మా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలపొద్దు | do not mix the our areas in hyderabad | Sakshi
Sakshi News home page

మా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలపొద్దు

Aug 14 2016 3:13 AM | Updated on Sep 4 2018 5:21 PM

మా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలపొద్దు - Sakshi

మా ప్రాంతాలను హైదరాబాద్‌లో కలపొద్దు

కొత్త జిల్లాల ఏర్పాటుపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య పేచీ మొదలైంది. రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమ జిల్లాల పునర్విభజనపై...

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య పేచీ మొదలైంది. రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమ జిల్లాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. కొత్త జిల్లాలపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట పంతాలకు పోయారు. దాంతో శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగిన జిల్లాలవారీ ప్రజాప్రతినిధుల భేటీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షెడ్యూలు ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులతో ఉపసంఘం సంయుక్త సమావేశం ఏర్పాటు చేసింది.

తీరా సమావేశం మొదలవగానే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు దీనిపై అభ్యంతరం తెలిపారు. తమ జిల్లాలోని ప్రాంతాలను హైదరాబాద్ జిల్లాతో కలపడం సరికాదన్నారు. అందుకే ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి కూచోవటం తమకిష్టం లేదంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో రెండు జిల్లాల ప్రతినిధులతో ఉపసంఘం విడిగానే సమావేశమైంది. మంత్రులు పి.మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో పాటు రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు.

రంగారెడ్డి జిల్లాను అవసరమైతే రెండు, మూడు జిల్లాలుగా విభజించాలే తప్ప హైదరాబాద్‌లో కలపటం సరి కాదని మహేందర్‌రెడ్డి చెప్పగా పార్టీలకతీతంగా ఆ జిల్లా నేతలంతా సమర్థించారు. మరోవైపు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా ఉండటం అశాస్త్రీయమని ఎంఐఎం ఎమ్మెల్యేలన్నారు. రంగారెడ్డి నేతలకు, ప్రజలకు ఇష్టం లేనప్పుడు హైదరాబాద్‌లో కలిపే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లతో ఒకే జిల్లా చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. జిల్లాల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.
 
పీవీ పేరుతో మంథని జిల్లా
దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరుతో మంథని కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కరీంనగర్ సమీక్షలో ఎమ్మెల్యే పుట్ట మధు ప్రతిపాదించారు. తమ ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలో కలపకుండా భూపాలపల్లినే పీవీ జిల్లాలో కలపాలన్నారు. కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కలపటం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కోదాడ, హుస్నాబాద్‌లను సిద్దిపేటలో; ఎల్కతుర్తిని వరంగల్‌లో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్యే సతీశ్‌బాబు అన్నారు.

కోరుట్ల, ధర్మపురిలను రెవిన్యూ డివిజన్లు చేయాలని ఎంపీ సుమన్ సూచించారు. సిరిసిల్ల జిల్లా అంశం ప్రస్తావనకు రాలేదు. ఖమ్మం జిల్లాలో గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపొద్దని, కల్లూరును కొత్త డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలతో ఉపసంఘంభేటీ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement