
సాయిరంగ్ స్టేషన్ సమీపంలో నిర్మించిన వంతెన
ఇంజనీరింగ్ అద్భుతంగా రైల్వే లైను నిర్మాణం
మిజోరం రాజధాని ఐజోల్‌ను అనుసంధానిస్తూ 52 కిలోమీటర్ల కారిడార్
153 వంతెనలు, 45 సొరంగాలతో నిర్మాణం
కి.మీ.కు రూ.157 కోట్ల భారీ వ్యయంతో సాహసోపేత ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతికష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు
రేపు జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్‌లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది.
ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు.
వంతెనలు, సొరంగాలు...
ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.
అంటే మొత్తం రైలు కారిడార్‌లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట.
ఐజోల్‌కు భాగ్యం
⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్‌కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది.
⇒ ఐజోల్‌కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్‌కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్‌ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది.
⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది.