బడ్జెట్‌ అంచనాల్లో వాస్తవమెంత?

Suraj Jaiswal Article On Union Budget 2019 - Sakshi

విశ్లేషణ

ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో తాను అమలు చేయనున్న పథకాలు, ప్రాజెక్టులకు ఎంత కేటాయించనుంది, ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం రానున్నట్లు అది అంచనా వేస్తుంది అనే వివరాలను తెలిపే రాబడి, ఖర్చుల చిట్టానే బడ్జెట్‌. ప్రభుత్వం నిర్దిష్ట సంవత్సరంలో తనకు వచ్చే ఆదాయం, తాను పెట్టే ఖర్చు గురించి ప్రారంభ బడ్డెట్‌లో అంచనా వేసినప్పటికీ తర్వాత వాస్తవంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే రాబడి నుంచే ప్రభుత్వ పథకాలకు నిర్దిష్టంగా నిధులు విడుదల అవుతుంటాయి. అందుకే బడ్జెట్‌ అంచనాలను వీలైనంత నిర్దిష్టంగా, ఖచ్చితంగా అంచనా వేయడం ప్రభుత్వ విధి.

ఇంతవరకు కేంద్ర బడ్జెట్‌లో ఆయా ప్రభుత్వాలు పొందుపరుస్తూ వచ్చిన రాబడి అంచనాలు ఏమేరకు నిర్దిష్టమైనవి, ఖచ్చితమైనవి అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే ఒక గణిత శాస్త్ర పజిల్‌ని తలపిస్తుంది. ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అమలు చేయనున్న పథకాలు, ప్రాజెక్టులకు ఎంత కేటాయించనుంది, ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం రానున్నట్లు అంచనా వేస్తుంది అనే రాబడి, ఖర్చుల చిట్టానే కేంద్ర బడ్జెట్‌. ఈ సందర్భంగా, బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం ఆదాయంపై వేస్తున్న అంచనాలకు, వాస్తవంగా నిర్దిష్ట సంవత్సరంలో పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన ఉండేలా ఇకనైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్నులు.. పన్నుల వసూళ్ల ద్వారానే ప్రభుత్వానికి అధిక రాబడి వస్తూంటుంది కాబట్టి ఆదాయ వృద్ధి, ఆర్థిక కార్యాచరణలో ఎగుడుదిగుడులు, అంతర్జాతీయ వ్యాపారం తీరుతెన్నులు వంటి ప్రభావిత అంశాల కారణంగా ఏ బడ్జెట్‌ అంచనాలో అయినా సరే రాబడి విషయంలో పరిపూర్ణమైన నిర్దిష్టత, ఖచ్చితత్వం నమోదవడం అనిశ్చితంగానే ఉంటుందని చెప్పాలి. ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టనుంది అనేది ఆ సంవత్సరంలో అది ఎంత రాబడిని పెంచదల్చుకుంది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలకు, పెరిగిన వాస్తవ రాబడికి మధ్య పొంతన ఉండదు. ఈ అనిశ్చితి ఏ బడ్జెట్‌ కయినా తప్పదు. కానీ ఈ సంక్లిష్టత వెలుగులోనే వీలైనంత ఉత్తమంగా బడ్జెట్‌ అంచనాలను నిర్దిష్టంగా, ఖచ్చితంగా రూపొందించడం ప్రభుత్వాల విధి. 

ప్రధానంగా ఈ వ్యాసం 2004–05 నుంచి 2016–17 కాలంలో పన్నుల వసూలుపై బడ్జెట్‌ వేసిన అంచనాల నిర్దిష్టతను పరిశీలిస్తుంది. ఈ అంచనాలు ఎంతమేరకు నిర్దిష్టతను సంతరించుకున్నాయో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవ ఆదాయ అంచనా మరీ భిన్నంగా ఉన్నప్పుడు దానివెనుక ఉన్న బలమైన కారణాలను విశ్లేషించడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఈ ప్రయోజనం కోసం బడ్జెట్‌ అంచనాలను (బీఈ) సవరించిన అంచనాలు (ఆర్‌ఈ), వాస్తవ అంచనాల (ఏఈ) తో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో బడ్డెట్‌ డాక్యుమెంట్‌ ఈ మూడు సంఖ్యలనే క్రోడీకరిస్తుంటుంది.

ఈ మూడు సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని వీటి పేర్లే సూచిస్తాయి. బీఈ అంటే బడ్జెట్‌ అంచనాలు. అంటే ఇది ఒరిజినల్‌ అంచనా. ఆర్‌ఈ అంటే తొలి ఆరునెలల కాలానికి ప్రభుత్వానికి వచ్చిన రాబడి లేదా ఖర్చు. పైగా చివరి ఆరు నెలలకు వస్తుందని, అవుతుందని ఊహించిన రాబడి, ఖర్చు కూడా దీంట్లో భాగమే. ఇక ఏఈ అంటే రాబడి, ఖర్చుకు సంబంధించిన నిజమైన సంఖ్యలను తెలుపుతుంది. ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం సేకరించారు, ఎంత ఖర్చుపెట్టారు అనే వాస్తవ సంఖ్యలను ఇది తెలుపుతుంది.  ఈ మూడింటిని (ఏఈ, ఆర్‌ఈ, బీఈ) సరిపోల్చడం ద్వారా, బడ్జెట్‌ డాక్యుమెంట్లలో పొందుపర్చిన అంచనాల నిర్దిష్టతను లేక అనిర్దిష్టతను క్రోడీకరించవచ్చు. 

