ఏవి బాబూ మొన్న కురిసిన అగ్గి చినుకులు!

Sri Ramana Akshara Tuniram On Chandrababu Naidu - Sakshi

అక్షర తూణీరం

ఇంకా పట్టుమని పది వారాలు కాలేదు. ఇంతకు ముందు ఎలుకలు, పందికొక్కులు తవ్విపోసిన బొరియల లోతులు, గోతుల అంచనాలు సరిగ్గా అంతుపట్టడం లేదు. అప్పుడే తెలుగుదేశం పార్టీ వైఎస్సార్‌సీపీ పాలనమీద నోటికి వచ్చినట్టు విమర్శిస్తూ ఆనందిస్తోంది. టీడీపీ ధోరణి చూస్తుంటే రెండు మూడు వారాల్లో పాలనా పగ్గాలు చంద్రబాబు చేతికి రానున్నాయన్నట్టుగా ఉంది. 

ఇంతవరకు జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సంస్కారవంతులైన వారికి ఆమోదయోగ్యంగానే ఉన్నాయ్‌. టీడీపీ ఏ ఒక్క నిర్ణయాన్ని హర్షించలేక పోతోంది. పంచతంత్రంలో దుఃఖ భాజనుల జాబితాని స్పష్టంగా ఇచ్చాడు. సరిగ్గా ఆ లిస్టుకి టీడీపీ నేతలు సరిపోలతారు. మనకి బద్ధ శత్రువైనా ఒక మంచి పని నిర్వర్తించినప్పుడు, ఓ ఘన కార్యం సాధించినప్పుడు, ఓ గెలుపుని సొంతం చేసుకున్నప్పుడు మనసారా అభినందించడం సంస్కారవంతుల లక్షణమని రుషులు ఏనాడో చెప్పారు. నిజానికి చంద్రబాబుకి ఇప్పుడున్న బలానికి ఇప్పుడు వస్తున్నంత ప్రచారం మీడియాలో రానక్కర లేదు. సొంత మీడియా కావ డంవల్ల సభలో కాకపోయినా, బయట కుర్చీల్లో కూర్చుని రూలింగ్‌ పార్టీని విమర్శించినా దాన్ని వినిపిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పలుకుల్ని ఎవరు వినిపిస్తున్నారు. త్వరలో టీడీపీ ఇంకా బలహీనపడి తీరం చేరే అవకాశం ఉందని వాతావరణ వేత్తలు విశ్లేషిస్తున్నారు.

 ఆధునిక రాజకీయాలు కూడా భోగభాగ్యాల్లాంటివే! వచ్చేటప్పుడు కొబ్బరికాయలోకి నీళ్లొ చ్చినట్టు నిశ్శబ్దంగా చేరిపోతాయి. వెళ్లిపోయేటప్పుడు వెల గపండు బుగిలి, డొల్ల తేలినట్టు, పైపం చెలు దులుపుకు వెళ్లి పోతాయి. కడకు బాబు మాత్రమే తెలుగుదేశాన్ని వీడలేరు. లోకేశ్‌ బాబుకి సైతం పార్టీని వీడటానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇదే మరి డెమోక్రసీ చక్కదనం! బస్తీ బాబులకంటే గ్రామీణులకు జ్ఞాపకశక్తి ఎక్కువ. మరీ ముఖ్యంగా నాయకుల ప్రసంగాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. అటు మొన్న ఎన్నికలప్పుడు చంద్రబాబు నానా రకాలుగా విజృంభించాడు కదా, ఇప్పుడు అయిపోయిన భూచక్రంలా చతికిలపడ్డాడని రచ్చబండ చుట్టూ వినిపిస్తోంది. నదులన్నీ కళకళలాడుతున్నాయ్‌. అన్ని జలాశయాలు గేట్లు ఎత్తుకు మరీ విలాసంగా నవ్వుతున్నాయ్‌. రైతులు పొలంపనుల్లో తలమునకలవుతు న్నారు. ఇదొక శుభసూచికం. 

చంద్రబాబు ఇవేవీ గమనించినట్టు లేదు. నిన్నటిదాకా తెలుగు రాష్ట్రాల వారంతా ఒకే గడ్డమీద పుట్టి పెరిగాం. ఇప్పుడు విడిపోయినంత మాత్రాన శత్రువులుగా మారిపోనక్కర్లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు రెండు రాష్ట్రాలను పాలించారు. అట్లాంటిది ఇప్పుడు ఇంతలో ‘నా ఏపీ, నా ప్రజలు’ వారి హితమే నా జీవిత లక్ష్యమని గాండ్రిస్తున్నారు. జనం ఉభయ రాష్ట్రాల వారు గమనిస్తున్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించేది లేదని చంద్రబాబు ఆందోళనా స్వరంతో అరుస్తున్నారు. ప్రజలు ఇవ్వని బాధ్యతల్ని నెత్తిన వేసుకోవడ మంటే ఇదే. కృష్ణా, గోదావరి నీళ్లని వారిష్టానుసారం పంచుకోవడం అనైతికం, అప్రజాస్వామికం అంటూ ఆరోపిస్తున్నారు. నీతి నియమాలు, విధి విధానాలు తగినన్ని ఉన్నాయ్‌. అనేక మంచి పనులకే ఏదో వంకన అడ్డుపడే ప్రబుద్ధులున్న మన దేశంలో నదుల్ని ఇష్టం వచ్చినట్టు పంచుకుంటే ఊరుకుంటారా? చంద్రబాబుని ఘోరాతి ఘోరంగా ఓడించింది, నరేంద్ర మోదీని హోరెత్తే మెజార్టీతో గెలిపించిందీ గ్రామీణ ప్రజలే. ఆ బలం చూసుకుని తన సత్తా చూపి ధైర్య సాహసాలతో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. మోదీ శక్తి సామర్థ్యాలను బాబు బొత్తిగా అంచనా వెయ్యలేకపోయారు.

దానివల్ల రాష్ట్రానికి జరగాల్సిన అరిష్టం జరిగిపోయింది. ‘ఏరి బాబు వాళ్లంతా? ఏరి? ఇరవైమందికి పైగా నేతలు.. అందరూ దండలు దండలుగా చేతులు కలిపి ముక్తకంఠంతో ‘మోదీ డౌన్‌ డౌన్‌’ అంటూ’’ నినదించారు. మమతాజీ ప్రధాని కావాలని చంద్రబాబు, కాదు అందుకు చంద్రబాబే సరి అని మరికొందరు పోట్లాడుకున్నారు. ఇంతమంది మహా నేతలు కలిసి కూడా మోదీ ఘన విజయాన్ని అస్సలు పసికట్టలేకపోయారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కలలు కంటూ, విమానంలో విరామం లేకుండా ఊరేగారు. ఏది, ఆ తర్వాత మళ్లీ ఏ ఇద్దరూ కలిసినట్టు లేదు. ఇక బాబు ఢిల్లీలో ఏ చక్రం తిప్పాలి? చంద్రబాబు ఆఖరికి గెలుపు కోసం కాంగ్రెస్‌ హస్తాన్ని కూడా కలిపి నడిచారు. వేదికలు పంచుకున్నారు. అందుకే మా రచ్చబండమీద, వ్రతం చెడ్డా పాపం ఫలం దక్కలేదని ఊరోళ్లు నవ్వుకుంటూ ఉంటారు.

వ్యాసకర్త : శ్రీ రమణ ( ప్రముఖ కథకుడు) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top