High security registration plates
-
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకున్నా చూసీచూడనట్టు వెళ్లిన యంత్రాంగం ఇకపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన వాహనాలకు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, అన్ని వాహనాలకు ఇకపై కచ్చితంగా హెచ్ఎస్ఆర్పీ ఉండాల్సిందేనన్నమాట. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అప్పట్లో అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, దాని అమలులో యంత్రాంగం ఉదాసీనంగా ఉండటం, పాత వాహనాలకు ఆ నంబర్ ప్లేట్లు లేకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చు కోవాల్సిందేనని అందులో స్పష్టం చేసింది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఏర్పాటు చేసుకోని వాహనాలు గడువు తర్వాత రోడ్డెక్కితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. ఫిట్నెస్ టెస్ట్ సహా వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు ఇవ్వబోమని. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం కుదరదని తేల్చి చెప్పటం విశేషం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాత వాహనదారులు ఈ నంబర్ ప్లేట్ కోసం www.siam.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రవాణాశాఖ సూచించింది. పంపిణీ ఎలా సాధ్యం?హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటు విషయంలో ముందునుంచి ప్రభుత్వం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వాహనాలు కొంటున్న వారిలో 75 శాతం మంది వాటిని కాకుండా, నచ్చిన తరహాలో ఉండే సాధారణ నంబర్ ప్లేట్లనే ఏర్పాటు చేసుకుంటున్నా ఎలాంటి చర్యలు లేవు. వాహనాలను తనిఖీ చేసేప్పుడు హెచ్ఎస్ఆర్పీ లేకుంటే ఫైన్ కూడా విధించటం లేదు. దీంతో వాటి విషయంలో వాహనదారుల్లో శ్రద్ధే లేకుండా పోయింది. ఇక, రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రాష్ట్రంలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల సరఫరా ఉండటం లేదు. ముందునుంచీ వీటి తయారీ, సరఫరా తీవ్ర గందరగోళంగా మారింది. ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇప్పుడు ఒకేసారి పాత వాహనాలకు కూడా ఆ నంబర్ ప్లేట్లను అమర్చాలని ఆదేశాలివ్వటంతో వాటిని ఎలా సరఫరా చేస్తారో అధికారులకే తెలియాలి. తాజా ఆదేశం మేరకు దాదాపు 90 లక్షల వరకు నంబర్ ప్లేట్లను సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర రవాణాశాఖ స్పష్టంగా ఆదేశించటంతో, దీనిని కచ్చితంగా అమలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. కానీ నంబర్ ప్లేట్ల తయారీ, సరఫరా అంశం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో, ఇది అధికారులకు కత్తిమీద సామే కానుంది. -
వామ్మో డిసెంబర్ 15!
తరుముకొస్తున్న హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్పు గడువు 75 లక్షల వాహనాలకు ఈ సమయం సరిపోదంటున్న రవాణాశాఖ లేకుంటే సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించిన ట్టే గడువు పెంచాలని కోరే యోచనలో సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రవాణాశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబరు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ప్లేట్ల ఏర్పాటు జరుగుతున్నప్పటికీ మీరెందుకు అమలుచేయట్లేదని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని ప్రశ్నించింది. దీంతో డిసెంబరు 15 నాటికి అన్ని వాహనాలకు అమర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు లక్ష్యం కొండలా పేరుకుపోవటంతో ఇంత తక్కువ గడువులో అది సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో గడువు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సరఫరా అస్తవ్యస్తం ఏడాది క్రితం హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమల్లోకి తెచ్చినప్పుడు ప్రతి వాహనదారుడు వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్లేట్లను సరఫరా చేసే సంస్థ సరిపడా సరఫరా చేయలేకపోవటమే దీనికి కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్ సిరీస్‌తో రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రమే అమరుస్తూ వస్తున్నారు. ఇప్పటికి వాటి సంఖ్య 5.50 లక్షలకు చేరుకుంది. ఏపీ సీరీస్‌తో ఉన్న 75 లక్షల వాహనాలకు వాటిని అమర్చే పనికి శ్రీకారం చుట్టలేదు. ప్లేట్లను సరఫరా చేసే కంపెనీతో ప్రభుత్వం అప్పట్లో ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సరిపడా ప్లేట్లు సరఫరా కాకుంటే రవాణాశాఖ నేరుగా ఆ కంపెనీని ప్రశ్నించలేకపోతోంది. ఆర్టీసీ-రవాణాశాఖ సంయుక్త సమావేశాలు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. గడువు తరుముతుండటంతో ఇప్పుడు సంయుక్త సమావేశానికి రెండు విభాగాలు సిద్ధమయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా డిసెంబరు 15 నాటికి 75 లక్షల వాహనాలకు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేయటం సాధ్యం కాదని రవాణాశాఖ తేల్చేసింది. దీనిపై కంపెనీతో ఆర్టీసీ చర్చించగా, సరిపడా ప్లేట్లు సరఫరా చేయాలంటే 16 డిమాండ్లను నెరవేర్చాలని షరతు విధించింది. విధివిధానాల్లో జాప్యం ఏపీ సిరీస్‌తో ఉన్న పాత వాహనాలను టీఎస్ సిరీస్‌లోకి మార్చే విషయమై 12 రోజుల క్రితమే ఉత్తర్వు జారీ అయినా ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు కాలేదు. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ప్రస్తావన లేకుండా తొలుత మార్గదర్శకాలు రూపొందించారు. తర్వాత దాన్ని మార్చి హెచ్‌ఎస్‌ఆర్‌పీని చేర్చారు. దానిపై న్యాయశాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిదిద్దేందుకు ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్లేట్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
డీటీసీ ఆదేశాలు బేఖాతర్
- హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ప్రక్రియ ఆపాలని ఆదేశం - కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ తిమ్మాపూర్ : రవాణా శాఖ జిల్లా డెప్యుటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(డీటీసీ) ఆదేశాలను హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల(హెచ్ఎస్ఆర్పీ) కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కార్యాలయ ఆవరణలో హెచ్ఎస్ఆర్పీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రారంభించగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రేడియం షాపుల యజమానులు ఆపాలని డీటీసీని కలిశారు. ఇతర జిల్లాల్లో ప్రారంభించకుండా కేవలం కరీంనగర్‌లోనే ప్రారంభించడంపై అభ్యంతరాలు తెలిపారు. దీనిపై డీటీసీ స్పందిస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రారంభించిన తర్వాతనే కరీంనగర్లో ప్రారంభించాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ ప్రతి రోజూ కార్యాలయ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. హెచ్ఎస్ఆర్పీకి సంబంధించి నోడల్ ఆఫీసర్ ఆర్టీవో దుర్గప్రమీలకు తెలియకుండానే ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. జోనల్ ఆఫీసు వరంగల్‌లో ప్రారంభించే వరకు ఇక్కడ తాత్కాలికంగా హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ఆర్డర్లు తీసుకోవడం ఆపాలని ఆర్టీవో కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆర్డర్లు తీసుకోవడం లేదని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఏపీ జీవో... వాహనదారులు హెచ్ఎస్ఆర్ ప్లేట్లను వాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 110 జారీ చేసినా జిల్లాలో అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి జీవో పేరిట ఇప్పుడు సంబంధిత కాంట్రాక్టర్ హెచ్ఎస్ఆర్ ప్లేట్ల కౌంటర్‌ను ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. ఆంధ్ర అధికారులున్నందునే అప్పటి జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.