ఉత్తర్వు ద్వారా చట్ట సవరణా? | Amendment of the law by decree? | Sakshi
Sakshi News home page

ఉత్తర్వు ద్వారా చట్ట సవరణా?

Feb 4 2016 3:18 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఉత్తర్వు ద్వారా చట్ట సవరణా? - Sakshi

ఉత్తర్వు ద్వారా చట్ట సవరణా?

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా తమ ఓటును జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మార్చుకున్న ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో

♦ ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై హైకోర్టు
♦ జీవో ద్వారా చట్టాన్ని సవరిస్తారా అని ప్రభుత్వానికి ప్రశ్న
♦ విచారణ నేటికి వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా తమ ఓటును జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మార్చుకున్న ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టానికి అధికార ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ద్వారా సవరణ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్ట సవరణకు ప్రభుత్వం అనుసరించిన విధానం సరికాదని స్పష్టంచేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి అభ్యర్థించడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 5(1)-ఏ ప్రకారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసే నాటికి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే తేదీ నాటికి గ్రేటర్ పరిధిలో ఓటరుగా నమోదైన ఎమ్మెల్సీలకే ఎక్స్ అఫీషియో హోదాలో మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉండేది. గతేడాది డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వం ఈ సెక్షన్‌ను తొలగిస్తూ జీవో 207 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 100, 101 సెక్షన్ల ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈ చట్ట సవరణ చేసినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది.

ఈ జీవోను సవాలు చేస్తూ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ... అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేయడం చెల్లదన్నారు. మేయర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 100, 101 సెక్షన్ల ప్రకారం ఒకసారి మాత్రమే అధికార ఉత్తర్వు ద్వారా సవరణకు అవకాశం ఉంటుందని, తర్వాత చేసే ప్రతీ సవరణ శాసన వ్యవస్థ ద్వారానే జరగాల్సి ఉందన్నారు.

అవిభాజ్య రాష్ట్రంలో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టాన్ని తమ రాష్ట్రానికి వర్తింపచేసుకున్నప్పుడే మొదటి అవకాశం పూర్తయిందని, కాబట్టి ఈ చట్టానికి తదుపరి చేసే ప్రతీ సవరణ శాసన వ్యవస్థ ద్వారానే జరగాలన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అధికార ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేసిందని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం జారీ చేసిన ఈ జీవోపై జోక్యం చేసుకోవాలని రఘునందన్‌రావు కోర్టును కోరారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, చట్ట సవరణకు ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఘాటుగా వ్యాఖ్యానించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను గురువారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement