ముత్యపు చిప్పే!

cm kcr delay on ravindra bharathi and kala bharathi - Sakshi

బాలారిష్టాల్లో రవీంద్రభారతి నిర్మాణం  

మూడేళ్లు దాటినా అతీగతీ లేని వైనం

ఒక్క అడుగూ పడని కళాభారతి..  

కోర్టు చిక్కుల్లో ఎన్‌టీఆర్‌ స్టేడియం స్థలం

అటకెక్కిన సీఎం కేసీఆర్‌ ‘కళా’ హామీలు

సాక్షి, సిటీబ్యూరో: ‘కొత్త రాష్ట్రంలో కళల వికాసం.. కళాకారుల అభ్యున్నతే మా ధ్యేయం’.. ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి. తెలంగాణ ప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేస్తామని రోజూ ఎక్కడోచోట సీఎం కేసీఆర్‌ చెబుతునే ఉన్నారు. కానీ సీఎం ప్రకటించిన సాంస్కృతిక చిహ్నల నిర్మాణం ఆచరణలో ఒక్క అడుగు పడలేదు. నగరంలో కళా సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇలాంటి చోట తెలంగాణ సర్కారు ఏర్పడ్డాక ప్రభుత్వ ముద్రగా చెప్పుకునేందుకు ‘రవీంద్రభారతిని ముత్యపు చిప్ప ఆకృతి’లో నిర్మిస్తామన్నారు. ధర్నాచౌక్‌ను ఆనుకుని ఉన్న ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతంలో కళాభారతి నిర్మించి తీరుతామని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు వాటికి అతీగతీ లేదు.

రవీంద్రభారతి ఆకృతి మారేనా..
భాగ్యనగరానికి ‘సిటీ ఆఫ్‌ పెరల్స్‌’(ముత్యాల నగరం)గా పేరు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రవీంద్రభారతిని అద్భుతంగా మారుస్తానని చెప్పారు. భవాన్ని పూర్తిగా ‘ముత్యపు చిప్ప’ ఆకృతిలో నిర్మించాలని, లేకుంటే ప్రస్తుత కట్టడాన్ని అలాగే ఉంచి పై ఆకృతిని మాత్రం ముత్యపు చిప్పలా నిర్మించి తీరాలని సంకల్పించానని చెప్పారు. ఈ ప్రకటన వినగానే కళాభిమానులు, సాహితీ ప్రియులు మురిసిపోయారు. కానీ సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు దాటింది. ముత్యపు చిప్ప చిహ్నం స్వప్నంగా మారింది. ఇది సాధ్యం కాదకున్నారేమో.. ముఖ్యమంత్రి రవీంద్రభారతి పునరుద్ధరణ కోసం రూ.3 కోట్లు కేటాయించారు. 

‘‘ముత్యపు చిప్ప ఆకృతిలో రవీంద్రభారతి అన్నప్పుడు మళ్లీ పునరుద్ధరణ ఏంటని పలువురు అప్పట్లో విమర్శలకు దిగారు. అయినా రూ.2.7 కోట్లు ఖర్చుతో ఇటీవల రవీంద్రభారతి పునరుద్ధరించారు. ఈ పనులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహించింది. పనులు పూర్తి చేసి మూడు నెలలు తరగకుండానే రవీంద్రభారతిలోని 42 కుర్చీలు దెబ్బతిన్నాయి. ఈ ఐదేళ్ల పదవీ కాలంలో సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకోవడం కష్టమని కళాకారులు వాపోతున్నారు’’.

కోర్టు చిక్కుల్లో కళాభారతి...
సీఎం కేసీఆర్‌ పేర్కొన్న రెండో సాంస్కృతిక చిహ్నం కళాభారతి. రూ.300 కోట్లతో ధర్నా చౌక్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అద్భుత కళాభారతి నిర్మాణం 14 ఎకరాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆరు ఎకరాల్లో భవనాలు నిర్మించి మిగతా అంతా పార్కింగ్‌కు ఉంచుతామన్నారు. సాంస్కృతిక – సాహిత్య ప్రక్రియల అకాడమీలు అందులోనే ఉంటాయన్నారు. 200 నుంచి 3 వేల మంది వరకు వేర్వేరు ఆడిటోరియాలు కళాభారతిలో అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు. ముంబైకి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించి కళాభారతి నమూనాను కూడా విడుదల చేశారు. ఇంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

‘‘ఎన్టీఆర్‌ స్టేడియం స్థలంలో కళాభారతి నిర్మాణం చేపట్ట వద్దని వాకర్స్‌ క్లబ్‌ వారు కోర్టు వెళ్లడంతో ఇప్పుడిది చిక్కుల్లో ఇరుక్కుంది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో కోర్టు చిక్కులు తొలగే అవకాశం లేదని సాంస్కృతిక శాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం. సీఎం కేసీఆర్‌ హామీలైన ఈ రెండు సాంస్కృతిక చిహ్నల విషయంపై భవిష్యత్తు చర్యలేంటన్న దానిపై భాషా సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు’’. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top