ఆదివాసీ హక్కుల కోసం నిలదీద్దాం

Sakshi Article On adivasis Problems

అభిప్రాయం 

మాయదారి ఎన్నికలు మళ్లీ వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణ అగ్రవర్ణ గిరిజనేతరులు అడ్డగోలుగా దోచుకుని తిని మళ్లీ దోచుకోవడానికి ఆదివాసీ సమాజంలోకి వస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ దొరల పాలైయింది. ఐదు సంవత్సరాలు పాలించమని అధికారం ఇస్తే నాలుగేండ్లకే కాడి కిందేసిండు. ఫలితంగా వందల కోట్ల ప్రజల సొమ్ము వృధా చేస్తూ ఎన్నికల జాతర మొదలైయింది. అగ్రకుల సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు పెట్టుబడిదారులు పెద్ద భూస్వాముల నుంచి మొదలుకొని వీధి రౌడీల వరకు అందరూ ఎత్తులు పైఎత్తులతో జిత్తులమారి వేషాలు వేస్తూ రంగురంగు జెండాలతో వస్తున్నారు. 70 ఏండ్లుగా రాజకీయ పార్టీలు ఇదే దొంగ మాటలు చెప్పి ప్రజ లనూ, ఆదివాసీలనూ మోసం చేస్తున్నాయి. గిరిజనేతర పార్టీలలో చేరి ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యి, ఆది వాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఓట్లేసిన ఆది వాసీల బతుకులు మాత్రం మారడం లేదు.

70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీల జీవన విధానం ఏం మారిందో ఈ గిరిజనేతర పార్టీలు సమాధానం చెప్పాలి. ఆదివాసీల అస్తి త్వాన్నీ, సంప్రదాయాలను కాపాడేవారికే మా ఓట్లు వేస్తామని నేడు తెగేసి చెబుతున్నారు. తెలంగాణ విప్లవ వారసత్వాన్ని ఈ రాజకీయ పార్టీలు అపహాస్యం చేశాయి. ఆనాడు వాకిట్లో బట్టలూడదీసి దొరలు బతుకమ్మలాడిస్తే, నేడు ఫామ్‌ హౌస్‌ నుంచి నయాదొరలు పాలన సాగిస్తున్నారు. ఇసుక, బొగ్గు, ఇనుము, అటవీ సంపద, సహజ సంపదలను అంది నకాడికి దోచుకుని ఆదివాసీ ప్రాంతాలను దోపిడీ కేంద్రాలుగా మార్చివేశారు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల జీవితాలు నలుగురి కుటుంబ స్వార్థానికి బందీ అయ్యాయి. ఆదివాసీ యువతరానికి ఉద్యోగాలు లేవు. ఆదివాసీ రిజర్వేషన్లను లంబాడీలు కబ్జా చేస్తున్నా, ఈ రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ యత్నిస్తోంది. ఆ పార్టీ నినాదాలు మార్చిందిగానీ, విధానాలను మాత్రం మార్చుకోలేదు. ఈ గిరిజనేతర పార్లమెంటరీ పార్టీలన్నీ ఒకే చెట్టుకు కాసిన విషపు కాయలే. ఈ పార్టీల విధానాలు మారనంత కాలం ఆదివాసీ జీవితాలు మారవు. ఆదివాసీల ఉమ్మడి రాజకీయ చైతన్యమే ఆదివాసీ స్వయం పాలనకు దోహదం చేస్తుంది.
 
జల్, జంగిల్, జమీన్‌పై సంపూర్ణ అధికారం ఆదివాసీలకే ఉండాలి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి, ఎస్టీ జాబితాలో ఏ ఇతర కులాలను కలుపకుండా చట్టం తీసుకురావాలి, ఐటీడీఏలో పైస్థాయి నుండి కింది స్థాయి వరకు ఆదివాసీలతోనే నియామకాలు జరపాలి, ఏజెన్సీలోని గిరిజనేతరుల ఓటు హక్కును రద్దు చేయాలి, 1/70 చట్టాన్ని అమలు చేయాలి, ఏజెన్సీలో భూ దురాక్రమణపై కమిటీ వేయాలి, ఏజెన్సీ ప్రాంతాలన్నిటినీ ఒకే యూనిట్‌గా కలిపే స్వయంపాలన కల్పించాలి, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులు పూర్తిగా ఆదివాసీలకే కేటాయించాలి, గోండు, కోయ తెగలవారికి 10వ తరగతి వరకు వారి మాతృభాషలోనే బోధన చేయాలి, జీవో నెం.3ని అమలు చేయాలి, జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా గాక, చారిత్రక ప్రాంతంగా గుర్తించాలి. ఇంద్రవెల్లి అమరుల స్థూపంపై ఆంక్షలను ఎత్తివేసి, నిర్వహణ బాధ్యత ఆదివాసీ సంఘాలకు అప్పగించాలి, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ప్రాజెక్టులను విరమించుకోవాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం, డీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్, గ్రూప్‌–1 పరీక్షలు నిర్వహించాలి–ఈ డిమాండ్ల సాధన కోసం ప్రతి ఆదివాసీ కృషి చేయాలి. ఓట్ల కోసం ఆదివాసీ ప్రాంతాలకు వచ్చే గిరిజనేతర పార్టీలను డిమాండ్‌ల సాధన కోసం నిలదీయాలి. గూడెంలోని ఓట్లు అడిగేవారిని ప్రశ్నించాలి.

అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితేనే హక్కులను సాధించుకోగలం. పోరాటం ద్వారానే సహజ వనరులు, ఖనిజాలపై హక్కులను దక్కించుకోవాలి. సారా సీసాలకు, డబ్బుకు ఆదివాసీలు అమ్ముడుపోరని గర్వంగా ప్రకటిద్దాం. ఆదివాసీ అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం.

వ్యాసకర్త : వూకె రామకృష్ణ దొర, అధ్యక్షులు, ఆదివాసీ రచయితల సంఘం
మొబైల్‌ : 98660 73866  

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top