
రూ.5,500 కోట్లకు పైగా వ్యయం.. అంతర్మథనంలో రైల్వే బోర్డు
రాజకీయ ఒత్తిడి వస్తేనే ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపే పరిస్థితి
దక్షిణ తెలంగాణలోని కీలక పట్టణాలను అనుసంధానించే ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేటలాంటి కీలక ప్రాంతాలకు ఇప్పటి వరకు రైలుమార్గం లేదు. ఈ మార్గాలను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు భారీ వ్యయం అవుతున్నందున రైల్వేబోర్డు ఎటూ తేల్చుకోలేకబోతోంది. దాదాపు రూ.5,500 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉన్నందున.. ఈ మార్గాన్ని నిర్మిస్తే రైల్వేకు వచ్చే ఆదాయం ఎంతో లెక్కలేసుకుంటోంది.
ఆదాయం అంతగా ఉండదని భావిస్తే ఈ కీలక మార్గం మంజూరయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును సాధించాలంటే రాజకీయ ఒత్తిడి కీలకంగా మారబోతోంది. నేతలు గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప ఇది సాకారం అయ్యే సూచనలు కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏంటా ప్రాజెక్టు.. ఎందుకు టెన్షన్
తెలంగాణలో ఆది నుంచి రైల్వే అనుసంధానం తక్కువ. అందులోనూ దక్షిణ తెలంగాణలోని కీలక ప్రాంతాలకు రైల్వే భాగ్యం లేకుండా పోయింది. ఉన్న ప్రధాన లైన్లు తప్ప, వాటిని అనుసంధానించే కొత్త లైన్లు లేవు. ఈ తరుణంలో రైల్వే శాఖ సికింద్రాబాద్–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్‌లో ఉన్న డోర్నకల్ నుంచి కాచిగూడ–బెంగుళూరు ప్రధాన లైన్‌లో ఉన్న గద్వాలను అనుసంధానిస్తూ కొత్త రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఇటీవల ఫైనల్ లొకేషన్ సర్వేను పూర్తి చేసింది. ఇప్పుడు అందులో కీలకమైన డీపీఆర్ తయారీ దాదాపు పూర్తయ్యింది.
ఇప్పుడు దీనిపై రైల్వేబోర్డు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. డోర్నకల్‌లో ప్రారంభమయ్యే కొత్త లైన్ ఖమ్మంలోని కూసుమంచి, పాలేరు మీదుగా దక్షిణ తెలంగాణలో కీలక పట్టణాలైన సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి, భూత్పూర్‌ల మీదుగా సాగి గద్వాల వద్ద ముగుస్తుంది. దీని నిడివి దాదాపు 300 కి.మీ. ఈ ప్రాంతాల్లో చాలా వాటికి ఇప్పటి వరకు రైలు వసతి లేదు. రైల్వేలైన్ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో పురోగతి వేగం అందుకుంటుంది.
పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. దీంతో ఈ రైలు మార్గం దక్షిణ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మార్చే కీలక ప్రాజెక్టు. నిడివి ఎక్కువగా ఉండటంతో ఈ రైలు మార్గం నిర్మాణానికి దాదాపు రూ.5,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని డీపీఆర్ ప్రాథమిక కసరత్తు చెబుతోంది. అధికారిక అంచనా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి జరుగుతున్న కసరత్తు మేరకు, ఇది భారీ ఖర్చుతో కూడుకున్నందున దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆదాయం అంతగా రాదని..
ప్రయాణికుల రైళ్లతో పెద్దగా ఆదాయం ఉండదు. సరుకు రవాణా రైళ్లతోనే ఆ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. సిమెంటు పరిశ్రమలు, బొగ్గు గనులు, భారీ వ్యవసాయ మార్కెట్లు ఉన్న ప్రాంతాల మీదుగా సరుకు రవాణా రైళ్ల అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త మార్గంలో సిమెంటు పరిశ్రమలు పెద్దగా లేవు. ఉమ్మడి ఖమ్మం ప్రాంతం మీదుగా సాగనున్నందుకు బొగ్గు తరలింపునకు అవకాశం ఉంది.
రూ.ఐదున్నర వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందున రేట్ ఆఫ్ రిటర్న్స్ బ్రేక్ ఈవెన్‌ను మించేలా ఉంటే ఈ ప్రాజెక్టును చేపట్టే వీలుంది. బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోకుంటే నష్టం తెచ్చే ప్రాజెక్టుగా ముద్ర వేసి దాన్ని పక్కనపెట్టేస్తారు. దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే తరుణం అయినందున, ఇప్పుడే రాజకీయ ఒత్తిడి ఉండాలన్న సూచనలు వస్తున్నాయి.