ఒంగోలులోని ఓ బంకులో పెట్రోల్ కోసం బారులుదీరిన వాహనదారులు
దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు?
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొరతే లేదు
ఆ రాష్ట్రాల్లో కావాల్సినంత మేర విక్రయాలు
రాష్ట్రంలో మాత్రం డీజిల్, పెట్రోల్‌కు తీవ్ర కటకట
70 శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం
రాష్ట్ర వ్యాప్తంగా సగానికి సగం బంకులు మూసివేత
కొన్ని బంకుల్లో మాత్రం రేషన్ లెక్కన అమ్మకాలు
విజయవాడలో కార్లకు డీజిల్ 10–15 లీటర్లే, బైకులకు రూ.200 పెట్రోలే
బంకుల వద్ద కనుచూపు మేర బారులు తీరిన వాహనాలు
సరఫరా లేదంటున్న డీలర్లు.. కొరతే లేదంటూ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలం
సమన్వయం లేదు.. నిఘా లేదు.. పరిష్కారం దిశగా చర్యలూ లేవు.. సీఎం సీరియస్ అంటూ మీడియాకు మాత్రం లీకులు పుష్కలం
ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్న ఇంధన రంగ నిపుణులు
కమర్షియల్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు/కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సరఫరా అయ్యే ఇంధన చార్జీలు పెరిగాయి. రిటైల్-కమర్షియల్ ఇంధనం ధరలో సగానికి సగం వ్యత్యాసం ఉంది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రిటైల్ బంకుల నుంచి బ్లాక్‌లో కొంటున్నారని ఆయిల్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిటైల్ బంకులకు సరఫరా తగ్గించేశాయి. ఇక్కడ నిఘా పూర్తిగా కొరవడింది. సమన్వయం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ అసలే లేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే. అందుకే సమస్య తీవ్రతరమైంది. నిజంగా ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకో మరి ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు.
-ఇంధన రంగానికి చెందిన ఓ నిపుణుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్‌ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్‌కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్‌కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. పెద్ద వాహనాల రవాణా నిలిచిపోయింది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌కు ఏమాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు.. నిఘా లేదు.. పరిష్కారం దిశగా చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వులపాలవుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరానే లేదని బంకుల యజమానులు వాపోతుంటే.. సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటని చర్చ జరుగుతోంది. 
గుంటూరు లాడ్జి సెంటర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన వాహనాలు
సీఎంది ఓ లెక్క.. సివిల్ సప్లై శాఖ మంత్రిది మరోలెక్క
రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతోంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం విస్తుగొల్పుతోంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలో మీటర్ల పెట్రోలు, 14,156 కిలో లీటర్ల డీజిల్‌ను డీలర్లకు సరఫరా చేసినట్టు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే.. శనివారం 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్లు అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలో లీటర్లకు పెరిగిందన్నారు. 
కర్నూలులోని నారాయణ పెట్రోల్ బంక్‌లో సైకిల్‌పై వచ్చి పెట్రోలు తీసుకెళ్తున్న యువకుడు
సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలో లీటర్లు అని, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉందన్నారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్‌ను 2.4% అదనంగా పెంచినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన లెక్కలకు, సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటి దాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవని తేటతెల్లమవుతోంది.
అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద వాహనదారులతో నిండిపోయిన ఇండియన్ పెట్రోల్ బంక్
చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం
⇒ రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చడంతో అది రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు వంటివి సగానికి పైగా తిరగడం లేదు. ఈ నెలాఖరుకు ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో సరఫరా ఆపేశారనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని, అలాగైతే పొరుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా అవుతోందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. 
తిరుమలలోని హెచ్‌పీ బంకు వద్ద పెట్రోల్ కోసం బారులుతీరిన వాహనాలు
⇒ ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్‌లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్‌లలో విక్రయాలు ఆపేశారు.


