పట్టాలెక్కనున్న సీఎం కలల ప్రాజెక్టు | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కనున్న సీఎం కలల ప్రాజెక్టు

Published Thu, May 19 2016 3:49 AM

CM Dream Project on prosses

- సికింద్రాబాద్-కరీంనగర్ రైల్వే లైను పనులు ఈ ఏడాదే మొదలు
- ద.మ.రైల్వే జీఎం- సీఎస్ భేటీలో కీలక నిర్ణయాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్-కరీంనగర్ (మనోహరాబాద్-కొత్తపల్లి) రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేటను రాజధాని నగరంతో రైల్వే లైను ద్వారా అనుసంధానించే ఈ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఇందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఉచితంగా అందజేయనుంది. భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ఈ ఏడాదే పూర్తి చేయనున్నట్టు రైల్వే జీఎంకు రాజీవ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు రూ.1,160కోట్ల ప్రాథమికఅంచనాను రైల్వే శాఖ ఖరారు చేసింది. దీంతో ఈ ఏడాదే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రైల్వే జీఎం తెలిపారు. 
 
 కొత్త టెర్మినళ్లకు త్వరలో స్థల సేకరణ
 చర్లపల్లి, నాగులపల్లిలో నిర్మించబోయే ఆధునిక టెర్మినళ్లకు కూడా త్వరలో స్థల సేకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా నిర్మిస్తున్న కరీంనగర్-నిజామాబాద్ ైరె ల్వే మార్గంలో 3 చోట్ల తాత్కాలిక లెవల్ క్రాసింగ్స్‌కు అవకాశం కల్పించాలని సమావేశంలో నిర్ణయిం చారు. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైను రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని జీఎం గుప్త తెలిపారు. మటంపల్లి-జన్‌పహాడ్ లైనులో మిగిలిన 20 కిలోమీటర్ల పనులు ఈ సంవత్సరమే పూర్తయ్యేలా చూడాలని రాజీవ్‌శర్మ జీఎం రవీంద్రగుప్తాకు సూచించారు. ఎంఎంటీఎస్-2కు సంబంధించి చెర్లపల్లి-మౌలాలీ-ఘట్కేసర్ సెక్షన్ పనులకు గాను ఐదెకరాల స్థలం కావాలని జీఎం రవీంద్రగుప్త కోరగా దాన్ని గుర్తించి కేటాయించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను రాజీవ్‌శర్మ ఆదేశించారు.

Advertisement
Advertisement