సుప్రీం తీర్పునూ పట్టించుకోరా? | High Court fires on government about approval of the statues | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పునూ పట్టించుకోరా?

Feb 3 2016 12:34 AM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీం తీర్పునూ పట్టించుకోరా? - Sakshi

సుప్రీం తీర్పునూ పట్టించుకోరా?

విగ్రహాల ఏర్పాటుకు అనుమతులిచ్చే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోరా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విగ్రహాల అనుమతులపై సర్కారు పట్ల హైకోర్టు ఆగ్రహం
అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక

 
 సాక్షి, హైదరాబాద్: విగ్రహాల ఏర్పాటుకు అనుమతులిచ్చే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోరా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజోపయోగ స్థలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒకవేళ అమలు చేయకపోతే దానిని తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.

సికింద్రాబాద్‌లోని చిలకలగూడ మునిసిపల్ పార్కులో నాగులూరి మేడ్చల్ నర్సింహ అనే వ్యక్తి విగ్రహ ఏర్పాటుకు అనుమతినిస్తూ పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చిలకలగూడ పార్కు వాకర్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహాల ఏర్పాటుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఆదేశాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రజోపయోగ స్థలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిస్తే అందుకు విరుద్ధంగా అధికారులు చిలకలగూడ పార్కులో విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతినిచ్చారో అంతుబట్టకుండా ఉందని న్యాయమూర్తి అన్నారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనే పట్టించుకోరా అని ప్రశ్నించారు. నర్సింహ విగ్రహ అనుమతి విషయంలో అధికారులు సుప్రీం తీర్పును విస్మరించారని ఆక్షేపించారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తయినందున దానిని తొలగించేందుకు ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. విగ్రహాలకు అనుమతినిచ్చే విషయంలో సుప్రీం తీర్పును కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement