కలలా కరిగిన ఐదేళ్లు | ghmc period completed as a dream | Sakshi
Sakshi News home page

కలలా కరిగిన ఐదేళ్లు

Dec 2 2014 1:23 AM | Updated on Sep 2 2017 5:28 PM

కలలా కరిగిన ఐదేళ్లు

కలలా కరిగిన ఐదేళ్లు

‘ఇన్నేళ్ల్లూ చూడని అభివృద్ధిని కొద్ది రోజుల్లోనే చేసి చూపిస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..

‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్‌ఎంసీ).. 150 మంది కార్పొరేటర్లు.. అందుకు తగ్గ అధికారగణం. ఇంత గొప్ప పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం రేపటి (3వ తేదీ)తో ముగియనుంది. ఈ సందర్భంగా నేడు కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమను గెలిపిస్తే నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, వారి ఇబ్బందులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్లుగా గెలిచినవారు దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో హామీలు.. అవి అమలైన తీరుపై ఒక అవలోకనం..      
                          
 - సాక్షి, సిటీబ్యూరో
 
‘ప్లాస్టిక్ నిషేధం’ విఫలం
నగరాన్ని మోడల్ సిటీగా మార్చేందుకు ‘ప్లాస్టిక్ నిషేధం’ అమలు చేస్తామన్నారు. ఒకేసారి పూర్తిస్థాయిలో అమలు కష్టమవుతుందని తొలుత 40 మైక్రాన్ల లోపు బ్యాగుల్ని నిషేధిస్తామని, అనంతరం సంపూర్ణంగా బ్యాన్ చేస్తామని అప్పటి మేయర్ కార్తీకరెడ్డి ప్రకటించారు. అయితే, ఒత్తిళ్లకు తలొగ్గారో.. పచ్చనోట్లకు లొంగిపోయారో గానీ, సంపూర్ణ నిషేధమన్నది సంపూర్ణంగా విఫలమైంది.
 
గ్రేటర్ ప్రజలందరికీ సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘టిప్’ పథకం అమలు చేస్తామన్నారు. కోర్ ఏరియా ప్రజలతో పాటు శివార్లలోని ప్రజలకు సంపూర్ణ సదుపాయాలు ఉద్దేశించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు బ్యాంకు రుణానికీ సిద్ధమయ్యారు. ఆరంభం కాకుండానే అటకెక్కింది. నగరంలో ఇళ్ల చిరునామాను సులభంగా క నుక్కునేలా కొత్త ఇంటి నెంబర్ల పథకాన్ని ప్రకటించారు. అప్పటి మునిసిపల్ మంత్రి మహీధర్‌రెడ్డితో లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. నాలుగేళ్లయినా ఇంకా పూర్తికాలేదు.

గజిబిజి కేబుళ్లు లేకుండా డక్టింగ్ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించడమే కాక శంకుస్థాపన చేసి మూడేళ్లయినా నేటికీ  కొలిక్కి రాలేదు. వర్షం వస్తే ప్రాణాంతకంగా మారిన సమస్యల పరిష్కారానికి పలు నాలాలను ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభమైనా ఏ ఒక్కటీ పూర్తిచేయలేకపోయారు.

పార్కింగ్ సమస్య పరిష్కారానికి పాతబస్తీలోని ఖిల్వత్ వద్ద మల్టీ టయర్ పార్కింగ్ కాంప్లెక్సుకు 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు జరగలేదు.
 
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన పలు ఆర్‌ఓబీలు, ఫ్లై ఓవర్లలో ఒక్కటి కూడా పూర్తికాలేదు.
 
పాలకమండలి సర్వసభ్య సమావేశాలకు తవసరమైన కౌన్సిల్‌హాల్, దానితోపాటు అధికారుల కార్యాలయాలతో పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో శంకుస్థాపన చేయించారు. తర్వాత మరచిపోయారు.
 
అక్రమాలను సహించబోమని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, అగ్నిమాపక నిరోధక చర్యల్లేని భవనాలను ఉపేక్షించబోమన్న హామీలు ఆవిరయ్యాయి. ఫంక్షన్‌హాళ్ల నుంచి ఆస్పత్రుల దాకా ఎన్నో భవనాల్లో ఉల్లంఘనలున్నా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
 
‘ఇంకిపోయిన’ నిధులు
ఇంకుడు గుంతల పేరిట భవన నిర్మాణ అనుమతుల సమయంలో ఫీజుల రూపేణా దాదాపు రూ. 60 కోట్లు వసూలు చేశారు. వెల్లువెత్తిన విమర్శలతో రూ. 6 కోట్లతో ఇంకుడు గుంతలు తవ్వుతామన్నారు. ఎక్కడ తవ్వారో ఎవ్వరికీ తెలియదు.
 
బేగంబజార్, కూకట్‌పల్లి, నాచారం చేపల మార్కెట్లు కాగితాలు దాటలేదు.
ఏళ్ల తరబడి చెబుతున్న స్లాటర్ హౌస్‌లు అందుబాటులోకి రాలేదు.
తడి, పొడి చెత్తలకు టూ బిన్ సిస్టం ప్రారంభోత్సవానికే పరిమితమై.. అమలు అటకెక్కింది.
హుస్సేన్ సాగర్‌కు క్రెస్ట్‌గేట్లు వరదలొస్తే గుర్తుకొచ్చే ప్రాజెక్టుగా మిగిలింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు ‘ఫేస్ టూ ఫేస్, ప్రజావాణి, కాల్‌సెంటర్లు పేరుగొప్ప ఊరుదిబ్బ చందంగా మారాయి.
రూ. 10 కోట్లతో సైనేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి అమలు మరిచారు.
సికింద్రాబాద్, అమీర్‌పేటల్లో స్కైవాక్‌లు, నాలుగు ప్రాంతాల్లో సబ్‌వేలు ప్రకటనలుగా మిగిలాయి.
 
‘ఒప్పందం’ తారుమారు
జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్- ఎంఐఎంల ఒప్పందం కుడి ఎడమైంది. ఒప్పందం మేరకు ఐదేళ్ల పదవీ కాలానికిగాను తొలి రెండేళ్లు మేయర్ పదవి కాంగ్రెస్‌కు, మలి రెండేళ్లు ఎంఐఎంకు ఇవ్వాలి. చివరి ఏడాది తిరిగి కాంగ్రెస్‌కు మేయర్ పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఉన్నప్పుడు ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్, ఎంఐఎం నుంచి మేయర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఉండాలనేది ఒప్పందం. తొలి రెండేళ్ల అనంతరం ఒప్పందం మేరకు ఎంఐఎంకు కట్టబెట్టారు.

తిరిగి రెండేళ్లు పూర్తి కాగానే ఎంఐఎం మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయక పోవడం.. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం ఏడు నెలల సమయం కూడా లేని తరుణంలో ఆయన రాజీనామా చేసినప్పటికీ, అందుకు కాంగ్రెస్ ఆమోదం తెలపలేదు. దాంతో, ఒప్పందం మేరకు మూడేళ్లపాటు కాంగ్రెస్ వారు మేయర్‌గా కొనసాగాల్సి ఉన్నప్పటికీ రెండేళ్లే ఉన్నారు. రెండేళ్లు పదవిలో ఉండాల్సిన ఎంఐఎం మేయర్ మూడేళ్లు కొనసాగారు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ మూడేళ్లున్నారు. కాంగ్రెస్ నుంచి తొలి రెండేళ్లు మేయర్‌గా బండ కార్తీకరెడ్డి వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement