గుంటూరులో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు

గుంటూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు అయింది. ఆధార్ కార్డులో ఫోటో మార్చి రోగి బంధువుగా చూపించి కిడ్నీల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఓ డాక్టరే ఈ రాకెట్‌ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా ఈ దందా నడుస్తోన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే మూడు కిడ్నీలు కొనుగోలు చేసినట్లు బయటపడింది. నాలుగో కిడ్నీ కొనుగోలు విషయంలో తేడా రావటంతో విషయం బయటికి పొక్కింది. ఈ విషయం గురించి గతంలోనే నరసరావుపేట తహశీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

వేదాంత ఆసుపత్రి ఎండీ వివరణ

కిడ్నీ మార్పిడి తమ ఆసుపత్రిలో జరగలేదని వేదాంత ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ రాధాకృష్ణ తెలిపారు. శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ అవసరమని ప్రభుత్వానికి తామే రిఫర్‌ చేశామని, కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చిన వెంకటేశ్వర్‌ నాయక్‌ను శివ నాగేశ్వరరావు బంధువులే తీసుకువచ్చారని రాధాకృష్ణ చెప్పారు. ఐదు రోజుల క్రితం విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగిందని వెల్లడించారు. ఈ కిడ్నీరాకెట్‌కు తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top