సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఈ నెల 2వ తేదీన ఈ పాస్‌లను ప్రవేశపెట్టిన మొదటి రోజు నుంచే ధరలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒకే పాస్‌పైన ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే సదుపాయం ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగానే వీటిని కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ధరల తగ్గింపు పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని, త్వరలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ధరలను తగ్గించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం వెల్లడించారు.
త్వరలో ఆర్టీసీ వీక్లీ పాస్....
ఈ–సేవ మొబైల్ యాప్ ‘మీ టిక్కెట్’ ద్వారా క్యూఆర్ కోడ్‌తో టిక్కెట్‌లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ యాప్ నుంచి పొందేవిధంగా ఆర్టీసీ వీక్లీ పాస్‌లు కూడా అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
కామన్ పాస్‌ల ధరలను తగ్గించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో చార్జీలను కూడా తగ్గిస్తే ప్రయాణికులపైన భారం తగ్గనుంది.
దడైలీపాస్‌ను రూ.300 నుంచి రూ.200కు, నెలవారీ పాస్ ధరను రూ.8500 నుంచి రూ.4500 వరకు తగ్గిస్తే ప్రయాణికుల నుంచి గణనీయమైన ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. నెలవారీ పాస్‌పై ఆర్టీసీ వాటాను రూ.500 వరకు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


