పురుషోత్తంరెడ్డి కేసులో నిశాంత్‌రెడ్డికి ఊరట | Bail granted to Nishantha Reddy in high court | Sakshi
Sakshi News home page

పురుషోత్తంరెడ్డి కేసులో నిశాంత్‌రెడ్డికి ఊరట

Mar 7 2018 12:23 AM | Updated on Aug 31 2018 8:40 PM

Bail granted to Nishantha Reddy in high court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ పురుషోత్తంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో నిందితునిగా ఉన్న గడ్డం నిశాంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీట్‌ దాఖలు చేసేంత వరకు ఏసీబీ అధికారుల ముందు ప్రతీ సోమ, బుధ వారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురుషోత్తంరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతని సమీప బంధువైన నిశాంత్‌రెడ్డి (పురుషోత్తంరెడ్డి అల్లుడు నిపుణ్‌రెడ్డి సోదరుడు)ని నిందితునిగా చేర్చారు. పురుషోత్తంరెడ్డితో ఓ ఆస్తి అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారని, పురుషోత్తంరెడ్డి డబ్బును దాచేందుకే ఇలా చేశారంటూ గత నెల 9న నిశాంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది.

పురుషోత్తంరెడ్డి ఆస్తులకు సంబంధించి నిశాంత్‌రెడ్డిని పలు రకాలుగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిశాంత్‌రెడ్డి హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. తనను ఏసీబీ అధికారులు ప్రశ్నించడం పూర్తయిన దరమిలా బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement