తెలంగాణ వాదనలపై మీ వైఖరేంటి? | CEA committee wrote a letter to AP Energy Department | Sakshi
Sakshi News home page

తెలంగాణ వాదనలపై మీ వైఖరేంటి?

Aug 19 2014 2:00 AM | Updated on Mar 28 2019 5:30 PM

కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుతోపాటు కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపు తదితర విషయాల్లో తెలంగాణ ఇంధనశాఖ లేవనెత్తిన అంశాలపై వైఖరి తెలియజేయాలని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) కమిటీ..

ఏపీ ఇంధన శాఖకు సీఈఏ కమిటీ లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుతోపాటు కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపు తదితర విషయాల్లో తెలంగాణ ఇంధనశాఖ లేవనెత్తిన అంశాలపై వైఖరి తెలియజేయాలని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) కమిటీ.. ఏపీ ఇంధనశాఖను కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు సీఈఏ చైర్‌పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇప్పటివరకు రెండుసార్లు సమావేశమైంది.
 
ఆగస్టు 4న జరిగిన సమావేశంలో తెలంగాణ ఇంధనశాఖ వినిపించిన కొత్త వాదనలపై ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని తాజాగా సీఈఏ కమిటీ కోరింది. వీటిపై తమ పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్టు తెలపాలని ఏపీ నిర్ణయించింది.  రెండు మూడు రోజుల్లో కమిటీకి సమాధానం పంపనున్నట్టు తెలిసింది. ఏపీ నుంచి సమాధానం అందడంతోపాటు అటార్నీ జనరల్ నుంచి న్యాయసలహా వచ్చిన తర్వాత కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు సీఈఏ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం.  కేంద్రం ఆదేశాలను ఇరు రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా కేంద్రం ఆదేశాలను వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశమూ లేకపోలేదు.
 
తెలంగాణ లేవనెత్తిన అంశాలు.. ఏపీ వైఖరి
* శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటులో తెలంగాణ జెన్‌కోతోపాటు తెలంగాణ డిస్కంల(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్)కు ఎక్కువ వాటా ఉంది. ప్లాంటు నిర్వహణను తెలంగాణకే ఇవ్వాలి.
ఏపీ వైఖరి: విభజన చట్టం మేరకు ఎక్కడి ప్లాం ట్లు ఆ ప్రాంతానికే చెందుతాయి. కృష్ణపట్నం ప్లాంటు ఏపీ జెన్‌కోకే చెందుతుంది.  
* కర్నూలు, అనంతపురం జిల్లాలోని సంప్రదాయేతర ఇంధన వనరుల  నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకూ వాటా ఇవ్వాలి.
ఏపీ వైఖరి: ఈ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్‌సీఈ ప్లాంటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే విద్యుత్ అని ఉమ్మడి రాష్ర్టంలోనే ఉత్తర్వులిచ్చారు.
* కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపులను సవరించడం కుదరదు.

ఏపీ వైఖరి: సీజీఎస్ కోటా కేటాయింపులో లోపాలు జరిగాయి. ఈ విషయాన్ని మొదటి సమావేశంలో తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. అందువల్ల సీజీఎస్ కోటాలో ఏపీకి కేటాయింపులు పెరగాలి. అదనంగా 1.77 శాతం (65 మెగావాట్లు) ఏపీకి ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement