బీజేపీకి బిహార్‌ ఎంత ముఖ్యం?

Pentapati Pullarao Guest Column Bihar Political Importance Of BJP - Sakshi

సందర్భం

నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోదీని తప్పుపట్ట వచ్చునేమోగానీ, జమిలి ఎన్నికల అంశంలో మాత్రం ఆయన్ని ఒప్పుకోవచ్చు. 2019 మేలో పార్లమెంట్‌ ఎన్నికలు ముగియగానే, 2019 నవంబర్‌లో మహా రాష్ట్ర, హరియాణా ఎన్నికలు వచ్చాయి. 2020 జనవరిలో జార్ఖండ్, ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల హడావుడి నుండి దేశం కొద్దిగా విశ్రాంతి తీసుకుంటుండగానే అక్టో బర్‌లో మళ్లీ బిహార్‌ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రమే బీజేపీని ఎంత టెన్షన్‌ పెట్టిందో చూశాం.

అలాంటిది బిహార్‌ ఎన్నికలు ఊహించండి! గత ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌తో కలిసి బీజేపీ 40 లోక్‌సభ సీట్లకు 39 గెలుచుకుంది. ఈసారి నితీశ్‌ ఓడిపోయాడంటే, బీజేపీకి ఆదరణ తగ్గిందన్న విమర్శను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీజేపీతో కలిసి నితీశ్‌ 2005, 2010ల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. 2015లో మోదీ ప్రధాని అయ్యాక బీజేపీని వదిలి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో ‘మహాఘట్‌ బంధన్‌’ గా జట్టు కట్టారు. 243 సీట్లకు 178 సీట్లు గెలిచి, బీజేపీని 55 సీట్లకే పరిమితం చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఉప ముఖ్యముంత్రిగా ఉన్న లాలూ కొడుకు తేజస్వి యాదవ్‌ మీద అవినీతి ఆరోపణలు రాగానే లాలూను వదిలి నితీశ్‌ బీజేపీతో ప్రభుత్వాన్ని కొనసాగించారు.

బిహార్‌ ఎన్నికల్లో ప్రస్తుతం నితీశ్, బీజేపీ, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఎన్డీయే పక్షంగా, లాలూ, కాంగ్రెస్‌ మరో వర్గంగా బరిలో ఉన్నాయి. నితీశ్‌ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. లాలూ, రాబ్డిదేవి పది హేనేళ్లు సీఎం పీఠం మీద కూర్చున్నారు. నితీశ్‌ ప్రతి నిధిగా జితన్‌ రామ్‌ మాంఝీ ఒక్క ఏడాది ముఖ్య మంత్రి స్థానంలో ఉన్నారు. అంటే 30 ఏళ్లుగా నితీశ్, లాలూ కుటుంబమే బిహార్‌ను ఏలుతున్నది. నితీశ్‌ మార్చి ఒకటినే పట్నాలో ఎన్నికల శంఖా రావం పూరించారు.

200 అసెంబ్లీ స్థానాలు గెలవడా నికి ప్రయత్నిస్తానని ప్రకటించారు. లాలూలా తాను అవినీతిపరుణ్ని కాదన్న సందేశాన్ని గట్టిగానే ప్రజ ల్లోకి తీసుకువెళ్లగలిగారు. అయితే, హఠాత్తుగా నితీశ్‌ పార్టీని వీడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాను కూడా బిహార్‌ ఎన్నికల బరిలో ఉంటానని ప్రక టించారు. లాలూ కంటే నితీశ్‌ ఉత్తముడే కావొచ్చు, కానీ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలోకీ ఉత్త ముడా అని కిశోర్‌ ప్రశ్నిస్తున్నారు.

ఒక మనిషి, ఒక కులం పార్టీలైన జితన్‌ రామ్‌ మాంఝీ(హెచ్‌ఏఎం), ఉపేంద్ర కుశ్వాహా (ఆర్‌ఎల్‌ ఎస్పీ), ముకేశ్‌ సాహ్నీ(వీఐపీ పార్టీ) లాంటివాళ్లు మూడోశక్తిగా బరిలో ఉన్నారు. వీళ్లు లాలూతో జట్టుగా ఉన్నప్పటికీ తేజస్వితో సఖ్యతగా లేరు. లాలూ జైల్లో ఉండటంతో తేజస్వి సంకీర్ణానికి నాయ కత్వం నెరుపుతున్నారు. లాలూకు యాదవులు, ముస్లిముల్లో మంచి ఆదరణ ఉంది. కానీ నితీశ్‌ ముందు తేజస్విలాంటి పరిపక్వత లేని మనిషి నిల బడలేడని ఈ పార్టీ నాయకుల అభిప్రాయం. అందుకే శరద్‌ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా కోరుతున్నారు. వీళ్లది ఉత్త శబ్ద కాలుష్యమే అని తేజస్వి విమర్శిస్తున్న ప్పటికీ పార్టీని తీవ్ర గందరగోళంలో పడేయటంలో వీళ్లు విజయం సాధించగలరు.

పప్పు యాదవ్‌ నేతృ త్వంలోని జన్‌ అధికార్‌ పార్టీ, కన్హయ్య కుమార్‌ నేతృత్వంలోని వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. ఇవి రెండూ భారీగానే జనాన్ని ఆకర్షిస్తాయి. అయితే, వామపక్షాలను కలుపుకొని పోవడానికి లాలూ సిద్ధంగా లేరు. తెలివైన కన్హయ్య కుమార్‌ గనక గట్టిగా నిలదొక్కుకుంటే, అది తన కొడుకు తేజస్వి భవితవ్యానికి చరమగీతం అవుతుం దని లాలూ నమ్మిక. 2019లో కూడా వామపక్షీయు లతో లాలూ చేతులు కలపనిది ఇందుకే.

గతేడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఓడింది. ఢిల్లీ తప్ప ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. మళ్లీ గనక నితీశ్‌ని ముఖ్యమంత్రిని చేయలేకపోతే బీజేపీ పూర్తిగా బలహీనపడిందన్న ముద్ర పడుతుంది. మునిగి పోయే ఓడలోంచి ఎలుకలు కూడా దూకి వెళ్లిపో తాయి. పైగా ఈ ఫలితాలు ఎన్నికలు సమీపించిన బెంగాల్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంలోనూ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ ఎన్నికలకు బీజేపీ అంత ప్రాముఖ్యత ఇస్తోంది. ఆ కారణంగానే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ జరగని విధంగా, సీఏఏకు వ్యతిరేకంగా నితీశ్‌ ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించింది. రాజకీయాల్లో గెలు పులు శాశ్వతం కాదు. వరుస వైఫల్యాల వల్ల గతేడాది మేలో వచ్చిన భారీ విజయం మరుగున పడింది. అందుకే బిహార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవ డానికి బీజేపీ సిద్ధంగా లేదు.

పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top