వామ్మో డిసెంబర్ 15! | high security registration plates due december 15 | Sakshi
Sakshi News home page

వామ్మో డిసెంబర్ 15!

Nov 5 2015 3:13 AM | Updated on Sep 2 2018 5:24 PM

వామ్మో డిసెంబర్ 15! - Sakshi

వామ్మో డిసెంబర్ 15!

ప్రస్తుతం రవాణాశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబరు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి.

  • తరుముకొస్తున్న హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్పు గడువు
  • 75 లక్షల వాహనాలకు ఈ సమయం సరిపోదంటున్న రవాణాశాఖ
  • లేకుంటే సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించిన ట్టే
  • గడువు పెంచాలని కోరే యోచనలో సర్కారు
  • సాక్షి, హైదరాబాద్:  ప్రస్తుతం రవాణాశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబరు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ప్లేట్ల ఏర్పాటు జరుగుతున్నప్పటికీ మీరెందుకు అమలుచేయట్లేదని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని ప్రశ్నించింది. దీంతో డిసెంబరు 15 నాటికి అన్ని వాహనాలకు అమర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు లక్ష్యం కొండలా పేరుకుపోవటంతో ఇంత తక్కువ గడువులో అది సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో గడువు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    సరఫరా అస్తవ్యస్తం
    ఏడాది క్రితం హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమల్లోకి తెచ్చినప్పుడు ప్రతి వాహనదారుడు వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్లేట్లను సరఫరా చేసే సంస్థ సరిపడా సరఫరా చేయలేకపోవటమే దీనికి కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్ సిరీస్‌తో రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రమే అమరుస్తూ వస్తున్నారు. ఇప్పటికి వాటి సంఖ్య 5.50 లక్షలకు చేరుకుంది. ఏపీ సీరీస్‌తో ఉన్న 75 లక్షల వాహనాలకు వాటిని అమర్చే పనికి శ్రీకారం చుట్టలేదు. ప్లేట్లను సరఫరా చేసే కంపెనీతో ప్రభుత్వం అప్పట్లో ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
     
     అయితే సరిపడా ప్లేట్లు సరఫరా కాకుంటే రవాణాశాఖ నేరుగా ఆ కంపెనీని ప్రశ్నించలేకపోతోంది. ఆర్టీసీ-రవాణాశాఖ సంయుక్త సమావేశాలు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. గడువు తరుముతుండటంతో ఇప్పుడు సంయుక్త సమావేశానికి రెండు విభాగాలు సిద్ధమయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా డిసెంబరు 15 నాటికి 75 లక్షల వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీలను ఏర్పాటు చేయటం సాధ్యం కాదని రవాణాశాఖ తేల్చేసింది. దీనిపై కంపెనీతో ఆర్టీసీ చర్చించగా, సరిపడా ప్లేట్లు సరఫరా చేయాలంటే 16 డిమాండ్లను నెరవేర్చాలని షరతు విధించింది.
     
     విధివిధానాల్లో జాప్యం
     ఏపీ సిరీస్‌తో ఉన్న పాత వాహనాలను టీఎస్ సిరీస్‌లోకి మార్చే విషయమై 12 రోజుల క్రితమే ఉత్తర్వు జారీ అయినా ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు కాలేదు. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ప్రస్తావన లేకుండా తొలుత మార్గదర్శకాలు రూపొందించారు. తర్వాత దాన్ని మార్చి హెచ్‌ఎస్‌ఆర్‌పీని చేర్చారు. దానిపై న్యాయశాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిదిద్దేందుకు ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్లేట్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement