సాక్షి,రంగారెడ్డి: చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ఉన్నారు. గతంలో తన చాకచక్యంతో అనేక ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తోటి ఆర్టీసీ ఉద్యోగులు,అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు గతంలో దస్తగిరి బాబా ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం, వికారాబాద్‌లోని అనంతగిరి కొండపై బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో దస్తగిరి చాకచక్యంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.అప్పట్లో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన దస్తగిరి.. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందడంపై ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


