పరుగులెత్తనున్న ప్రగతి రథం

Kishan Reddy Article On Economic Development In Modi Government - Sakshi

విశ్లేషణ

నాలుగు నెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్‌ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతోంది. సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, మూలధనలబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబడులరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కార్పొరేట్‌ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి తయారీ కంపెనీలు భారత్‌కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

ఆర్థికరంగ వృద్ధి కోసం మోదీ ప్రభుత్వం నాలుగు నెలలుగా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. మరో అయిదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా తక్షణ కార్యాచరణను ముమ్మరం చేసింది. గత అయిదేళ్ల పాలనలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించగా, ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు ఊతం ఇచ్చింది. 2015లోనే మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహమి చ్చారు. రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధి అనుసంధానం వల్ల పలు కంపెనీలు ఏర్పడ్డాయి. మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్‌లో తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు నాలుగునెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్‌ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతుంది.  బ్యాంకులకు మూలధన వనరులకింద రూ. 70 వేల కోట్లు అందించడం, విదేశీ రుణాలకు అవకాశం, డాలర్లలో చెల్లింపులకు, రూపాయి బాండ్లు జారీకి సడలింపులు ఇచ్చింది. గృహనిర్మాణం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు , ఎగుమతుల రంగాలకి ప్రోత్సాహకాలు ఇచ్చింది. సర్‌ఛార్జి తొలగించి పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చింది.  

తాజాగా కార్పొరేట్‌ రంగానికి విధించే పన్నును 10 శాతం వరకు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత 28 ఏళ్లలో ఈ స్థాయిలో పన్ను తగ్గించడం ఇదే తొలిసారి.  ఈ నిర్ణయంతో కార్పొరేట్‌ పన్ను 35 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గింది. కనీస ప్రత్యామ్నాయ పన్నుగా విధించే 18.5 శాతం పన్నును 15 శాతానికి కుదించారు. సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టు ఫోలియో మదుపుదారులకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీలపన్ను, మూలధన లబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. కొత్త కంపెనీలకు కార్పొరేట్‌ రంగంలో 2023 మార్చి 31 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు ఆదాయపు పన్ను 15 శాతంగా ఉంటుంది. ఈ సంస్థలు ఎలాంటి కనీస ప్రత్యామ్నాయ పన్ను వంటివి చెల్లించనవసరం లేదు. కార్పొరేట్లు దేశీయ కంపెనీలు అయితే ఎలాంటి ప్రోత్సాహకాలు తీసుకోకుండా 22 శాతం పన్నులు చెల్లించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పన్ను కూడా వారిపై విధించరు. ఇలాంటి సంస్థలకు అన్ని నుంకాలు, సెస్సులు కలిపి 25.17శాతంగా పన్నులు ఉంటాయి. దేశీయ ఉత్పత్తిరంగ సంస్థలకు మార్కెట్‌ వసతి కల్పించేందుకు మెగా మార్కెట్‌ జాతాలు నిర్వహిస్తారు. ఇన్ని ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబుడలరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
 
ఆర్థికరంగం బలోపేతం
దేశీయ కంపెనీలకు విత్త సహాయం కావాలంటే బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉండాలి. 2017 వరకు దేశంలో ఈ పరిస్థితి లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు బ్యాంకుల వద్ద భారీగా అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా తిరిగి చెల్లించకపోవడంతో రానిబాకీలు బాగా పెరిగాయి. ఇలాంటి నిరర్ధక ఆస్తులను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసింది. బ్యాంకులకు రుణం చెల్లించక ఎగవేసిన వారు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఇదికాక పెద్దమొత్తంలో నగదు బ్యాంకుల వద్ద కాక కొద్దిమంది వద్ద మాత్రమే ఉండిపోయింది. దానిని బయటకు తీసుకువచ్చేందుకు పెద్దనోట్ల రద్దును 2017లో అమలు చేసి నగదును బ్యాంకుల వద్దకు తీసుకువచ్చారు. బ్యాంకులకు మరింత ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు రూ.70 వేల కోట్లు ఇచ్చారు.  బ్యాంకులకు మరింత శక్తిని కల్పించే క్రమంలో గత నెలలోనే పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చారు. అలాగే ఇకపై 27 ప్రభుత్వరంగ బ్యాంకుల స్థానంలో 12 బ్యాంకులు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వం మార్కెట్‌లో రూ. 5 లక్షల కోట్లు ద్రవ్య నిధి జారీ చేయడానికి అడ్వాన్స్‌గా రూ. 7 లక్షల కోట్లు జమచేస్తుంది. దీనివల్ల కార్పొరేట్, రిటైల్‌ వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈ, చిరు వ్యాపారులు మొదలైన వారికి లాభం కలుగుతుంది. బ్యాంకు రుణగ్రహీతలందరికీ లాభం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించడానికి రేట్లలో కోత విధించాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా రుణ ఉత్పాదనలకు సంబంధించిన రెపో రేటు, ఔటర్‌ బెంచ్‌ మార్కు ఏర్పాటు చేయటం, ఆగిపోయిన గృహ నిర్మాణాల కోసం ఒక ప్రత్యేక గవాక్ష విభాగం ద్వారా సహాయం అందిస్తారు. దీని కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. 2020 మార్చి 31 వరకూ ఇబ్బందుల్లో ఉన్న ఏ ఎంఎస్‌ఎంఈని ఎన్‌పీఏగా ప్రకటించరు.  సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్, వ్యక్తిగత రుణాలు తీసుకునేవారి ముఖాముఖీ సమావే శాలు జరుగుతాయి. ఇందులో బ్యాంకుల ద్వారా రుణగ్రహీతలకు భారీగా నగదు అందుతుంది.  

తయారీ కంపెనీల వరుస
కార్పొరేట్‌ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటిం చిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి తయారీ కంపెనీలు భార త్‌కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తయారీ రంగంలో ఎగుమతుల్లో ప్రథమస్థానంలో ఉన్న చైనా ఇప్పుడు సంక్షోభంలో ఉంది. రెండేళ్లుగా చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న వ్యాపార పోరాటమే దీనికి కారణం. ఇదొక్కటే కాదు చైనాలో ఉన్న అమెరికా కంపెనీలన్నీ త్వరలో అక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు రానున్నాయి. ఇలా చైనాను విడిచే కంపెనీలు ఇప్పుడు భారత్‌ వైపు చూడనున్నాయి. నైపుణ్యం, తక్కువ వేతనంలో లభించే పనివారు చైనాకంటే భారత్‌లో లభ్యమైనా, అధిక పన్నులు ఉండటం వల్ల భారత్‌ పోటీ పడలేకపోయింది. ప్రస్తుతం పన్నుల తగ్గింపుతోపాటు మౌలికవసతులు కల్పించడంతో ఇక భారత్, త్వరలో చైనాకు ప్రత్యామ్నాయ తయారీ రంగంగా రూపుదిద్దుకోనుంది.  

దేశీయంగా ఉపయోగం 
దేశంలో పెట్టుబడుల రూపంలో ఒక పెద్ద మొత్తం మన ఆర్థ్ధికవ్యవస్థలో చేరుతుంది. ఈ పెట్టుబడి ముఖ్యంగా తయారీ రంగంలో, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇల్లు, వాహనాలు, వినియోగవస్తువుల కొనుగోలును ప్రోత్సహించేందుకు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎఫ్‌సీ), నేషనల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎఫ్‌సి)కి అదనంగా ఇచ్చే రూ. 20 వేల కోట్ల సహాయాన్ని రూ. 30 వేల కోట్లకు పెంచుతారు. బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎఫ్‌సీ), విస్తారంగా భూములు కొనడం కోసం పాక్షిక రుణ భద్రతా పథకం ఏర్పాటు, ఎగుమతుల రుణాలు రూ. 38 వేల కోట్ల నుంచి రూ. 68 వేల కోట్లకు పెంపు, ఎగుమతి రుణాలపై బీమా పరిధి పెంపు వంటి ప్రోత్సాహకాలు అమలు చేస్తారు. తక్కువ పన్నుల విధానం, అనుమతుల మంజూరులో మౌలిక మార్పులు తెస్తారు. 

కొత్త ప్రాజెక్టుల రూపంలో ద్రవ్య పెట్టుబడి జరుగుతుంటే దీనివల్ల తయారీరంగపు యూనిట్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దీనివల్ల ముందుముందు మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. ఆర్థికవ్యవస్థకు లాభం కలుగుతుంది. తయారీ రంగంలో అధిక పెట్టుబడులు వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో కార్మికుల వేతనాన్ని పెంచుతాయి. ప్రజలు వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడతారు. దాంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉత్పాదకత పెరగడంతోపాటు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. వారి ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు వీలు కలుగుతుంది.


జి. కిషన్‌ రెడ్డి
వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top