జీవితం వడగాడ్పు, కవిత్వం వెన్నెల

Yarlagadda Lakshmi Prasad Memorise Gurram Jashuva On His Birth Anniversary - Sakshi

సందర్భం : నేడు జాషువా జయంతి

మనిషిని మనిషి కించపరిచి, అసహ్యించుకుని, ఊడిగింపు చేయించుకుని అధఃపాతాళానికి తొక్కే సమాజ పరిస్థితులున్నంతవరకూ దేశంలో ఎన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆ సమాజం అభివృద్ధి చెందనట్లే భావించాలి. ఈ పరిస్థితి మారాలంటే కొన్ని దశాబ్దాల క్రితం మహాకవి గుర్రం జాషువా అనుభవించిన వేదనను మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేదన కొన్ని వేల ఏళ్ల దళిత ఆక్రందనల ప్రతిఫలన. అది పీడితుల బాధలతో, గాథలతో అప్పుడూ ఇప్పుడూ మమేకమవుతున్న హృదయ స్పందన. 

స్వాతంత్య్రోద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉపాధ్యాయ శిక్షణను పొంది తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. మహా మహా పండితులతో సమానంగా తెలుగు పద్యాలు రాయగల శక్తిని సంపాదించారు. వినుకొండలో జరిగిన  ఒక సభలో జాషువా  తన ఆశుకవితా నైపుణ్యంతో సభికులను మెప్పించారు. అయితే ఈ సభలో ఒక నిమ్నజాతికి చెందిన కవికి ఎలా ప్రవేశం కలిగిందని కొందరు ఆగ్రహించడంతో జాషువా నీరుకారి పోకుండా మరింత పట్టుదలతో అద్భుతమైన సాహిత్యాన్ని సృజించారు.  ఒక సారి రైలులో ఒక రాజావారు తనతో ప్రయాణిస్తున్న జాషువా కవి అని తెలుసుకుని ఆయన కవితలు విని మెచ్చుకున్నారు. చివరిలో జాషువా కులం గురించి తెలుసుకుని చివాలున లేచిపోయారు. దీంతో ‘తన కవితా వధూటిని చూసి భళి భళి అన్నవారే కులం తెలుసుకుని చివాలున లేచిపోతే  బాకుతో కుమ్మినట్లుంటుంద’ని పద్యం రాశారు. 

పండితుల సాహచర్యం సంపాదించి పద్యాలు రాయడం నేర్చుకున్నారు. మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలను చదివి భాషపై పట్టు సంపాదించారు.. సరళ గ్రాంథికాన్నీ, ప్రాచీన పద్య ఛందస్సును స్వీకరించి పద్యానికి కూడా జవజీవాలు కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని నిరూపించిన కవి జాషువా. 
జాషువా రచనల్లో గబ్బిలం పద్యకావ్యం ప్రతిఘటనా కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. గుడిలో గబ్బిలానికి ప్రవేశం ఉన్నది కాని దళితుడికి మాత్రం లేదని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన చదివిన ప్రతి ఒక్కరి హృదయాలను కరిగిస్తుంది. ‘ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీవు నా వలె పుట్టు బానిసవు కావు..’ అని ఆయన అంటారు.

ఫిరదౌసి అనే మరో పద్యకావ్యంలో ఒక కవికి అక్షరలక్షలు ఇస్తానని చెప్పిన చక్రవర్తి మాట తప్పడంతో ఆ కవి ఆత్మహత్య చేసుకున్న తీరును అద్భుతమైన శైలిలో అనన్యసామాన్యమైన కవితా ప్రతిభతో వర్ణిస్తారు. ‘రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతివిగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్క లయందు‘. అని రాశారు. జాషువా రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని çశ్మశాన వాటికలోని పద్యాలు చదివిన వారి గుండెలు ఆర్ద్రతతో స్పందించక మానవు.

పేద రైతు కుటుంబంలో జన్మించిన జాషువా రైతన్నల బాధలను తన కవిత్వంలో పండించినంతగా మరెవరూ పండించలేదనే చెప్పాలి. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు’ అన్నాడు. 

తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ‘ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యమైంది’ అన్నారు. ‘తన జీవితంలో అన్నిటికన్నా ఇది అత్యున్నత పురస్కారం’ అని జాషువా అన్నారు. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి శిషు్యడైన విశ్వనాథ సత్యనారాయణ కూడా శారదాదేవీ అనుగ్రహం వల్ల జాషువా కవిత్వంలో మాధుర్యం ధ్వని స్తుందని, ఆయన మధుర కవి అని ప్రశంసించారు. జాషువా రాసిన శిశువు అనే ఖండికను కమనీయంగా గానం చేసిన ఘంటసాల ఇంటిలోకి వెళ్లడానికి తాను తటపటాయిస్తుంటే ఆ గాయకుడు ఎంతో బాధపడ్డారట. ‘నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్థం!’’ అని ఘంటసాల అన్నారట.

‘వడగాడ్పు–నా జీవితమైతే, వెన్నెల–నా కవిత్వం’ అని జాషువా అన్నారు. ఆయన జీవితమంతా వడగాడ్పులా సాగితే వెన్నెల లాంటి ఆయన కవిత్వం నేటికీ మన హృదయాలను రసప్లావితం చేస్తోంది. 
(సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో సభ సందర్భంగా)
వ్యాసకర్త : ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top