

చమురెటు పోతోంది!?

Apr 30 2026 4:28 AM | Updated on Apr 30 2026 4:28 AM

Petrol pumps closed in many places in Telangana

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో మూతబడిన ఓ పెట్రోల్‌ బంక్‌

రాష్ట్రంలో పలుచోట్ల మూతపడిన బంకులు 

డిమాండ్‌ కన్నా అధికంగా సరఫరా జరుగుతోందని

సర్కార్‌ లెక్కలు... మరి ‘నో స్టాక్‌’బోర్డులు ఎందుకు ఉంటున్నాయంటున్న వాహనదారులు 

బల్క్‌ డీజిల్‌ ధర రూ.152 కావడంతో రిటైల్‌ ఔట్‌లెట్‌లకు డిమాండ్‌ పెరిగిందని ప్రభుత్వం, ఇంధన సంస్థల వివరణ 

మరి పెట్రోల్‌ కొరత ఎందుకంటే జవాబు చెప్పలేని పరిస్థితి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజు వారీ పెట్రోల్‌ డిమాండ్‌ 5,883 కిలోలీటర్లు..డీజిల్‌ డిమాండ్‌ 7,348 కిలోలీటర్లు. అయితే గత కొద్ది రోజులుగా ఈ డిమాండ్‌కు రెండింతలకు పైగా ఆయిల్‌ కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి కూడా విడివిడిగా అధికారులు, ఇంధన సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని తేల్చి చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, రోజువారీ అవసరాల కన్నా రెండింతలు అధికంగా చమురు సరఫరా అవుతుంటే హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పెట్రోల్‌ బంకులు ఎందుకు ‘నోస్టాక్‌’ బోర్డులతో దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మంగళవారం తెరిచి ఉన్న పెట్రోల్‌ బంకుల ముందు వందలాది వాహనాలు క్యూలు కట్టి ఉండడం చమురు సమస్యను కళ్లకు కట్టింది. అయితే హైదరాబాద్‌లో పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించినప్పటికీ, శివారు ప్రాంతాలు, ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు మంగళవారం కూడా మూత పడే ఉండడం గమనార్హం.  

హైదరాబాద్‌లో పెట్రోల్‌ సమస్య!  
ఇంధన సంస్థలు బల్క్‌ డీజిల్‌ ధరను లీటర్‌కు రూ.152 చేయడంతో పరిశ్రమలు, పెద్ద మొత్తంలో డీజిల్‌ కొనుగోలు చేసే ఇతర సంస్థలు రిటైల్‌ ఔట్‌లెట్లలో భారీగా డీజిల్‌ కొనుగోలు చేస్తుండడంతో కొరత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖతో పాటు ఇంధన సంస్థలు చెపుతున్నాయి. ఒకవేళ అదే నిజమని అనుకుంటే పెట్రోల్‌ కొరత ఎందుకొచ్చిందనే దానికి అధికారుల వద్ద సమాధానం లేకపోవడం విస్మయం కలిగించే విషయం. వాస్తవానికి హైదరాబాద్‌లో పెట్రోల్‌ విషయంలోనే వాహనదారులు సమస్య ఎదుర్కొంటున్నారు. పెట్రోల్‌ సరఫరా తగినంతగా లేకపోవడమే కొరతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

జిల్లాల్లో డీజిల్‌ కోసం రైతుల క్యూలు  
రాష్ట్రంలో డీజిల్‌ కొరత కూడా మంగళవారం ఎక్కువగా కనిపించింది. మండల కేంద్రాల్లోని పెట్రోల్‌ బంకుల్లో రైతులు క్యాన్లతో క్యూలు కట్టారు. యాసంగి కోతల నేపథ్యంలో డీజిల్‌ లేక గత రెండు మూడు రోజులుగా వరికోత యంత్రాలు పొలాల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది. తెరిచి ఉన్న బంకుల వద్ద డీజిల్‌ను పరిమితంగానే క్యాన్లలో నింపుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాలు జిల్లాల్లోని హైవేలు, రహదారులపై క్యూలో నిలబడుతూ కనిపించాయి.  

నిరాటంకంగా సరఫరా: పౌరసరఫరాల శాఖ 
రాష్ట్రంలో ఇంధన సరఫరా నిరాటంకంగా సాగుతున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 3,817 ఇంధన ట్యాంకర్ల ద్వారా 36,404 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేసినట్లు పేర్కొంది. రోజువారీ పెట్రోల్‌ డిమాండ్‌ 5,883 కిలో లీటర్లు కాగా 13,622 కిలో లీటర్లు , డీజిల్‌ డిమాండ్‌ 7,348 కిలో లీటర్లకు గాను 22,782 కిలో లీటర్లు పంపించినట్లు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement