లక్షన్నర టన్నుల కందులు కొనండి

HARSIRAO LETTER TO CENTER - Sakshi

కేంద్రానికి మరో లేఖ రాసిన మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ సీజన్‌లో కందుల దిగుబడి 2.84 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తున్న నేపథ్యంలో లక్షన్నర టన్నులు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రిహరీశ్‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన మరో లేఖ రాశారు. మొదట 33,500 మెట్రిక్‌ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మంత్రి విన్నపం మేరకు కేంద్రం 53,600 మెట్రిక్‌ టన్నుల సేకరణకు ఒప్పుకొంది. అయితే కంది దిగుబడి పెరగడంతో హరీశ్‌ ఆదేశాలతో ఎంపీ జితేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేయడంతో 1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల కందుల సేకరణకు అంగీకరిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలో కందుల దిగుబడి దృష్ట్యా కేంద్రం ఈ పరిమితిని సడలించాలని, లక్షలన్నర టన్నులు సేకరించాలని హరీశ్‌ కోరారు.  

83,650 టన్నుల కొనుగోళ్లు..
 తెలంగాణలో 83,650 మెట్రిక్‌ టన్నుల కందులను సేకరించారు.మొత్తం కందుల కొనుగోళ్ల విలువ రూ.455 కోట్లు. కొనుగోళ్ల అనంతరం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం తగదని హరీశ్‌ అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే మార్క్‌ఫెడ్, హాకా సంస్థల అధికారులు కందులను గోడౌన్లకు తరలించి నాఫెడ్‌కు స్వాధీనపరచాలని సూచించారు. కందుల కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమన్నారు. కందుల రీ సైక్లింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంది రైతులకు మద్దతు ధర లభించాలన్నారు. జనగామ, భువనగిరిలలో కందుల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగినందున జనగామ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు.   

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top