మెడికల్‌ రికార్డూ రహస్యమేనా?

Madabhushi Sridhar Write About Health Insurance - Sakshi

విశ్లేషణ

మన ఆసుపత్రుల్లో బిల్లింగ్‌ చేసే గుమాస్తా చేతుల్లో రోగి బతుకు కొట్టుకులాడుతూ ఉంటుంది. డాక్టర్లతో పాటు, ఇతర వైద్యసిబ్బంది పైన, బిల్లు రాసే వాడిపైన రోగి హక్కులు ఆధారపడి ఉంటాయన్నది నిజం.

ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు గాని మన అనారోగ్యం పెద్ద దుకాణ దవాఖానాలకు మహాభాగ్యం అని నిన్నమొన్నటిదాకా తెలియదు. ఇదివరకు పల్స్‌ చూసి వైద్యుడు రోగికి చికిత్స మొదలుపెట్టేవాడు. తరువాత పర్స్‌ చూసారు. ఇప్పుడు నీకు బీమా ఉందా అని అడుగుతున్నారు. ఉంటేనే బతుకు. ప్రజల ఆరోగ్య రక్షణనూ, పోషకాహార స్థాయినీ జీవన ప్రమాణాలనూ పెంచి ప్రజారోగ్యం వృద్ధి చేయడం రాజ్యం ప్రాథమిక బాధ్యత అని ఆర్టికల్‌ 47 నిర్దేశించింది.

కేంద్రం సామాన్యుల ఆరోగ్యబీమా –మోదీకేర్‌ పేరుతో ఒక భారీ పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రీయ స్వాస్థ్య యోజన కింద 30వేల బీమా డబ్బు రూ.5 లక్షలకు పెంచారు. ఇప్పడు 5లక్షల రూపాయలకు తక్కువ ఆరోగ్య మహాభాగ్యాన్ని ఊహించలేము. ఆర్థికంగా బలహీనమైన 50 కోట్ల కుటుంబాలకు (41.3 శాతం) ఆరోగ్య లాభం కల్పించే పథకం ఇది. అనారోగ్యంపాలై, అందువల్ల అప్పుల పాలై, ఆరోగ్యాన్నీ, జీవితాన్నీ కోల్పోతున్న మామూలు మనుషులకు ఇది వరమే.

పౌరుల ఆర్థిక స్వాతంత్య్రాన్ని లెక్కించి ప్రపంచంలో ఆయా దేశాల స్థితిని నిర్ణయించే హెరిటేజ్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ 2018 ప్రకారం సార్వజనిక ఆరోగ్యపథకాలున్న హాంగ్‌కాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, స్విట్జర్లాండ్, డెన్మార్క్‌ దేశాలు తొలి పది అగ్రస్థానాలలో ఉన్నాయి. 180 దేశాలలో మన దేశం మాత్రం 130వ స్థానంలో ఉంది. లక్షమందికి మనదేశంలో ఉన్న వైద్యులు కేవలం 80 మంది. ఇదీ మన దేశ అనారోగ్య దౌర్భాగ్యం.  

బతికే హక్కు సరే, ఆరోగ్యంగా బతికే హక్కు ఉందా? కనీసం ఆరోగ్య సమాచారమైనా తెలుసుకునే హక్కుందా? ఆరోగ్యభీమా పథకాలు సరే కానీ అనారోగ్యం పీడితులైన పేదలకు మధ్యతరగతి వారికి సహాయం సులువుగా అందుతున్నదా? ఆ మార్గాలకు ఇంకా అన్వేషించవలసి ఉంది. 

ఇక హక్కుల సంగతి: మనదేశంలో వైద్య మండలి ఒకటి ఉంది. 2002లో కోడ్‌ ఆఫ్‌ ఎతిక్స్‌ రెగ్యులేషన్‌ (íసీఓఇఆర్‌) ప్రకటించింది. ఇందులో వైద్యుల బాధ్యతలు, విధులు వివరించారేగాని రోగుల హక్కులేమీ లేవు.  భారత వినియోగదారుల మార్గదర్శక మండలి రోగుల హక్కుల జాబితా ప్రకటించారు. 

1. నీ జబ్బుగురించి మొత్తం వివరాలు తెలుసుకునే హక్కు నీకుంది. చికిత్సపత్రాలను నీకు వివరించే హక్కు, నీకు నిర్దేశించిన చికిత్సలో ఉన్న ప్రమాదాలు, అనుబంధ సమస్యలు వివరించే హక్కు ఉన్నాయి. 2. నీకు భౌతిక పరీక్షలు, చికిత్స జరుగుతున్న సమయంలో నీ గౌరవానికి భంగం కలగకుండా వైద్యసిబ్బంది తగిన శ్రద్ధతో వ్యవహరించాల్సిన హక్కు. 3. నీ వైద్యుడి విద్యార్హతలను తెలుసుకునే హక్కు. నీవే అంచనా వేయలేనప్పుడు ఇతరులచేత పరిశీలింపజేసే హక్కు. 4. నీ రోగాల గురించి పూర్తిగా గోప్యత పాటించే హక్కు. 5. నీకు నిర్దేశించిన చికిత్సపై నీకు అనుమానం ఉన్నపుడు, ముఖ్యంగా శస్త్రచికిత్స జరపాలన్నపుడు రెండో నిపుణుడిని సంప్రదించే హక్కు. 6. నీకు శస్త్ర చికిత్స అవసరమని ముందే తెలియజేసే హక్కు. 7. డిశ్చార్జి చేయించుకుని మరో ఆస్పత్రికి వెళ్లే హక్కు, నచ్చిన డాక్టర్ను అడిగి ఏ హాస్పిటల్‌కు వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు. 8. నీవు కోరితే చికిత్సకు సంబంధించిన పత్రాలు పొందే హక్కు. 

ఈ హక్కులన్నీ అనుకోవడమేగాని ఏ చట్టంలోనూ ఇవ్వలేదు. బిల్లింగ్‌ చేసే గుమాస్తా చేతుల్లో రోగి బతుకు కొట్టుకులాడుతూ ఉంటుంది. వేలరూపాయలు చెల్లించే రోగులను, వారి సన్నిహితులను ఈ గుమాస్తా దుర్మార్గంగా నిలబెట్టుకుంటాడు. డాక్టర్‌ మర్యాదగా ఉంటాడు కానీ ఈ గుమాస్తా దురహంకార దుర్మార్గాల్ని భరిం చడం కష్టం. డాక్టర్లతో పాటు, ఇతర వైద్య సిబ్బంది పైన, బిల్లు రాసే వాడిపైన రోగి హక్కులు ఆధారపడి ఉంటాయన్నది నిజం. 

పార్లమెంటు 2010లో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం రూపొందించింది. పెట్టబోయే హాస్పిటల్‌ వివరాలన్నీ ముందే ప్రకటించాలని, వారు అభ్యంతరాలు తెలిపే వీలు కల్పించాలని సెక్షన్‌ 26 వివరిస్తుంది. ప్రభుత్వానికి రికార్డులను, రిపోర్టులను, రిటర్న్‌లను ఇవ్వాలని నిర్దేశించింది. చికిత్సలో వాడే వస్తువు ధరను సేవల ఖరీదును ఇంగ్లిష్, స్థానిక భాషల్లో వివరంగా ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన రీతిలో ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను, ఎలక్ట్రానిక్‌ వైద్య రికార్డులను సరిగ్గా నిర్వహించాలి. హాస్పిటల్‌కు సంబంధిం చిన పూర్తి వివరాలు ప్రకటించి ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ అభ్యంతరాలను పరి శీలించిన తరువాత హాస్పిటల్‌కు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ఇస్తారు. వైద్యసంస్థలు 12వ సెక్షన్‌ కింద రోగి చికిత్సా వివరాలను సరిగ్గా నిర్వహించాలన్న నియమాలు కూడా ఉన్నాయి. వారికి సమాచారం ఇవ్వాలని స్పష్టమైన గ్యారంటీ హక్కు లేదు. రోజువారీ చికిత్స వివరాలు మరునాటి ఉదయానికి రోగి చేతిలో ధ్రువీకరించి ఇచ్చే కఠినమైన నిబంధన ఉండాలి. ఉల్లంఘిస్తే భారీ జరి మానా ఉండాలి.

(7.4.2018 నాటి కేంద్ర రాష్ట్రాల సమాచార కమిషనర్ల జాతీయ సదస్సులో రచయిత సమర్పించిన పత్రంలో ఒక భాగం)

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top