ఇద్దరికి మించి సంతానం కేసులో జీహెచ్‌ఎంసీలోని మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడింది. అడిక్‌మెట్ కార్పొరేటర్‌గా ఎన్నికైన సి.సునీత (కాంగ్రెస్...
సాక్షి, సిటీబ్యూరో: ఇద్దరికి మించి సంతానం కేసులో జీహెచ్‌ఎంసీలోని మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడింది. అడిక్‌మెట్ కార్పొరేటర్‌గా ఎన్నికైన సి.సునీత (కాంగ్రెస్) ఇద్దరికి మించి సంతానం కలిగి ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అదే డివిజన్ నుంచి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీ చేసిన ఎస్.సుకన్య ఫిర్యాదుపై విచారణ జరిపిన సిటీ సివిల్‌కోర్టు.. కార్పొరేటర్‌గా సునీత అనర్హురాలంటూ తీర్పునిచ్చినట్లు సుకన్య పేర్కొన్నారు.
కోర్టు తీర్పు మేరకు.. సునీతను అనర్హురాలిగా ప్రకటించాలంటూ గురువారం మేయర్, ఎన్నికల అధికారి, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు విజ్ఞాపనపత్రాలు అందజేశారు. అధిక సంతానం కేసులోనే గతంలో ఇద్దరు కార్పొరేటర్లపై అనర్హత వేటు పడటంతో పాటు ఆయా డివిజన్లకు కొత్త కార్పొరేటర్లు రావడం తెలిసిందే. లంగర్‌హౌస్ కార్పొరేటర్ రవియాదవ్ (ఎంఐఎం)పై అనర్హత వేటు పడగా, ఆ డివిజన్ ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన ఉదయ్‌కుమార్(బీజేపీ)ను కార్పొరేటర్‌గా పరిగణించాలంటూ కోర్టు తీర్పునివ్వడంతో, ఆయనను నియమించారు.
బోరబండ కార్పొరేటర్ వనజ (కాంగ్రెస్)ను అనర్హురాలిగా ప్రకటించిన కోర్డు రెండో స్థానంలో నిలిచిన భానుమతి(ఎంఐఎం)ని కార్పొరేటర్‌గా నియమించేందుకు ఎలాంటి ఆదేశాలి వ్వక పోవడంతో.. ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించగా, భానుమతే గెలిచారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన సుకన్య, ఆమె భర్త శ్రీనివాస్ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం అనంతరం పార్టీలో చేరారు. కొద్దికాలం క్రితం శ్రీనివాస్ మృతి చెందారు. జీహెచ్‌ఎంసీలోని ప్రస్తుత పాల క మండలిలోనే ముగ్గురు కార్పొరేటర్లపై అనర్హత వేటు పడడం విశేషం.