భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి.. | 5-Year-old daughter in car, He tried to burn wife's chopped up body in hyderabad | Sakshi
Sakshi News home page

భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి..

Jul 5 2016 2:28 AM | Updated on Mar 28 2018 11:26 AM

భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి.. - Sakshi

భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి..

భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో తెచ్చి నిప్పంటించి వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్థానికులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

- తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన భర్త
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఘటన
- ఇంట్లో చంపి.. శవాన్ని బ్యాగులో కుక్కి..
- చెత్త పడేద్దామంటూ కూతురును కారులో వెంట తీసుకెళ్లిన రూపేశ్
- ఆమెను కొద్ది దూరంలోనే దించేసి.. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన వైనం
- తిరిగి వస్తుండగా వాహనం బురదలో ఇరుక్కోవడంతో చిక్కిన రూపేశ్

 
శంషాబాద్ రూరల్: భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తప్పించుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్‌కుమార్ షేర్ మార్కెట్‌లో బాగా నష్టపోయాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య సింతియా(30)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగులో ఉంచాడు.

కూతురు సానియా(8)కు అనుమానం రాకుండా సోమవారం ఉదయం పాఠశాలలో విడిచిపెట్టాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక  బ్యాగులోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలసి శంషాబాద్ శివారులోని మదన్‌పల్లికి రాత్రి ఏడు గంటల సమయంలో ఫోర్డ్ కారులో వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రీన్‌సిటీ వెంచరులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగును కిందకు దించాడు.
 
 బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అక్కడికి వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి బయలుదేరాడు. మదన్‌పల్లి శివారులోకి వెళ్లగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది.

గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. కంగారులో ఉన్న రూపేశ్‌కుమార్ పొంతన లేని సమాధానాలు చెప్పడం, దూరంగా మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతురును ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ ఏసీపీ అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
 
ఏం జరిగిందో.. ?
భార్యను అత్యంత దారుణంగా నరికి చంపడం వెనుక బలమైన కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు విచారించే క్రమంలో అతను తన కూతురు ముందు హత్య విషయాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీసులు వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని కూతురుకు తెలియకుండా దాచిపెట్టడం, ఇంట్లోనే భార్యను హత్య చేసి ఇక్కడికి తీసుకురావడం అన్నీ పథకం ప్రకారం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement