పోస్టాఫీసు డిపాజిట్లపై ఐటీ నిఘా.. | Post Office Small Savings Under Tax Scanner PAN vs Form 97 New Rules | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసు డిపాజిట్లపై ఐటీ నిఘా..

May 9 2026 3:56 PM | Updated on May 9 2026 4:52 PM

Post Office Small Savings Under Tax Scanner PAN vs Form 97 New Rules

పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆదాయపు పన్ను (IT) నిబంధనలు-2026 ప్రకారం, పోస్టాఫీసు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ఖాతా తెరవడం నుంచి డిపాజిట్లు, ఉపసంహరణల వరకు ప్రతి కీలక లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోట్ చేయడం తప్పనిసరి అయింది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలను అధికారిక పన్ను రిపోర్టింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), రికరింగ్ డిపాజిట్లు (RD), టైమ్ డిపాజిట్లపై ఈ నిబంధనల ప్రభావం పడనుంది.

పాన్ కార్డు లేకపోతే 'ఫారం 97'
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న పొదుపుదారులు, పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. ఒకవేళ డిపాజిటర్ వద్ద పాన్ కార్డు లేకపోతే గతంలో ఉన్న ఫారం 60 స్థానంలో ఇప్పుడు ఫారం 97 సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో డిపాజిటర్ పేరు, చిరునామా, లావాదేవీ స్వభావం, మొత్తం, సంబంధిత గుర్తింపు పత్రాలను పొందుపరచాలి. దీనివల్ల పాన్ కార్డు లేని లావాదేవీలు కూడా పన్ను శాఖ రికార్డుల్లో నమోదవుతాయి.

15G, 15H స్థానంలో 'ఫారం 121'
పన్ను మినహాయింపు కోసం గతంలో ఉపయోగించే ఫారం 15G (60 ఏళ్లలోపు వారికి), ఫారం 15H (సీనియర్ సిటిజన్లకు)లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో ఏకీకృత 'ఫారం 121'ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వారు ఇకపై ఒకే ప్రామాణిక ఫారమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడివిడిగా ఈ ఫారమ్‌ను సమర్పించాలి.

ఏడేళ్ల పాటు రికార్డుల భద్రత
కొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసులపై బాధ్యత పెరిగింది. డిపాజిటర్లు సమర్పించే పత్రాలను పోస్టాఫీసు సిబ్బంది అంతర్గతంగా ధ్రువీకరించాలి. అలాగే, ఈ రికార్డులను, సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఏడు సంవత్సరాల పాటు భద్రపరచడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యే వరకు, పాత ఫారాలు (15G, 15H) తాత్కాలికంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement