రాష్ట్రపతి వ్యవస్థనూ భ్రష్టు పట్టిస్తారా!

Kommineni Srinivas Guest Column About TDP MPS Meet With President Ramnath - Sakshi

విశ్లేషణ

తెలుగుదేశం పార్టీ ఎవరినైనా భ్రష్టు పట్టించగల సామర్థ్యం కలిగిన పార్టీ అని తెలుసు. కానీ చివరికి రాష్ట్రపతిని కూడా వదలకపోవడమే దురదృష్టకరం. టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రపతి అది చెప్పారు.. ఇది చెప్పారు అంటూ ప్రచారం చేయడం ద్వారా ఆయన పరువు తీయడానికి కూడా వెనుకాడలేదని చెప్పాలి. రాష్ట్రపతి కూడా తమ అవినీతికి మద్దతుగా, హత్యా రాజకీయాలకు అనుకూలంగా, మహిళలను బూతులు తిట్టేవారికి సంఘీభావంగా మాట్లాడారన్నట్లు అర్థం వచ్చేలా టీడీపీ ఎంపీలు ప్రచారం చేయడం దుర్మార్గం. అవినీతి కేసులలో రక్షణ కల్పించాలని కోరడం ద్వారా టీడీపీ అధినేత రాష్ట్రపతిని కూడా బురదలోకి లాగాలని చూడటం హేయం.

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై  తెలుగుదేశం పార్టీ  ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి పెద్ద ఎత్తున పిర్యాదు చేశారు. ఈ ఏడాది కాలంలో వారు చేస్తున్న ఆరోపణలు అనండి, విమర్శలు అనండి అన్నిటిని కలిపి ఒక చోట పోగు చేసి రాష్ట్రపతికి ఇచ్చారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని మీడియాకు చెప్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎవరైనా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే రాష్ట్రపతి కూడా టీడీపీ వాదనతో ఏకీభవించినట్లుగా మాట్లాడారని, పార్లమెంటులో ఈ అంశాలన్నీ లేవనెత్తాలని కోరారని చెప్పినట్లుగా టీడీపీ ఎంపీలు, టీడీపీ మీడియా ప్రచారం చేయడం మాత్రం అభ్యం తరకరం. తెలుగుదేశం పార్టీ ఎవరినైనా భ్రష్టు పట్టించగల సామర్థ్యం కలిగిన పార్టీ అని తెలుసు. కానీ చివరికి రాష్ట్రపతిని కూడా వదలకపోవడమే దురదృష్టకరం. మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రపతి అది చెప్పారు.. ఇది చెప్పారు అంటూ ప్రచారం చేయడం ద్వారా ఆయన పరువు తీయడానికి కూడా వెనుకాడలేదని చెప్పాలి.

పార్లమెంటులో ఈ అంశాలన్నిటినీ ప్రస్తావించాలని చెప్పారంటే, తనకు ఇచ్చినా లాభం ఏమీ లేదని రాష్ట్రపతి భావిస్తున్నారని అనుకోవాలా?  టీడీపీ ఎంపీలు బయటకు వచ్చి చెప్పిన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు వంటి బీసీ నేతలపై కేసులు పెట్టారని. సాధారణంగా ప్రభుత్వంపై ఏవో ఆరోపణలు చేయడానికి రాష్ట్రపతిని ప్రతిపక్షాలు కలుస్తుంటాయి. కానీ తమాషా ఏమిటంటే తమపై అవినీతి ఆరోపణల కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేయడానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. ఈఎస్‌ఐ స్కామ్‌ వాస్తవమేనని అంటారు. అధికారులకు పాత్ర ఉందేమో కానీ అప్పటి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు సంబంధం లేదంటారు. బందరులో మోకా భాస్కరరావును హత్య చేసింది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులే అయినా ఆయనపై కేసు పెడతారా? అంటారు. అయ్యన్నపాత్రుడు మహిళా అధికారిని బట్టలూడదీసిగొడతానని అన్న వీడియో ఉంది. ఆయనపై కేసు వద్దంటారు.

జేసీ ప్రభాకరరెడ్డి ఏకంగా నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారే, అలా చేసినా ఫర్వాలేదా? మరి రాష్ట్రపతి కూడా అవినీతికి మద్దతుగా, హత్యలకు అనుకూలంగా, మహిళలను బూతులు తిట్టేవారికి సంఘీభావంగా మాట్లాడారన్నట్లు అర్థం వచ్చేలా టీడీపీ ఎంపీలు ప్రచారం చేయడం అంటే అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ప్రజావేదిక కూల్చారని కూడా ఫిర్యాదు చేశారట. వీరు రాష్ట్రపతిని అడిగి ఉండాల్సింది! టీడీపీ హయాంలో నదీగర్భంలో పర్యావరణ అనుమతులతో నిమిత్తం లేకుండా ఒక నిర్మాణం చేశాం. దానిని వైసీపీ ప్రభుత్వం కూల్చింది. అలా అక్రమ కట్టడం చేయడం సరైనదా? కూల్చడం సరైనదా అని టీడీపీ వారు రాష్ట్రపతిని అడిగి ఉండాల్సింది. 

అలాగే గతంలో ముఖ్యమంత్రి హోదాలోనూ, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలోనూ కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. దీన్ని సమర్థించాలని రాష్ట్రపతిని కోరారన్నమాట. టీడీపీ మీడియాలో వచ్చిన వాటి ప్రకారం వీటన్నిటికీ రాష్ట్రపతి మద్దతు ఇస్తారన్నమాట. అంటే వీరు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారు? అయితే టీడీపీ ఎంపీలు ఒక విషయం కావాలని వదలివేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం పగ పట్టిందని, మోదీ కక్షతో ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించేవారు. అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలేవీ ఏపీలో అడుగుపెట్టడానికి వీలులేదని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. వాటన్నింటినీ జగన్‌ ఎత్తివేశారు. మరి వీరు గతంలో చేసింది కరెక్టు అయితే జగన్‌ చేసిన ఈ పని కూడా తప్పే అవ్వాలి కదా.. జగన్‌ సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వడం ఏమిటని రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు ప్రశ్నించి ఉండాల్సింది.

అంతేకాక స్వయంగా చంద్రబాబు వద్ద పీఎస్‌గా ఉన్న శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ దాడులు చేయడం ఏమిటని రాష్ట్రపతిని ప్రశ్నించాలి కదా. రెండువేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని నిఘాసంస్థ ప్రకటించడం మోదీ కక్షకు నిదర్శనమని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోయారు? 
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకరరెడ్డి, అయ్యన్నపాత్రుడులపై రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులను ప్రస్తావించి పిర్యాదు చేసిన ఈ ఎంపీలు.. తమ అధినేతతో నిత్యం సంబంధం కలిగి ఉండే పీఎస్‌పై వచ్చిన రెండువేల కోట్ల కేసుపై పిర్యాదు చేయలేదంటే, చంద్రబాబు తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నారని అనుకోవాలా? పార్లమెంటులో కూడా చంద్రబాబు పీఎస్‌పై ఐటీ దాడి గురించి మాట్లాడే ధైర్యం వీరు చేస్తారా? యథాప్రకారం రాజధాని అమరావతి అంశాన్ని కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అమరావతి శి«థిలాలపై మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి చంద్రబాబు ప్రభుత్వమే పచ్చని పంటలు పండే భూములను దిబ్బలుగా మార్చింది. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులు ఉండాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దానిని టీడీపీ వ్యతిరేకించింది. మరి ఈ విషయంలో రాష్ట్రపతికి కేంద్రంపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఆంధ్రుల ముఖాన కొట్టారని బాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు కదా.. దానిపై రాష్ట్రపతి కోవింద్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 

తమ హయాంలో రాజధానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని కేంద్రానికి లేఖ రాశామని, అయినా కేంద్రం పట్టించుకోలేదని వారు ఎందుకు పేర్కొనలేదు? అయితే ఇప్పుడు తాము మాట మార్చి రాజధానికి డబ్బులే అక్కర్లేదని, సెల్ఫ్‌ పైనాన్స్‌  రాజధాని అని, దీనిని జగన్‌ కూడా ఒప్పుకోవాలని కోరుతున్నామని చెప్పి ఉండాల్సింది. రాజధానిలో లక్షల కోట్ల రూపాయల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని జగన్‌ ఆరోపించారని, దానిపై విచారణ అధికారాన్ని సీబీఐకి ఇస్తూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, అందువల్ల  సత్వరమే దీనిపై విచారణ జరిపించాలని కూడా ధైర్యంగా రాష్ట్రపతికి చెప్పి ఉండాల్సింది.  స్వయంగా ప్రధాని మోదీ ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టును తమ అధినేత చంద్రబాబు ఏటీఎమ్‌ మాదిరి వాడుకున్నారని ఆరోపించారని, దాని గురించి కూడా విచారణ జరిపించాలని కోరి ఉండాల్సింది. వీట న్నిటినీ వదలిపెట్టి కేవలం కొందరు మాజీ మంత్రుల అవినీతి  కేసుల గురించే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించారో తెలియదు. సరే. ఇక వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో దేనికైనా నిర్దిష్ట ఆధారాలతో చెప్పి ఉంటే అర్థం ఉండేది. ఉబుసుపోక సోది రాస్తే ఏం ప్రయోజనం? 

ఒకప్పుడు టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఒక పద్ధతిగా మాట్లాడుతుందన్న అభిప్రాయం ఉండేది. ఏది పడితే అది మాట్లాడడానికి కాస్త ఫీల్‌ అయ్యేవారు. కానీ చంద్రబాబు ఆధిపత్యం టీడీపీలో పెరిగిన తర్వాత, తదుపరి టీడీపీని ఆయన కైవసం చేసుకున్న తర్వాత ఆయన ఒకటే థియరీ అమలు చేస్తున్నారు. అదేమిటంటే  అదికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తన ప్రత్యర్థి మీద ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి అభియోగాలు మోపాలి. వీలైనంత బురద చల్లాలన్నదే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేశారు. కొన్నిసార్లు అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. 

కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. దానితో ఆయన ఏమి చెప్పినా, అది అబద్ధమా? నిజమా అన్నది నిమిషాలలో తేల్చేస్తున్నారు. అందువల్లే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, అవినీతి అన్నీ చాలావరకు బయటకు వచ్చేశాయి. దాని ఫలితమే 2019లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి అన్న సంగతి ఆయన అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఇప్పటికీ మూసపోసినట్లు పాత బురద రాజకీయమే చేస్తున్నారు. కాకపోతే ఆయా వ్యవస్థలలో తన పలుకుబడిని ఉపయోగించి పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నిస్తున్నారు. నిజమే ఏ ప్రభుత్వం అయినా కక్షతో ఎలాంటి కేసులు పెట్టకూడదు. రాష్ట్రపతికి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం కూడా తప్పుకాదు. కాని ఉన్నవీ, లేనివీ అబద్ధాలు పోగు చేసి పేజీల కొద్దీ వినతిపత్రం ఇవ్వడం తప్పు. అనినీతి కేసులలో రక్షణ కల్పించాలని కోరడం తప్పు. అయినా వర్తమాన రాజకీయాలు ఇలా అయిపోయాయి. ఇలాంటి వాటిని గమనంలోకి తీసుకునే  రాజకీయం అంటే దయ్యాలు ఆడుకునే ఆట అని ఒక రచయిత వ్యాఖ్యానించారు. ఎలాంటి లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారు? ప్రస్తుత టీడీపీ నేతలంతా కలిసి ఏ స్థాయికి ఈ పార్టీని తీసుకువచ్చారు!... నిజంగా ఇది విషాదమే.

వ్యాసకర్త
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top