మొత్తం పన్ను రాబడి
2004–05 నుంచి 2016–17 కాలాన్ని పరిశీలిస్తే ఈ మొత్తం 13 ఏళ్ల కాలంలో తొమ్మిదేళ్లపాటు బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవంగా తేలిన అంచనా తగ్గిపోవడం చూస్తాం. అదేసమయంలో అది బడ్జెట్‌ అంచనాను నాలుగేళ్లలో మాత్రమే అధిగమించింది. 2008–09లో రెండు అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం నమోదైంది. అంటే బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా 12 శాతం తగ్గిపోయింది. ఆ సంవత్సరం పన్నుల రాబడి పెద్దగా పెరగనందున అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంత పెద్ద వ్యత్యాసం ఏర్పడిందని బడ్జెట్‌ నిపుణులు వాదించారు. 

భారతదేశంలో మొత్తం పన్ను రాబడి వివిధ విభాగాల నుంచి వస్తుంటుంది. వీటిలో కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ (సీఐటీ), పర్సనల్‌ ఇన్‌ కమ్‌ టాక్స్‌ (పీఐటీ), ఎక్సైజ్‌ డ్యూటీ (ఈడీ), కస్టమ్స్‌ డ్యూటీ (సీడీ) సర్వీస్‌ టాక్స్‌ (ఎస్‌టి) కొన్ని. ప్రతి విభాగంలోనూ పన్ను రాబడిని విడివిడిగా అంచనా వేస్తుంటారు. వీటిలో ప్రతి ఒక్క విభాగంలో వసూలైన పన్ను రాబడి వివిధ కారణాల వల్ల వ్యత్యాసంతో ఉంటుంది. అందుకు ప్రతి విభాగాన్ని విడివిడిగానే పరిశీలించడం చాలా ముఖ్యం.

సాంప్రదాయకంగా బడ్జెట్లను వివిధ పథకాలకు కేటాయింపులు, కొత్త ప్రోగ్రాంలు, పన్ను క్రమబద్ధీకరణలు వంటివాటిపై ఆధారపడి విశ్లేషిస్తుంటారు. ఈ క్రమంలో బడ్జెట్‌ అంచనాలను సవరించిన, వాస్తవ అంచనాలతో సరిపోల్చడంతో జరిగే లోపాల పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి, శ్రద్ధ ప్రదర్శించడం లేదు. ఉదాహరణకు కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ కేసి చూద్దాం. దీని వాస్తవ సంఖ్యలు బడ్జెట్‌ అంచనా కంటే 11 పర్యాయాలు తక్కువగా నమోదయ్యాయి. అందులోనూ 13 సంవత్సరాల్లో 11 సార్లు ఇలా తక్కువ రాబడి నమోదైంది.  2006–07, 2007– 08 సంవత్సరాలు మాత్రమే దీనికి మినహాయింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు కారణంగా బడ్జెట్‌ అంచనాల కంటే వాస్తవ అంచనా చాలా ఎక్కువగా పోగుపడింది.  అయితే, కార్పొరేట్‌ ఇన్‌కం ట్యాక్స్‌ వసూలు విషయంలో బడ్జెట్లో మితిమీరిన అంచనాను పొందుపర్చారు. చివరి నాలుగేళ్లలో మాత్రమే బడ్జెట్‌ అంచనా మరింత నిర్దిష్టతను, కచ్చితత్వాన్ని సంతరించుకున్నట్లు స్పష్టమవుతోంది.

వ్యక్తిగత ఆదాయ పన్ను: వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో చూస్తే, వాస్తవ అంచనాలు బడ్జెట్‌ అంచనాను అయిదు సందర్భాల్లో అధిగమించాయి. కాగా ఎనిమిదేళ్లలో తగ్గుదలను నమోదు చేశాయి. దీనికి సంబంధించినంతవరకు మొత్తం ట్రెండ్‌ గజిబిజిగా, అత్యంత క్రమరహితంగా సాగింది. కొన్ని అంశాలను ప్రధానంగా సూచించినప్పటికీ వ్యక్తిగత ఆదాయ పన్ను రాబడిని నిర్దిష్టంగా నిర్ధారించడం కష్టసాధ్యమైంది. 2008–09లో వ్యక్తిగత ఆదాయ పన్ను రాబడి (–23 శాతం) తగ్గుముఖం పట్టింది. ఆ సంవత్సరం అంతర్జాతీయంగా ద్రవ్యసంక్షోభం చెలరేగడమే దీనికి కారణం. పైగా, బడ్జెట్‌ అంచనాలో సూచించిన వృద్ధిరేటు కూడా చాలా ఎక్కువగా అంటే 40 శాతం దాకా ఊహించడమైనది. దీంతో బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా తగ్గిపోయింది. 2008–09 అనుభవం నేపథ్యంలో, 2019–10 బడ్జెట్‌ అంచనా వాస్తవానికి ప్రతికూల స్థితికి చేరుకుంది. అందుకే బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా 17 శాతం ఎక్కువగా నమోదైంది.  ఇక 2016–17 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా 3.2 శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో తాము ప్రకటించని ఆదాయాన్ని ఆలస్యంగానైనా సరే ప్రకటించిన వారికి కేంద్రప్రభుత్వం ఆ సంవత్సరంలో క్షమాభిక్షను ప్రకటించిన కారణంగా ఒకే దఫాలో ప్రభుత్వానికి 10వేల కోట్ల ఆదాయం సమకూరింది.

ఎక్సైజ్‌ డ్యూటీ: ఈ అధ్యయన కాలానికిగానూ, మూడు సందర్భాల్లో ప్రత్యేకించి 2015–16, 2016–17 కాలంలో ఎక్సైజ్‌ డ్యూటీకి సంబంధించి బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా ఎక్కువగా కనిపించింది. వరుసగా ఈ రెండు సంవత్సరాల్లో బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా 20 శాతం పెరుగుదలను సూచించింది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడంతో కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్నును పెంచడమే ఈ పెరుగుదలకు కారణం. ఈ పెంచిన పన్ను కారణంగా ప్రభుత్వానికి ఆపారలబ్ధి కలిగింది. అందుకే ఆ సంవత్సరాల్లో వాస్తవ అంచనా అనేది బడ్జెట్‌ అంచనా కంటే పెరిగిపోయింది.

కస్టమ్‌ డ్యూటీ: కస్టమ్‌ డ్యూటీ విషయానికి వస్తే 13 సంవత్సరాల కాలంలో అయిదు సంవత్సరాలపాటు బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా అధికంగా నమోదైంది. దీనికి కారణం ఊహించదగినదే. 2004–05 నుంచి 2007–08 సంవత్సరాల వరకు బడ్జెట్‌ అంచనా కంటే వాస్తవ అంచనా అధిక వృద్ధిని నమోదు చేసింది. తర్వాత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా వాస్తవ అంచనా తగ్గుముఖం పట్టింది. గత నాలుగు సంవత్సరాలుగా కస్టమ్‌ డ్యూటీ ద్వారా రాబడి వసూలులో గుర్తించదగిన అంశాన్ని తిలకించవచ్చు. బడ్జెట్‌లో వేసిన అంచనా సాపేక్షికంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ ఈ రంగంలో వాస్తవ అంచనా అనేది బడ్జెట్‌ అంచనా కంటే తక్కువస్థాయిలో కొనసాగుతోంది.

సర్వీస్‌ టాక్స్‌: ఇతర విభాగాలతో పోలిస్తే సర్వీస్‌ టాక్స్‌ కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. అత్యధిక వృద్ధి సాధించిన సంవత్సరాల్లో బడ్జెట్‌ అంచనాను వాస్తవ అంచనా అధిగమించింది. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభ కాలంలో ఇది తగ్గుముఖం పట్టింది. మిగిలిన సంవత్సరాల్లో ఈ రంగంలో ధోరణులు అటూ ఇటూ అస్థిరంగా సాగాయి. అంటే 2011–12లో బడ్జెట్‌ అంచనాను వాస్తవ అంచనా 10 శాతం మేరకు అధిగమించింది. తర్వాత 2014–15లో అది 20 శాతం వరకు వెనుకబడింది.

ముందే చెప్పినట్లు బడ్జెట్‌ అంచనాలను సవరించిన, వాస్తవ అంచనాలతో సరిపోల్చడంతో జరిగే లోపాల పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి, శ్రద్ధ ప్రదర్శించడం లేదు. అయినప్పటికీ, వాస్తవ రాబడి వసూలు అనేది –చాలావరకు పన్నుల నుంచే వస్తుంటుంది–ప్రభుత్వ పథకాలకు వాస్తవ నిధుల విడుదలను ప్రభావితం చేస్తుంటుంది. అందుకే బడ్జెట్‌ అంచనాలను వీలైనంత నిర్దిష్టంగా ఖచ్చితంగా అంచనా వేయడం ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరి విధిగా, ఆవశ్యకతగా ఉంటోంది.


సూరజ్‌ జైస్వాల్‌(వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ బడ్జెట్, గవర్నెన్స్‌ అకౌంటబిలిటీ పరిశోధకుడు)
-(‘ద వైర్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top