‘లౌకికత్వం’లో ఇద్దరూ ఇద్దరే!

Rahul Gandhi Behaviour Over Hindu Traditions - Sakshi

జాతిహితం

విశ్వాసం, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజల సంఖ్యాధిక్యతతో అధికారం పొందిన మోదీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా తీర్పులిచ్చారని తాను భావిస్తున్న న్యాయమూర్తులను అనుమాన దృక్పథంతో చూస్తుంటుంది. రాజకీయాల్లో దీనికి భిన్నమైన దాన్ని మనం చూడలేం. బీజేపీ దాని భావజాలానికి సన్నిహితంగా ఉంటున్నవారు దీపావళి పటాసులను కాల్చడంపై కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం మౌనం పాటిస్తుంది. ఇలాంటి వైరుధ్యాలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. మహిళలందరినీ శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతించాలని రాహుల్‌ చెబుతూంటారు. కానీ, ఆయన పార్టీ వైఖరి మాత్రం భిన్నంగా ఉంటుంది. 

అయిదేళ్ల క్రితం నా జాతిహితం కాలమ్‌కి ‘వారు వర్సెస్‌ వీరు’ అనే శీర్షిక పెట్టాను. దాంట్లో భారత్‌లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న కులీనవర్గాల బహిరంగ చర్చలో ఒక కొత్త భిన్నాభిప్రాయ రేఖ చోటుచేసుకున్నట్లు నేను ప్రతిపాదించాను. అదేమిటంటే అధికారం చలాయిస్తున్న వర్గాలు వర్సెస్‌ పాలక వర్గాలు. అధికారం చలాయిస్తున్న కులీ నులు ఎవరంటే రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, న్యాయవ్యవస్థ, సాంప్రదాయిక మేధావులు, జర్నలిస్టులు, పోలీసులు, సాయుధ బలగాల ఉన్నతాధికారులు. ఇక పాలకవర్గాల కులీనులు అంటే సాంప్రదాయిక వ్యవస్థకు వెలుపల నుంచి ఆర్థికపరంగా ఎదిగి ముందుకొచ్చిన వారు. అంటే కార్పొరేట్లు, ప్రత్యేకించి ఐటీ, బ్యాకింగ్, ఫైనాన్స్‌ రంగాల నుంచి వచ్చిన కొత్త తరహా వృత్తిజీవులు, మునుపటి తరాలకు చెందిన పాలక కులీనులు, ధార్మిక సంస్థల నిధులతో పనిచేసే కార్యకర్తలు ఈ కోవకు చెందుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, సాంప్రదాయిక కులీ నులు, నూతన తరహా కులీనులు చాలా తక్కువ ఉమ్మడి లక్షణాలను కలిగి ఉండటమే. వీరు రెండు సార్వభౌమాధికార రిపబ్లిక్‌ల వంటివారు. వీరు పరస్పరం అనుమానించుకుంటూ, శత్రుపూరితంగా వ్యవహరిస్తుం టారు. అందుకే ఈ లక్షణాన్ని ‘వారు వర్సెస్‌ వీరు’ అని పిలిచాం. 

దాదాపు 7 శాతం అభివృద్ధిని చవిచూసిన ఈ అయిదేళ్లలో, నరేంద్రమోదీ విభజన రాజకీయాల వాతావరణంలో మనం ఆ సులభతరమైన సమీకరణం నుంచి ముందుకు వెళ్లిపోయాం. ఈ రెండు కులీనవర్గాలు కూడా దూరాన్ని పాటిస్తూ వచ్చాయి కానీ మార్పుకు గురయ్యాయి. వీటిలో మొదటి రకం కులీనులు తమను తాము కులీనతను దూరం చేసుకునే విషయంలో బాగా శ్రమించారు. రాజకీయవాదులు, బ్యూరోక్రాట్లు మరింత నమ్రతగా, నిగర్వంగా జీవిస్తున్నారు. ఈ మోదీ శకం తరహా వ్యవస్థాపన.. సంస్థాపక నియమ నిబంధనల ప్రకారం కాకుండా ఎక్కువగా వీధుల్లోంచే అధికారాన్ని చేజిక్కించుకుంది. 
ఇక రెండో తరహా కులీనవర్గం కూడా మార్పులకు గురైంది. ఎందుకంటే మొరటుదనం, అనాగరికత, ఉదారవాద వ్యతిరేకతతోపాటు చివరకు హిందీలో చెప్పుకునే ‘మోటుతత్వం’ వంటి మోదీ–బీజేపీ ప్రభుత్వం శైలి, స్వభావం నుంచి వేరుపడిపోయామని ఇది ప్రధానంగా భావి స్తూనే తమ రక్షిత యుద్ధాల్లోకి మరింత లోతుగా వెళ్లిపోయింది. ఈ రెండు కులీనవర్గాలు కూడా తమ స్థానాలు మార్చుకున్నాయి. కార్పొరేట్లు పాలక వర్గాలనుంచి దూరం జరిగాయి, దాని స్థానంలో ఉన్నత న్యాయాధికార వర్గం వచ్చి చేరింది. ఇక జర్నలిస్ట్‌–యాక్టివిస్ట్‌ అనే కొత్తగా ఆవిర్భవించిన వర్గం కూడా పాలకవర్గంలో చేరిపోయింది. ఇది తనదైన యోగ్యతను, పరిమితిని కలిగి ఉంది.

