రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి | Identify places to residential schools | Sakshi
Sakshi News home page

రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి

Apr 21 2016 4:27 AM | Updated on Sep 26 2018 5:59 PM

రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి - Sakshi

రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి

వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

♦ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
♦ రెసిడెన్షియల్ స్కూళ్లు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యం
♦ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని సూచన
♦ మెదక్ జిల్లాలో ఫారెస్ట్ కాలేజీ డిజైన్‌కు ఆమోదం
 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొత్త భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రారంభించ తలపెట్టిన 180 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో సమావేశమై స్థలాలను నిర్ణయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే విద్యా సంస్థలు ఉండాలన్న నిబంధనేమీ లేదని... విద్యార్థులకు అనువైన స్థలం, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మైనారిటీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యాసంస్థలను కూడా ప్రారంభించాలని... ఇవన్నీ కేజీ టు పీజీలో భాగం కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ అసలు రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

 ఫారెస్ట్ కాలేజీకి 118 పోస్టులు
 మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫారెస్ట్ కాలేజీకి అవసరమైన 118 పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కాలేజీని ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త భవనం నిర్మించేలోపు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు. హార్టికల్చర్ వర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ భవనాల నమూనాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. ఫారెస్ట్ కాలేజీ డిజైన్‌కు ఆమోదం తెలిపిన సీఎం హార్టికల్చర్ వర్సిటీ డిజైన్‌కు కొన్ని మార్పులు సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యానవనాల సాగుకు దళిత రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, హరిత హారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement