న్యాయం ఇంకెంత దూరం!

Nandamuri Lakshmi Parvathi Writes On Justice For Women - Sakshi

‘యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రా వైదేవాః’ అని మనుసూక్తి. ఎక్కడైతే స్త్రీలను పూజి స్తారో, గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని అర్థం. ఏ దేశం స్త్రీల హక్కులను కాపాడలేదో అది నాగరికతలో ముందుకు పోలేదని అంటారు గాంధీజీ. మహిళ అంటేనే మహితమైనది అని అర్థం. కానీ వాస్తవంలో అలా లేదు. ఇందుకు నిత్యం చూస్తున్న దుర్ఘటనలే తార్కాణం. ప్రతి ఐదు నిమిషాలకు ఒక అత్యాచారం. ప్రతి ఇరవై నిమిషాలకు ఒక గృహహింస ఉదంతం.

గంటకొకటి వంతున హత్యాయత్నం. ఇదీ మహిళల దుస్థితి. ఇందులో చిన్నారులు, వృద్ధులు అన్న తేడా లేదు. ఇలాంటి అఘాయిత్యపు సమాజంలోని ఎందరు కీచకులకు శిక్షలు పడుతున్నాయి? ఇదీ సమాధానం దొరకని ప్రశ్నే. ‘ప్రాచీనకాలం నుంచి ఆధునిక కాలం వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో మాత్రం మార్పులేదు’ అని తేల్చింది రామచంద్ర గుహ కమిటీ.

ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీలు చేసిన ఎన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితమే. 15,000 మంది శ్రామికవర్గ మహిళలు ఓటు హక్కు కోసం, వేతనాల పెంపు కోసం నినదిస్తూ మార్చి 8, 1908న న్యూయార్క్‌ నగరంలో కదం తొక్కారు. హక్కుల సాధనలో మైలురాయిగా కనిపించే ఆరోజునే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. మార్చి 25, 1911న న్యూయార్క్‌ నగరంలోనే మరో దుర్ఘటన జరిగింది.

ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగి 145 మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. దీనితో అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయం మరింత బలపడింది. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక రంగాలలో స్త్రీలు నిర్వహిస్తున్న పాత్రకు ఈ విధమైన గుర్తింపు సముచితమేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం చైర్మన్‌ రూజ్వెల్ట్‌ (అమెరికా అధ్యక్షుడు కాదు) వ్యాఖ్యానించారు. ఇక లింగభేదం లేకుండా అన్ని రంగాలలో సమాన హక్కులు ఉండాలని మానవహక్కుల అంతర్జాతీయ ప్రకటన పేర్కొంటున్నది. అయినా స్త్రీలకు ఏదీ సునాయాసంగా రాలేదు. పోరాటాలతోనే హక్కులు దక్కాయి. ఉదాహరణకు ఓటుహక్కు.

స్వీడన్‌లో 1771–81 మధ్య పన్ను చెల్లించే సంపన్న వర్గాల స్త్రీలకే ఓటు హక్కు ఉండేది. కానీ పోటీ చేసే హక్కు మాత్రం లేదు. ఫ్రాన్స్‌లో మొదటిసారిగా మహిళలకు 1871లో హక్కులు లభించాయి. 1944 వరకు ఓటు హక్కు లేదు. ఎంత వివక్ష! ఆ హక్కు కోసం వారు చేసిన పోరాటం చరిత్రాత్మకం. న్యూజిలాండ్‌లో 1893లో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చారు.

దాని పొరుగునే ఉన్న బ్రిటిష్‌ వలసదేశం ఆస్ట్రేలియాలో 1902 వరకు ఆ హక్కు లేదు. అమెరికా (1902), నార్వే (1913), డెన్మార్క్‌ (1915), ఆస్ట్రియా (1919), అర్మేనియా (1921), భారతదేశం (1930–1947), బ్రెజిల్‌ (1931), చిలీ (1935), జపాన్‌ (1945), ఇటలీ (1946), అల్జీరియా (1947), చైనా (1947), ఇజ్రాయెల్‌ (1948), బహమాస్‌ (1960), అఫ్గానిస్తాన్‌ (1963), ఇరాక్‌ (1980) దేశాల మహిళలు ఎన్నో మార్పుల తరువాత ఓటు హక్కు సాధించుకున్నారు. ఇక మిగిలిన హక్కుల విషయంలో చెప్పుకోలేని దుస్థితి.

కానీ ఇలాంటి వాతావరణంలో కూడా ఆశాజనకమైన పరిణామాలు లేకపోలేదు. ఉదాహరణకు రువాండా. ఆ దేశాన్ని మహిళా రాజ్యమని చెప్పవచ్చు. అక్కడి పార్లమెంట్‌లో స్త్రీలకు 56.3 శాతం ప్రాధాన్యం దక్కింది (భారత పార్లమెంట్‌లో అది 9 శాతమే). అక్కడ ప్రధానమంత్రి, స్పీకర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, పోలీసు విభాగం అధిపతి–అంతా మహిళలే. రువాండా 1962లోనే స్వాతంత్య్రం తెచ్చుకుంది. అయినా మహిళలకు అగ్రస్థానం ఇచ్చి, ఈ విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

మన దేశంలో మహిళల కోసం ఎన్నో చట్టాలు చేశారు. వాటి అమలులో మాత్రం కనీస శ్రద్ధ కనిపించదు. మహిళలకు పార్లమెంట్‌లో 33 శాతం స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇప్పటికీ పురుషాహంకారం అడ్డుపడుతూనే ఉంది. ఈ బిల్లు కోసం 108వ రాజ్యాంగ సవరణ జరగాలని మా పార్టీ అభిప్రాయం. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి తగినంత ఆధిక్యం ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం తలుచుకుంటే వస్తుసేవల బిల్లును ఆమోదింపజేసినట్టే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కూడా సభ చేత ఆమోదముద్ర వేయించగలదు.  

మహిళల మీద పెరిగిపోతున్న దాడులను నివారించేందుకు చట్టాలను మరింత పదును పెట్టాలి. రాష్ట్ర మహిళా కమిషన్‌ చట్ట ప్రకారం నేరాలకు పాల్పడ్డ వారి మీద చర్యలు తీసుకోవడానికి సంస్థకు హక్కు ఉంది. కానీ కొందరు నేతల ప్రమేయం, పోలీసు శాఖ సరిగా స్పందించలేకపోవడం వంటి కారణాలతో ఆ హక్కు ఆచరణలో కనిపించడం లేదు. అందుకే స్వతంత్ర బహుళ సభ్య దర్యాప్తు సంఘం, ప్రాసిక్యూషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి.

లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం–1983 ప్రకారం లోకాయుక్త పదవికి కల్పించిన భద్రతను మహిళా కమిషన్‌కు కూడా కల్పించాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలే కాకుండా, హత్య కేసులను కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకువస్తే నిర్వహణా భారం తగ్గించవచ్చు. ఇది ఎంత సత్వరం జరిగితే అంత సత్వరం మహిళలకు న్యాయం అందుతుంది. అలాగే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలకు పెనుముప్పుగా ఉన్న మద్యపానాన్ని అదుపు చేయడానికి సమగ్ర ఎక్సైజ్‌ విధానం రావాలి. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మద్యం పాలసీ అమలులోకి వస్తే చాలా నేరాలకు స్వస్తి చెప్పవచ్చు.

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్‌సీపీ నాయకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top