 మనం ఈ స్వల్ప లేక పరిమితమైన భావనను కాస్సేపు మర్చిపోయి ఈ ఘర్షణను, పెనుగులాటను ‘వారు వర్సెస్‌ వీరు’ అనే పేరుతో పిలుద్దాం. దీన్నే మనం కన్వారియా మరియు హాలోవెన్‌ వర్గాల మధ్య జగడంగా పిలుద్దాం. కన్వరియాలు అంటే లక్షలాదిమంది శివభక్తులు. వీరు గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకుపోవడానికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హరిద్వార్‌ వైపు వస్తుంటారు. ఇక హాలోవెన్‌ అంటే అక్టోబర్‌ 31 రాత్రి వేలాది అమెరికన్‌ చిన్నారులు దయ్యాలు, భూతాల వేషం ధరించి చేసుకునే వేడుక. ఈ రెండు ప్రజా సమూహాలూ వర్గానికి ప్రతీక. అదే సమయంలో ఇది పరిశుద్ధ పండుగకు ప్రతీక కూడా. ఈ రకం కన్వారియాలను ఎలా నాగరికులను చేస్తామన్నదే నా ప్రశ్న.

మన రెండు అసలు సిసలు యుద్ధవీరుల ఆందోళనలు విస్తృతార్థంలో ఒకటే. కానీ వాటిని పరిష్కరించే వైఖరే భిన్నంగా ఉంటుంది. ఒకటేమో తనపైతాను అంటే ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉంటుంది. రెండోది ప్రభుత్వానికి దూరంగా ఉంటుంది. అంటే తన సొంత వనరులకు అంటే, డివైస్‌లు, ప్రైవేట్‌ డీజెస్‌ జెన్‌సెట్లు, బోర్‌ వెల్స్, ప్రైవేట్‌ భద్రత, పాఠశాలలు, ఆసుపత్రులు, విమానమార్గాలు, కార్లు వంటివాటికి ఇది పరిమితమై ఉంటుంది. అయితే ఈ రెండు వర్గాలు కూడా సులభంగా చెప్పాలంటే, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వేలు, ప్రజా రవాణాలో భాగస్వామ్యం పుచ్చుకోవు. ఇప్పుడు మోదీ అయిదో సంవత్సరం పాలనలో, ప్రభుత్వ వ్యవస్థ మరింత జనరంజకంగా తయారవడమే కాకుండా, తన నియోజకవర్గంలోని మధ్య, దిగువ తరగతులతో నేరుగా సంభాషించేదిగా, ఓట్లు ఉన్న చోట మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూనే ఆర్థిక–మేధోపరమైన కులీనులను ఒక అల్పస్థాయి క్షుద్ర వర్గంగా చూస్తోంది. అంటే తన విమర్శకులందరినీ అది సులువుగానే రాక్షసులుగా, క్రూరులుగా భావిస్తుంది. 

రాజకీయాల్లో దీనికి భిన్నమైన దాన్ని మీరు చూస్తున్నట్లయితే మీరు అసంతృప్తికి గురవుతారు. ఈ అంశంలో రెండు రకాల ఏకాబిప్రాయం ఉంది. చూడండి. బీజేపీ దాని భావజాలానికి సన్నిహితంగా ఉంటున్నవారు శబరిమలపై, దీపావళి పటాసులను కాల్చడంపై కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం మౌనం పాటిస్తుంది. దీనిలో వైరుధ్యాలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. మహిళలందరికీ వయసుతో పనిలేకుండా శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతించాలని రాహుల్‌ గాంధీ చెబుతూంటారు. అదే సమయంలో ఆయన పార్టీ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే రాహుల్‌ అభిప్రాయాన్ని తోసిపుచ్చడానికి ఆయన పార్టీ సాహసిస్తుంది.ఇక్కడ సమస్య ఏమిటంటే, రాహుల్‌ మరీ ఆధునికుడు, తన పార్టీ అభిప్రాయాన్ని సొంతం చేసుకోవడానికి సైతం సిగ్గుపడుతుంటారు. కానీ కేరళలో, ప్రతిచోటా హిందూ ఓటర్లలో అధికులు కోర్టు తీర్పులను తమ విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు బాధ వ్యక్తం చేస్తుం టారు. ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై కూడా రాహుల్, ఆయన పార్టీ ఒకేరకమైన ఉదారవాద అభిప్రాయాన్ని కలిగి లేవు.

కానీ బీజేపీ వైఖరి మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఇరు పక్షాల్లోనూ పూర్తి ‘సెక్యులర్‌’గా ఉంటోంది ఈ కపటత్వమే మరి. వామపక్షం మినహా ఇతర లౌకికవాద పార్టీలకు మల్లే కాంగ్రెస్‌ పార్టీ దీపావళి పటాసులను కాల్చే సమయం విషయంలో మౌనంగా ఉంటూ వస్తోంది. ఇక ఐపీసీ 377 సెక్షన్‌ విషయంలో అది మూగపోయింది. ఎందుకంటే ఈ పార్టీలకు కూడ తమ ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలుసు. వీరిలో చాలమంది విశ్వాసాలకు ప్రాముఖ్యతనిచ్చే ‘కన్వారియా వర్గాల్లో’నే ఉన్నారు. సమీప భవిష్యత్తులోనే ఈ క్రమాలు ఆగ్రహం, గందరగోళం మధ్య ఐక్యమవుతాయి.ఒకవేళ విశ్వాసం, ఆధ్యాత్మికత అపరిష్కృతమైన తికమకపెట్టే అంశాలైతే జాతీయవాదం మరోటి. ఇవి కొన్ని కోర్టు తీర్పులు వీగిపోయినా, మరికొన్నిటిని ఉపసంహరించుకున్నప్పటికీ కొనసాగుతూనే వుండే సున్నితమైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తాయి. సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శన విషయాన్ని పరిశీలిస్తే అన్ని పార్టీలు మౌనం వహించాయి.

తర్వాత కోర్టు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ సినిమాహాళ్లు జాతీయ గీతం ప్రదర్శనను నిలిపివేయలేదు. ఈవిషయమై పెద్ద ఎత్తున ఫిర్యాదులేమీ రాకపోవడమే అందుకు కారణం. మన జాతీయ గీతం కోసం కాసేపు నిలబడటంలో సమస్యేముంటుంది అనేది ఇక్కడ వాదన. ఇదే తర్కాన్ని గోవధ నుంచి నక్సలిజం వరకు అన్వయిస్తారు. అందుకే మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మౌనం వహించాయి. ఇప్పుడు మోదీ బస్తర్‌ వెళ్లి కాంగ్రెస్‌ అర్బన్‌ నక్సలైట్ల సానుభూతి పార్టీ అని విమర్శిస్తారు. దీనికి ఎలా స్పందించాలో కాంగ్రెస్‌కు తెలియదు. విప్లవం కోసం పనిచేస్తూ ఆయుధాలు చేపట్టనంత కాలం, ప్రజలు ఏదో ఒక భావజాలాన్ని నమ్మొచ్చని కాంగ్రెస్‌ భావించినా, కన్వారియా బందం దాన్ని పక్కకు నెట్టేస్తుంది. చత్తీస్‌గఢ్‌లోని ఓటర్ల విషయానికి వస్తే కాంగ్రెస్‌ రాష్త్ర నాయకత్వమంతా నక్సలైట్ల చేతిలో హతమైంది.

సాయుధ మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ అన్నారు. ఎవరి ఆకాంక్షలకు మద్దతివ్వాలనే విషయంలో ఇది మేథావులనీ, అధికారంలో వున్నవారినీ ఇరు కున పెడుతుంది. ఇటువంటి సందర్భంలో రాజ్‌ బబ్బర్‌ వారిని విప్లవకారులని కీర్తించడాన్ని, గతంలో మావోయిస్టులపై విరుచుకుపడాలనుకున్న చిదంబరాన్ని దిగ్విజయ్‌ సింగ్‌ అడ్డుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడం తెలియడంతో ఈ వర్గం ఊపందుకుంది. ప్రధాన రాజకీయాలకు, అధికార కేంద్రాలకు వీరు మరింత దూరం వుండాల్సిన అవసరం ఉంది. తీవ్ర ఒత్తిడిలో వున్న నేటి స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు.  బీజేపీ వారిని శత్రువులుగా చూస్తుంది, కాంగ్రెస్‌ వారిని బాధ్యు లుగా భావిస్తుంది.

వారు, బీజేపీని ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగుగా, మోదీని మీసం లేని హిట్లర్‌గా చూస్తుంది. అలాగే కాంగ్రెస్‌ నేత తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా దేవాలయాల చుట్టూ తిరుగుతుండటంతో ఆ పార్టీని బీజేపీ రాజీపడిన, అయోమయ స్థితిలో వున్న  ట్టుగా చూస్తుంది. కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే వీటికి దూరంగా వున్నాయి. అందుకే అవి ఇంగ్లీషు మీడియాకు కేంద్రంగా వుండటంతోపాటు ట్విట్టర్, హాలోవీన్‌ పార్టీలతో హడావిడి చేస్తున్నాయి. గత నెలలో ఈ పార్టీవారు మోదీ, రాహుల్‌లాగే దుస్తులు ధరించడంతోపాటు సోమాలియా దొంగలుగా ముఖాలకు నల్లరంగు పూసుకోగా, ఒకరు గ్రేటర్‌ నోయిడాగా కూడా హాలోవీన్‌ పార్టీలకు హాజరయ్యారు. రాఫెల్‌గా దుస్తులు ధరించడం కూడా కొత్త హాలోవీన్‌ ఒరవడిగా ముందుకు వస్తుంది. కానీ, కన్వారియాగా రావడానికి మాత్రం ఎవరూ ప్రయత్నించకపోవచ్చు. ఇంతకంటే అప్రతిష్ట ఏముంటుంది?

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top