
ఒక్క రోజులోనే డీలర్ రిజిస్ట్రేషన్
వ్యాపార వర్గాలకు సేవలను త్వరితగతిన అందించేందుకు వాణిజ్యపన్నులశాఖ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.
కొత్త విధానానికి వాణిజ్య పన్నులశాఖ శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వర్గాలకు సేవలను త్వరితగతిన అందించేందుకు వాణిజ్యపన్నులశాఖ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రక్రియలో భాగంగా వ్యాపారులకు ఒకే రోజులో డీలర్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత విధానంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించే డీలర్, టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ) డీలర్‌గా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులకు నెల రోజుల్లోగా అన్ని పత్రాలను పరిశీలించి సర్టిఫికేట్ ఇస్తుండగా ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న ఒక రోజు (24 గంటలు)లోనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని వాణిజ్యపన్నులశాఖ నిర్ణయించింది.
పైగా తమ కార్యాలయం వరకు రానవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. పాన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, లీజు డీడ్‌తోపాటు వాణిజ్యపన్నులశాఖ కోరే పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే దరఖాస్తుదారుడికి ఒకే రోజులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందేలా నిబంధనలు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.