
ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం
జూబ్లీహిల్స్ జర్నతిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మేర నష్టం సంభవించిందీ ఇంకా తెలియరాలేదు.
దాదాపు రెండు గంటల నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ముందుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడినుంచి మూడు, నాలుగు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. లోపల ఉన్న సిబ్బంది తమవద్ద ఉన్న పరికరాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. లోపల ఫైళ్లు కాలుతుండటంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపలకు వెళ్లి మంటలను ఆర్పడం కష్టం కావడంతో బయటి నుంచే మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న భవనాల పైనుంచి కూడా వీటిని అదుపు చేయాలని చూస్తున్నారు.
మెట్ల మీద నుంచి సిబ్బంది బయటకు వచ్చేందుకు కూడా మంటలు అడ్డుగా ఉండటంతో.. పక్క భవనాల మీదకు తీసుకెవెళ్లి అక్కడినుంచి కిందకు తీసుకొచ్చారని తెలుస్తోంది. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల మీదుగా బయటకు తీసుకొచ్చారు. సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాదాపుగా కార్యాలయ భవనం మొత్తం కాలిపోయిందనే అంటున్నారు.