
నేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే
కార్గిల్ యుద్ధ విషయాలు, విశేషాలు టీవీలో చూసిన సునీత పహాల్ మన రక్షణరంగంలోని వాయుసేనలో పనిచేయాలని కలలు కన్నది. అయితే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి కల వెక్కిరింపుకు గురైంది. అలాంటి సమయాల్లో ఆకాశం కేసి చూసేది సునీత.‘ఆకాశం అందరిదీ కదా!’ఆ ఎరుకతోనే హరియాణాలోని చిన్న గ్రామం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో(indian air force ) వింగ్ కమాండర్ స్థాయికి చేరింది. ‘పరిమితులను పట్టించుకోకండి. పట్టుదలగా లక్ష్యంపై దృష్టి పెట్టండి’ అంటూ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది సునీత పహాల్ (Sunita Pahal)...
హైదరాబాద్‌లో... నీలిరంగు యూనిఫామ్‌లో తమ కుమార్తె ఆత్మవిశ్వాసంతో కవాతు చేస్తూ గర్వంగా సెల్యూట్ చేయడాన్ని చూసి సునీత తల్లిదండ్రుల కళ్లు చెమర్చాయి. వారికి ఇది కేవలంపాసింగ్–అవుట్ పరేడ్ కాదు. కలను సాకారం చేసుకున్న కన్నకూతురుని అపురూపంగా చూసుకునే అవకాశం.
కార్గిల్ యుద్ధం జరుగుతున్న కాలంలో, మంచుతో నిండిన భూభాగాల్లో పోరాడుతున్న మన సైనికులను టీవీలో చూసింది సునీత. వారి సాహసాల గురించి కథలు కథలుగా విన్నది. అవి తప మనసుపై చెరగని ముద్ర వేశాయి. ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనే కలకు బీజం వేశాయి.
పెద్ద కలతో... చిన్న గ్రామం నుంచి హరియాణాలోని దతౌలీ అనే చిన్న గ్రామంలో అమ్మాయిల నోటివెంట ‘సైన్యంలో పనిచేయాలనేది నా కల’ అనే మాట కనీసం ఊహకు కూడా అందదు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్) రాసింది. ఈ పరీక్ష కోసం ఎలాంటి శిక్షణా తీసుకోనప్పటికీ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది.
‘సైన్యంలో మహిళలు పనిచేయలేరు. చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. పెళ్లి చేయడం కూడా కష్టం అవుతుంది. సునీతను ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్యంలో చేర్పించవద్దు’ అని ఇరుగు, పొరుగు, బంధువులు సునీత తల్లిదండ్రులకు చెప్పేవాళ్లు. సునీత తండ్రికి రెండు ఎకరాల భూమి ఉండేది. బతుకు బండి లాగడం అతడికి కష్టం అయ్యేది. అయినప్పటికీ పిల్లలను బాగా చదివించే విషయంలో రాజీ పడేవాడు కాదు.
‘నీకు అయిదుగురు ఆడపిల్లలు. వచ్చిన కాస్తో కూస్తో డబ్బును పిల్లల చదువు పేరుతో వృథా చేయకు. వారి పెళ్లిపై దృష్టి పెట్టు’ అనేవారు చాలామంది. వారి ప్రతికూల మాటలు ఆయనను ప్రభావితం చేయలేక పోయాయి.
కఠిన శిక్షణ... కన్నీటి ధార
ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది సునీత. అంతమాత్రాన కథా సుఖాంతం కాలేదు. అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. శిక్షణ తనకు చాలా కష్టంగా అనిపించింది. ‘నేను చేయగలనా’ అని బెదిరిపోయింది. ఏడ్చింది. అయినప్పటికీ పట్టుదలతో శిక్షణ పూర్తి చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఈశాన్య రాష్ట్రాలలోని ప్రీమియర్ ఫైటర్ బేస్‌లో. ఎప్పుడూ అనుభవంలో లేని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. అయినాసరే, ఆపరేషన్స్ మేనేజ్ చేయడం నుంచి సంక్లిష్టమైన టెక్నికల్ అసైన్‌మెంట్స్ హ్యాండిల్ చేయడం వరకు ఎన్నో చేసేది.
‘ఇవి చేస్తున్నది నేనేనా!’ అని కూడా అనిపించేది. ‘నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతిరోజూ కష్టపడ్డాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది సునీత.
కష్టం వృథా పోలేదు
ధైర్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, అసాధారణమైన పనితీరు, అంకితభావాన్ని గుర్తించి ఇచ్చే వైమానిక దళ అధికారిక ప్రశంసపత్రాన్ని అందుకుంది సునీత. ‘అమ్మాయిలు సైన్యంలోకి ఎందుకు!’ అంటూ పిల్లల కలలకు అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అంటుంది సునీత...
‘ఆకాశం అందరిదీ. మీ అమ్మాయిల కలలకు రెక్కలు ఇవ్వండి. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నా కలకు నా తల్లిదండ్రులు అడ్డు చెబితే ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చేదాన్ని కాదు. వింగ్ కమాండర్ స్థాయికి చేరుకునేదాన్ని కాదు’
ఇదీ చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఎన్నో రాత్రులు ఏడ్చాను!
నేను అథ్లెట్‌ను కాదు. ఎప్పుడూ అయిదు కిలోమీటర్‌ల దూరం నడవలేదు. పుషప్‌లు ఎప్పుడూ చేయలేదు. అలాంటి నేను శిక్షణ కాలంలో రోజుకు పది కిలోమీటర్లు పరుగెత్తాల్సి వచ్చేది. గంటలపాటు డ్రిల్లింగ్ ఉండేది. ఎండ తట్టుకోవడం కష్టం అయ్యేది. ఇవి తట్టుకోలేక ఎన్నో రాత్రులు ఏడ్చాను. కాని ప్రతిరోజూ నిద్ర లేవగానే ఆ బాధను మరిచిపోయి, ఎంత కష్టమైనా చేయాల్సిందే అనుకునేదాన్ని. అడవులు, ఎడారులు... ఎక్కడైనా కావచ్చు, పురుషులతో సమానంగా మహిళలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలు ఒకటికి రెండుసార్లు తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. – సునీత పహాల్