
ఈ బంగారు తల్లిని బడి మింగింది
ఆడుతూ పాడుతూ స్కూలుకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి.. కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైపోయింది.
* గోడకు, లిఫ్టుకు మధ్య తల ఇరుక్కుని 20 నిమిషాలు నరకయాతన
* అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలిన నాలుగేళ్ల పాప
* మూడు నెలలుగా లిఫ్టుకు మరమ్మతు చేయించని స్కూల్ యాజమాన్యం
* విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
* పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్, టీచర్.. స్కూల్‌ను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్: ఆడుతూ పాడుతూ స్కూలుకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి.. కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైపోయింది. సరిగా పనిచేయని లిఫ్టు ఆ చిన్నారి ప్రాణాలను నిలువునా మింగేసింది.. లిఫ్టుకు, గోడకు మధ్యన చిన్నారి తల ఇరుక్కుపోయి ఊపిరాడక గిలగిలలాడిపోయింది.. దాదాపు 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించి అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలింది. నగరంలో మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం రెవెన్యూబోర్డు కాలనీలో ఓ ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన 'స్టార్‌కిడ్స్ ప్రీమియం' ప్లేస్కూల్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇది.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన అజీజ్ హుస్సేన్, జైన్ ఫాతిమాల కుమార్తె సయిదా జైనబ్ ఫాతిమా జాఫ్రీ (4) స్టార్‌కిడ్స్ ప్లేస్కూల్లో నర్సరీ చదువుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బాలికను స్కూల్‌లో వదిలిపెట్టి వెళ్లారు. టీచర్ సరోజిని 8 మంది పిల్లలతో కలసి లిఫ్ట్‌లో పై అంతస్తుకు వెళుతోంది. ఆ సమయంలో లిఫ్టు డోర్ (గ్రిల్ డోర్) తెరిచి ఉంది.
లిఫ్ట్ కదులుతుండగానే డోర్ తెరిచి ఉన్న చోటి నుంచి ఫాతిమా జాఫ్రీ లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమె తల లిఫ్టు అడుగు భాగానికి, గోడకు మధ్య చిక్కుకుపోయింది. చిక్కుకున్న ఆమె తలను రాసుకుంటూ లిఫ్టు మొదటి అంతస్తు వరకు వచ్చి ఆగిపోయింది. అప్పటికే లోపల ఉన్న తోటి చిన్నారులు, టీచర్ కేకలు వేయడంతో.. కింద ఉన్న సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పైకి చేరుకున్నారు. లిఫ్టు డోర్‌ను తెరిచి లోపల ఉన్న మిగతా చిన్నారులను, టీచర్‌ను బయటకు తీశారు. కానీ ఫాతిమా జాఫ్రి తల ఇరుక్కుపోయి ఉండడంతో పైకి తీయలేకపోయారు. అదే స్థితిలో దాదాపు 20 నిమిషాలపాటు ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న చిన్నారి.. చివరికి ప్రాణాలు వదిలింది. లిఫ్టుకు, గోడకు మధ్య నలిగి పోవడంతో చిన్నారి ముఖం రక్తసిక్తమైంది. విద్యార్థుల తల్లిదండ్రులు 108, పోలీసులకు సమాచారం అందించారు.
ఉద్రిక్త వాతావరణం..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లిఫ్టును పైకి జరిపించి చిన్నారి మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఉన్న టీచర్ సరోజినిని, ప్రిన్సిపాల్ శాలినిలను అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ ఇన్‌చార్జి సతీష్ పరారీలో ఉన్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాల వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. అక్కడ పెద్దఎత్తున జనం గుమిగూడడం, పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిని తమకు అప్పగించాలని, అంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. ఇక సైదాబాద్ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి సుశేంద్రరావు స్టార్‌కిడ్స్ పాఠశాలను సీజ్ చేశారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా.. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చిన్నారిప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఇక చిన్నారి మృతి ఘటనతో పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కొంత సేపటి తర్వాత వదిలిపెట్టారు.
కనీస వసతులూ లేవు
వాస్తవంగా ప్రస్తుతం స్టార్‌కిడ్స్ స్కూల్ కొనసాగుతున్న ఈ భవనాన్ని గృహ నివాసానికి వీలుగా నిర్మించారు. జీప్లస్3 అంతస్తులతో ఉన్న ఈ ఇంటిని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ లీజుకు తీసుకుని ప్లేస్కూల్‌ను నడుపుతోంది. పాఠశాలకు ఉండాల్సిన కనీస అర్హతలు, ప్రమాణాలు ఈ భవనంలో లేవు. గదులకు రెండు వైపులా తలుపులు లేవు. ఒకే ప్రవేశమార్గంతో ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన (ఫైర్ సేఫ్టీ) చర్యలు లేవు.
ప్రాణం తీసిన నాసిరకం లిఫ్ట్
పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలున్న లిఫ్ట్‌ను ఏర్పాటు చేయకపోవడమే దుర్ఘటనకు ప్రధాన కారణం. వాస్తవంగా ప్రమాదానికి కారణమైన ఈ లిఫ్ట్ ఇటీవలే మరమ్మతులకు వచ్చింది. టీచర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి కొన్ని రోజుల క్రితమే తీసుకెళ్లారు. అయినా మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు ప్లేస్కూల్‌లో ఉండే చిన్నారులంతా ఐదేళ్ల లోపువారే. వారికి లిప్ట్ ఎలా వాడాలో తెలియదు, వారిని పైకి, కిందికి తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఆపరేటర్‌ను కూడా నియమించలేదు. అసలు లిఫ్ట్‌కు ఉండే ఇనుప గేట్ (గ్రిల్ డోర్), బయటి వైపు ఉండే గేటు (ల్యాండింగ్ గేట్)లు మూసివేస్తేనే లిఫ్ట్ కదలాలి.
కానీ ఇక్కడ వాటిని మూయకున్నా లిఫ్టు కదులుతుందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. అదే చిన్నారి జిహానా మరణానికి కారణమైంది. ఈ లిఫ్టు లోపలిగేటుకు లాకింగ్ సదుపాయం పూర్తిగా లేదని, బయటి గేటుకు లాకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పనిచేయడం లేదని ప్రముఖ లిఫ్ట్ కంపెనీకి చెందిన మెకానిక్ ‘సాక్షి’కి తెలిపారు. లిఫ్టుకు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ వ్యవస్థల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పైగా లిఫ్టుపై ఎక్కడా తయారు చేసిన కంపెనీ పేరు లేదు. ఏ కంపెనీ అయినా పేరు, సామర్థ్యం తదితర వివరాలను ప్రముఖంగా కనిపించేలా రాస్తారు. కానీ ఈ లిఫ్ట్ బయటి వైపుగాని, లోపలి వైపుగాని ఆ వివరాలు లేవు.
కాపాడలేకపోయాం..
'మా పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. రోజూ వారిని పాఠశాలకు తీసుకొచ్చి, క్లాస్‌లోకి వెళ్లే వరకు స్కూల్ బయటే ఉంటాను. ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఒక్కసారిగా కేకలు, అరుపులు వినపడడంతో భయం వేసి పైకి వెళ్లాను. జాఫ్రీ లిఫ్ట్‌లో ఇరుక్కుని దాదాపు 20 నిమిషాలు గిలాగిలా కొట్టుకుంది. పోలీసులు, 108కు సమాచారం అందించాను. కాపాడటానికి ఎలాంటి అవకాశం కనిపించ లేదు. చూస్తుండగానే ప్రాణాలు వదిలింది. ఈ స్కూల్లో లిఫ్ట్ ఓపెన్ చేసే పిల్లలను తీసుకెళ్తుంటారు. చాల సార్లు ఈ విషయాన్ని అడిగాను కూడా..'
- అల్లాఫ్ హుస్సేన్, ప్రత్యక్షసాక్షి
సుమోటోగా విచారణ
'చిన్నారి దుర్మరణం ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖాధికారికి నోటీసులు ఇచ్చాం. సమగ్ర దర్యాప్తు జరిపి ఈనెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని కోరాం. ప్లేస్కూల్లో లిఫ్ట్‌లను వినియోగించకూడదు. ఫైర్ సేప్టీ, భద్రతా ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించాం..'
- అచ్యుత్‌రావు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు