వరి సాగు 17 శాతమే | 17 per cent of rice cultivation | Sakshi
Sakshi News home page

వరి సాగు 17 శాతమే

Jan 21 2016 3:36 AM | Updated on Jun 4 2019 5:04 PM

వరి సాగు 17 శాతమే - Sakshi

వరి సాగు 17 శాతమే

రబీలో పంటల పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా మారింది. ఈ సీజన్‌లో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా...

♦16.12 లక్షల ఎకరాలకు గాను... 2.72 లక్షల ఎకరాల్లోనే నాట్లు
♦ 76 శాతం నమోదైన వర్షపాతం లోటు
♦ రబీలో వ్యవసాయ పంటల పరిస్థితి ఘోరం
♦ వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: రబీలో పంటల పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా మారింది. ఈ సీజన్‌లో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 13.37 లక్షల ఎకరాల్లోనే (43%) సాగైంది. అందులో వరి సాగు సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 2.72 లక్షల ఎకరాల్లోనే (17%) నాట్లు పడ్డాయి. రబీ సీజన్‌లో మొత్తం వ్యవసాయ పంటల సాగు అత్యంత నిరాశజనకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తుపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం తిండిగింజలు కూడా పండే పరిస్థితి లేకపోవడంపై విచారం వ్యక్తంచేస్తున్నారు. ఒక్క పప్పుధాన్యాల సాగు మాత్రమే  ఊరటనిచ్చే అంశం. సాధారణంగా రబీలో పప్పుధాన్యాల సాగు 3.45 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 3.62 లక్షల ఎకరాల్లో (105%) సాగు జరిగిందని వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది.

 వర్షపాతం లోటు 76 శాతం...
 వ్యవసాయ పంటల సాగు అత్యంత ఘోరంగా ఉండటానికి ప్రధాన కారణం వర్షపాతం సాధారణం కంటే అత్యంత తక్కువ నమోదు కావడమే. రబీ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో సరాసరి సాధారణంగా 136 మిల్లీమీటర్ల (ఎం ఎం) వర్షపాతం కురవాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం 33 ఎంఎంలే  నమోదైంది. అంటే ఏకంగా 76% లోటు రికార్డు అయింది. అత్యధికంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 91% లోటు నమోదు కావడం గమనార్హం. దీంతో బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. జలాశయాల్లోని నీటి నిల్వలు ఇంకిపోతున్నాయి. ఫలితంగా ఘోరమైన కరువు తాండవిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement