ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడమెలా?

Professor Atul Sharma And Biswajit Dhar Article On India Economic Growth - Sakshi

భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నది దాదాపు అందరూ అంగీకరిస్తున్న విషయమే. కానీ మాంద్యంనుంచి బయటపడవేయడానికి కేంద్రం ఎంచుకుంటున్న ప్రాధాన్యతలు వినియోగంకోసం ఖర్చుపెట్టగల వారికి అనుకూలంగా ఉండాలి. అదే డిమాండును తనంతట తానుగా సృష్టిస్తుంది. భారతీయ అభివృద్ధి నమూనాను వ్యవసాయ రంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చివేయడమే మాంద్యానికి ప్రధాన కారణం. రెండు విధానపరమైన ప్రకంపనలు అంటే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం అనేవి వినియోగదారుల నడ్డి మరింతగా విరిచాయని చెప్పాలి. ప్రభుత్వ ప్యాకేజీలన్నీ సరఫరా రంగంలో ఉద్దీపన చర్యలకు అత్యవసరమైనవే కానీ డిమాండ్‌ పడిపోయిన ఆర్థిక రంగంపై ఇవేమంత ప్రభావం చూపడం లేదు. అందుకే వినియోగంపై ఖర్చుపెట్టాలనే ఆకాంక్ష అధికంగా ఉండే సగటు ప్రజలకు కొనుగోలు శక్తిని ఎక్కువగా అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమవుతుంది.

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని సాక్ష్యాధారాలతో తెలుస్తున్నప్పటికీ, ఈ వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించిన తర్వాత ఈ అంశం చర్చనీయాంశం కాకుండా పోయింది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది చెందుతున్నప్పటి రోజులతో పోలిస్తే 2019–20 రెండో త్రైమాసికంలో మన వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే గత 26 త్రైమాసికాల్లో ఇది అత్యంత తక్కువ శాతం అన్నమాట. వినియోగం, మదుపు, ఎగుమతులు అనే మూడు వృద్ధి చోదక శక్తులూ పూర్తిగా తిరోగమన బాటలో ఉంటున్నాయి.

వీటిలో వినియోగం గత నాలుగు దశాబ్దాల్లోకెల్లా కనిష్ట స్థాయికి పడిపోయింది. అందులోనూ గ్రామీణ వినియోగం 8.8శాతానికి తగ్గిపోగా, పట్టణ వినియోగంలో పెరుగుదల లేకుండా పోయింది. రెండో త్రైమాసికంలో స్థూల పెట్టుబడులు 2018–19తో పోలిస్తే స్థిరధరల వద్ద ఒక్కటంటే ఒక్క శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. కాగా ఎగుమతులు మాత్రం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఈ సంఖ్యలు మన దృష్టిలో నాలుగు అంశాల సమ్మిళిత ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అవేమిటంటే, విధానపరమైన ప్రకంపనలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత పెరుగుదల– వేతనాల వాటాలో భారీ తగ్గుదల, ఆర్థికరంగ సంక్షోభం. వీటిలో మొదటి అంశాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు అంశాలూ గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను కుళ్లబొడుస్తున్న వ్యవస్థాగత అవరోధాలు మాత్రమే.

పెట్టుబడుల తగ్గుముఖం
రెండు విధానపరమైన ప్రకంపనలు అంటే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం అనే విధాన మార్పులను వెంటవెంటనే తీసుకువచ్చారు. పెద్దనోట్ల రద్దు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమై 15 లక్షల ఉద్యోగాలను కోల్పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ’ అంచనా వేసింది. పైగా పేలవంగా రూపొందించిన జీఎస్టీ వల్ల ఈ పరిశ్రమల వ్యథలు మరింత పెరిగాయి. దీంతో ఎక్కడ చూసినా అనిశ్చితి పేరుకుపోవడం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పాలసీల పరంగా కలిగిన షాక్‌ కారణంగా కలిగిన ఉద్యోగాల, వేతనాల నష్టాలు డిమాండును కుంగదీయడమే కాకుండా పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

భారతీయ అభివృద్ధి నమూనాను వ్యవసాయ రంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చివేశారు. జనాభాలో అతిపెద్ద విభాగానికి ఆధారభూతంగా ఉంటున్నప్పటికీ స్థూల దేశీయ వస్తూత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా గణనీయంగా పడిపోతోంది. దీనికి గానూ కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ని పెంచడం ద్వారా, ఇతర ప్రధాన పంట లకు కూడా దాన్ని పొడిగించడం ద్వారా వ్యవసాయదారులను దుస్థితి నుంచి తొలగించి వారికి కాస్త ఉపశమనం కలిగించాలని, 2005లో నేషనల్‌ ఫార్మర్స్‌ కమిషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) నొక్కి చెప్పింది. యూపీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధరను అర్థవంతంగా పెంచి ప్రారంభంలో కాస్త శ్రద్ధ చూపినప్పటికీ, జాతీయ రైతుల కమిషన్‌ చేసిన సిఫార్సులను ఇంతవరకు ఏ ప్రభుత్వమూ అమలు చేసింది లేదు. దీని ఫలితంగా 2010–2011 సంవత్సరం వరకు రైతులు, రైతులు కానివారి మధ్య పెరుగుతూ వచ్చిన వ్యాపార లావాదేవీలు ఆ తర్వాతి నుంచి పతనమవుతూ వచ్చాయి. అదేసమయంలో వ్యవసాయ కూలీల వేతనాలు 2007–08 నుంచి 2013–14 వరకు సగటున సంవత్సరానికి 17 శాతం దాకా పెరుగుతూ వచ్చాయి కానీ గత మూడేళ్లలో ఈ పెరుగుదల నిలిచిపోయింది. ఈ రెండు పరిణామాలూ గ్రామీణ డిమాండును స్తంభింపచేశాయి.

వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పడిపోయాయని, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి వృద్ధి రేటు చాలా తగ్గిపోయిందని ది పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2017–18 నివేదించింది. మొత్తంమీద నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదు కాగా, పట్టణ యువకుల్లో నిరుద్యోగిత రేటు 19 శాతంగానూ, పట్టణ యువతుల్లో నిరుద్యోగిత రేటు 27 శాతంగా నమోదైంది. నిరుద్యోగితకు సంబంధించిన ఈ గణాంకాలు గడిచిన 45 ఏళ్లలో అత్యధికం. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే నికర నిరుద్యోగిత పతనం 2017–18లో 471.3  మిలియన్లుగా నమోదైంది. అంటే దేశ జనాభాలో 47 కోట్లమందికి ఉపాధి అవకాశాలు సరిగా లేవు. స్వాతంత్య్రానంతరం ఉపాధి అవకాశాలు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి.

పతనబాటలో దేశీయ–విదేశీయ డిమాండ్‌
పట్టణ రంగానికి సంబంధించి, ఆర్బీఐ సమర్పించిన కేఎల్‌ఎమ్‌ఈఎస్‌ డేటాబేస్‌ ప్రకారం 2011 నుంచి 2017 వరకు వస్తూత్పత్తి రంగంలో ఉపాధి పెరుగుదల 1.4 శాతం పడిపోగా, సేవల రంగంలో 2 శాతం మేరకు పడిపోయింది. 2004 నుంచి 2010 మధ్యకాలంలో ఇది 2.5 నుంచి 2.8 శాతం మేరకు పతనమైనట్లు తెలుస్తోంది. ఇదే కాలానికి వస్తూత్పత్తి రంగంలో కార్మిక వేతనాలు 8.1 శాతం నుంచి 5.4 శాతానికి పడిపోగా సర్వీసు రంగంలో 7.2 నుంచి 6.1 శాతానికి పడిపోయినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. అందుచేత, గ్రామీణ ఆదాయం, పట్టణ కార్మికుల వేతనాలు పడిపోవడానికి తోడుగా ఆదాయ పంపిణీ కూడా తగ్గుముఖం పట్టడంతో దేశీయ డిమాం డులో తీవ్ర వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇక ఎగుమతుల వృద్ధి తిరోగమనంతో విదేశీ డిమాండ్‌ దెబ్బతింది.
గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్‌ రంగంలో మూలధనాన్ని పెంచుతున్నప్పటికీ (2018–19లో రూ. రూ.1.06 లక్షల కోట్లు కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 70,000 కోట్లు) నిరర్థక ఆస్తులు పెరుగుతూ పోతున్నాయి. 2019 మార్చి 31 నాటికి వీటి మొత్తం రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. చివరకు బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌ రంగం కూడా సంక్షోభంలో పడుతోంది. ఉదాహరణకు, 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ లీజింగ్, ఆర్థిక సేవలకు సంబంధించి రూ. 16,935 కోట్ల విలువకు ప్రతికూల వృద్ధి నమోదైనట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌–ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదించింది. ఇది వాణిజ్య రుణాలను తీసుకోవడంపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. మొత్తంమీద డిమాండు కుదించుకుపోవడం, మదుపుదారుల్లో నిరాశతో కూడిన ఆర్థిక రంగ సంక్షోభం మొత్తం పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కలిగిస్తోంది.

ప్యాకేజీలు సరే.. వినియోగం పెంపుదల మాటేది?
ఆర్థిక సంక్షోభ నివారణకు, కేంద్రప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, రియల్‌ ఎస్టేట్, ఆటో మొబైల్స్, ఎగుమతి రంగాలను పునరుద్ధరించే దిశగా పలు ప్యాకేజీలను ప్రకటించింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ ప్యాకేజీలన్నీ సరఫరా రంగంలో ఉద్దీపన చర్యలకు అత్యవసరమైనవే కానీ డిమాండ్‌ పడిపోయిన ఆర్థిక రంగంపై ఇవేమంత ప్రభావం చూపడం లేదు. అందుకే వినియోగంపై ఖర్చుపెట్టాలనే అభిలాష, ఆకాంక్ష ఎక్కువగా ఉండే సగటు ప్రజలకు కొనుగోలు శక్తిని ఎక్కువగా అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమవుతుంది. అయితే అధికంగా వినియోగంపై ఖర్చుపెట్టే వారికి కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ ప్రభుత్వమైనా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాలపై అధికంగా ఖర్చుపెట్టడం ద్వారా, విద్య, ఆరోగ్య సేవలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనా రంగాల్లో మదుపు చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చు. దీనిపై వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల డిమాండ్‌ పెరిగి బలమైన మదుపుదారులను ఆకర్షించవచ్చు.

ఉపాధి పథకాలే మూలమలుపు
సామాజిక అకౌంటింగ్‌ చట్రాన్ని ఉపయోగించి జాతీయ ఉపాధి పథకం, మరో రెండు సామాజిక భద్రతా పథకాల ప్రభావం ప్రభావాన్ని అంచనా వేసినప్పుడు, ఇలాంటి పథకాల పరోక్ష ప్రభావం గణనీయంగా ఉందని తెలిసింది. జాతీయ ఉపాధి పథకం వంటి పథకంపై ప్రత్యక్ష వ్యయం కారణంగా గ్రామీణ రైతుల పరోక్ష ఆదాయం 1.8 రెట్లు పెరిగింది. పెన్షన్‌ లేక బేసిక్‌ ఇన్‌కమ్‌ టైప్‌ పథకంలో పెట్టిన ప్రత్యక్ష వ్యయం రెండు రెట్లు పెరిగింది.

పైన పేర్కొన్న పథకాలకు తగినన్ని వనరులను కల్పించడానికి గానూ ప్రభుత్వం పన్ను రూపంలోని, పన్నేతర రూపంలోని ఎరియర్స్‌ను విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి 2017–18 చివరినాటికి వరుసగా రూ. 9 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లుగా పేరుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే భారీ స్థాయిలో అందుబాటులో ఉన్న రక్షణ, రైల్వే మిగులు భూములను కూడా ప్రభుత్వం ఉపాధి పథకాలకు ఉపయోగించాల్సి ఉంది.
ప్రొ‘‘ అతుల్‌ శర్మ, ప్రొ‘‘ బిశ్వజిత్‌ ధార్‌
(ది వైర్‌ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top