‘ఆటో’ రాంగ్‌రూట్‌ | Auto driver indecent behavior with women | Sakshi
Sakshi News home page

‘ఆటో’ రాంగ్‌రూట్‌

Apr 2 2017 4:38 AM | Updated on Aug 11 2018 8:18 PM

‘ఆటో’ రాంగ్‌రూట్‌ - Sakshi

‘ఆటో’ రాంగ్‌రూట్‌

ఆటో ఎక్కిన ఓ యువతిని డ్రైవర్‌ దారి మళ్లించాడు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించగా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది.

- యువతిని దారి మళ్లించిన ఆటో డ్రైవర్‌.. అసభ్య ప్రవర్తనకు యత్నం
- తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- సీసీ పుటేజీ పరిశీలన.. నిందితుడి కోసం గాలింపు


హత్నూర: ఆటో ఎక్కిన ఓ యువతిని డ్రైవర్‌ దారి మళ్లించాడు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించగా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన బీటెక్‌ చదివిన ఓ యువతి మార్చి 13న హైదరాబాద్‌కు వచ్చింది. కూకట్‌పల్లి పీజీ గ్రీన్‌హోంలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో చేరింది. హైటెక్‌ సిటీ సమీపంలోని కొండా పూర్‌లో స్నేహితుల వద్ద ఉంటోంది. సంగా రెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో తన స్నేహితుల వద్దకు వెళ్లేందుకు శనివారం హైటెక్‌ సిటీ కొండాపూర్‌ నుంచి క్యాబ్‌లో పటాన్‌చెరుకు వచ్చింది.

అక్కడి నుంచి బస్సులో బయలుదేరి కంది బస్టాప్‌లో దిగింది. ఐఐటీ హాస్టల్‌కు వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటోలో కూర్చుంది. కంది బస్టాప్‌ నుంచి రెండు నిమిషాల వ్యవధిలో ఐఐటీ హాస్టల్‌కు చేరుకునే అవకాశం ఉన్నా డ్రైవర్‌ దారి మళ్లించాడు. అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్‌ నుంచి రూట్‌ సెర్చ్‌ చేయగా రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. రాంగ్‌రూట్‌లో వెళుతున్నారని, వెంటనే ఆటోను వెనక్కి మళ్లించాలని సూచించింది. ఈ విషయం డ్రైవర్‌కు చెప్పగా ఐఐటీకేనంటూ నమ్మించి మరో 10 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లాడు. భయంతో కేకలు వేయగా బెదిరించి చేతిలో నుంచి మొబైల్‌ లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె ఆటోలో నుంచి కిందకు దూకి ఓ కారును ఆపింది. తన పరిస్థితిని వివరించి అదే కారులో హత్నూర పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది.

ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..
విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వెంకటేశం, హత్నూర ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ పెట్రోలు పోయించుకున్న మల్కాపూర్‌ శివారులోని బంక్‌ వద్దకు వెళ్లి ఆరా తీశారు. పెట్రోలు పోసుకున్న సమయాన్ని తెలుసుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో డ్రైవర్‌ ముఖం స్పష్టంగా కన్పించగా ఆటో నంబరు కనిపించలేదు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement