అంతర్గతపోరులో తొలిదెబ్బ

Pentapati Pullarao article on demonisation confilcts - Sakshi

విశ్లేషణ
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంటే జీడీపీ లెక్కలు కాదు. అది ఉద్యోగాల కల్పన. పెద్దనోట్ల రద్దుపై మోదీని, జీఎస్టీపై జైట్లీని తప్పుబట్టాల్సి ఉంది. మోదీ పనితీరుపై బీజేపీ సీనియర్‌ నేత నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి. దీని పరిణామాలేంటి?

రాజకీయాల్లో ఒక వారం రోజులు సుదీర్ఘ కాలమేనని 50 ఏళ్ల క్రితమే నాటి బ్రిటన్‌ ప్రధాని హెరాల్డ్‌ విల్సన్‌ చెప్పారు. వారం కంటే ఎక్కువ రోజులే గడిచాయి కానీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ వృద్ధ నేత యశ్వంత్‌ సిన్హా మధ్య కుమ్ములాట కొనసాగ డమే కాదు మరింత విస్తృతమవుతోంది. యశ్వంత్‌ సిన్హా సమస్యను, దాన్ని లేవనెత్తిన సమయాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఐఏఎస్‌ అధికారిగా కెరీర్‌ మొదలెట్టిన సిన్హా 30 ఏళ్లపాటు రాజకీయాల్లో గడిపారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులోనూ చురుగ్గా ఉన్న సిన్హా దెబ్బకాచుకుని తిరిగి లేవడంలో నిష్ణాతుడు.

1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సిన్హా దివంగత ప్రధాని చంద్రశేఖర్‌కు ప్రీతిపాత్రుడు. 1989లో ఎంపీగా గెలిచి ఏడాదిపాటు చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1998లో బీజేపీలో చేరిన సిన్హా, నాటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థికమంత్రిగా ఆయన రికార్డు చిదంబరం, జైట్లీ కంటే ఏమంత పెద్దగా లేదు. ఈ ముగ్గురి ఉమ్మడి లక్షణం ఏమిటంటే.. గొప్ప చింతనాపరులు, టీవీలో చక్కగా చర్చించేవారు, ఢిల్లీ రాజకీయాలపై, ఢిల్లీ మీడియాపై గట్టి పట్టు సాధించారు.

మోదీపై సిన్హాకు తనదైన ఈర్షా్యద్వేషాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, బహుశా మోదీ తనకు ఏదైనా గొప్ప పాత్ర కల్పించవచ్చని తాను భావించి ఉండవచ్చు. కానీ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హాను మంత్రిగా చేసినందున ఇక తనకు సిన్హా విజ్ఞానంతో అవసరం లేదని మోదీ భావించారు కాబోలు. దీంతో సిన్హా కాస్త అసంతృప్తి చెందివుంటారు.

సకాలంలో రాజకీయాలనుంచి తప్పుకోకపోతే నేతల రాజకీయ భవిష్యత్తు వైఫల్యంతోనే ముగుస్తుందని బ్రిటిష్‌ రాజకీయనేత ఇనోచ్‌ పావెల్‌ చెప్పారు. అలాగే సిన్హా తన చక్కటి ఆరోగ్యం, ఆకాంక్షలతో బాధితుడయ్యారు. మోదీ తన హయాంలో తీసి పడేసిన పలువురు సీనియర్‌ బీజేపీ నేతలు, ఎంపీలతో సిన్హా విస్తృతంగా చర్చించే ఉండాలి. అరుణ్‌ జైట్లీ–మోదీ ఆర్థిక విధ్వంస విధానాలపై ఉన్నట్లుండి దాడి చేయడానికి సిన్హా అంత అపరిపక్వత కలవారేమీ కాదు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, జాతీయ గణాంక కమిషన్‌ తేల్చి చెప్పిన తర్వాతే సిన్హా సరైన సమయాన్ని చూసి మరీ దాడికి దిగారు.

ఆర్‌బీఐ, ఇతర సంస్థల అభిప్రాయాలతోపాటు, ప్రజలు కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని గ్రహించారు. మితిమీరిన పన్నులు, ఉపాధి కల్పనలో పూర్తి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా వంటి మంచి పథకాలను మోదీ ప్రారంభించారు. తన విదేశీ విధానం చక్కగా సాగుతోంది. కాని బలహీనమైన మంత్రివర్గం ఫలితాలను సాధించడం లేదు. పైగా, ఆర్థిక మంత్రి జైట్లీని మోదీ నియంత్రించలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా విఫలమైందన్న ఆరోపణలతో సిన్హా బహిరంగ ప్రకటన చేసినప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అపాయింట్‌మెంట్‌ కావాలని కోరితే ప్రధాని కానీ, మరే మంత్రి కానీ తనను కలిసేందుకే సిద్ధపడలేదని, ఈ నేపథ్యంలో జాతి హితం కోసం ప్రజల్లోకి వెళ్లకుండా తానెలా ఉండగలనని అన్నారు.

దీంతో, 80 ఏళ్ల వయసులో సిన్హా ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారంటూ జైట్లీ ఆగ్రహంతో స్పందించారు. ఒక సీనియర్‌ను ఘోరంగా అవమానించినట్లు స్పష్టమవడంతో జైట్లీ ప్రతిష్ట మసకబారింది. మొత్తం సమస్య ఎక్కడుందంటే ఆర్థిక వ్యవస్థ క్షీణించడం లేదని జైట్లీ దేశాన్ని ఒప్పించలేకపోవడమే. వృద్ధి రేటు వంటి సంఖ్యలతో జనాలకు పనిలేదు. వారు అధిక పన్నులను, నిరుద్యోగాన్ని మాత్రమే చూస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత నిరుద్యోగం తారస్థాయికి చేరింది. జీఎస్టీ విధాన రూపకర్త తానే కాబట్టి మొత్తం పేరు తనకే రావాలని జైట్లీ భావిం చారు. కానీ జీఎస్టీ ప్రభావం ఘోరంగా ఉంది. పన్నులను, జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని చాలామంది జైట్లీకి సూచించారు కానీ తాను వాటిని లెక్కపెట్టకపోగా చాలామంది ప్రజలు ఇప్పుడు పన్నులు చెల్లిస్తున్నారని, పన్నులను అధికంగా రాబట్టడం గొప్ప విజయమని ప్రకటించారు. భారత్‌లో సామాన్యులు అధిక పన్నులు చెల్లించడానికి ఒప్పుకోరు. తన పన్ను విధానాల ద్వారా జైట్లీ మోదీకి అనేకమంది శత్రువులను తయారు చేసి పెట్టారు.

ఆర్థిక స్థితి సరిగా ఉండి ఉంటే జైట్లీపై యశ్వంత్‌ సిన్హా ఎన్నటికీ దాడి చేసి ఉండేవారు కాదు. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ప్రజలు తమతోనే ఉన్నారని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ చేసిన వాగ్దానాలకు తగినట్లుగా మోదీ పని చేయడం లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఏర్పడింది. అందుకే మెజారిటీ ప్రజలు ఇప్పటికీ మోదీని బలపరుస్తున్నప్పటికీ విమర్శలు పెరుగుతున్నాయి.

ముడి చమురు ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చు. మోదీ ప్రభుత్వంలో తీవ్ర లోటు ఏదంటే అత్యున్నత ఆర్థికవేత్తలు ఎవరూ తన సరసన లేరు. దీంతో స్తోత్రాలు చేస్తూ బతికేస్తున్న ఆర్థిక శాఖ అధికారులపైనే మోదీ పూర్తిగా ఆధారపడుతున్నారు. ప్రధానిగా గతంలో మన్మోహన్‌ సింగ్‌ వంటి ఆర్థిక వేత్త సైతం ఆర్థిక సలహాదారులను పెట్టుకున్నారు.

మోదీ పన్నులు తగ్గించినట్లయితే, ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు చేరుతుంది. దీంతో వందరోజుల్లోనే రైతులు నిజమైన ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. అలా ఆర్థికవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంటే జీడీపీ లెక్కలు కాదు. అది ఉద్యోగాల కల్పన. పెద్దనోట్ల రద్దుకు మోదీని, పేలవమైన జీఎస్టీకి జైట్లీని పూర్తిగా తప్పుబట్టాల్సి ఉంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో నవ్వించే అంశం ఒకటుంది. 80 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి, అత్యంత శక్తిమంతుడైన, ముఖ్యుడైన జైట్లీపై దాడి చేయడం నవ్వు తెప్పిస్తోంది. కాగా, బీజేపీ మంత్రులు, పార్టీ సీనియర్లు, లాయర్లు, మీడియా కూడా దీనిని ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు.


పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : ppr193@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top