జ్యోతిరాదిత్య సింథియా (కాంగ్రెస్‌)

Jyotiraditya Unwritten Diary By Madhav Singaraju - Sakshi

రాయని డైరీ

సి.ఎం. పదవి రానందుకు బాధ లేదు. డిప్యూటీ సి.ఎం.గా ఉండమన్నందుకు అసలే బాధ లేదు. రాజపుత్రులకు ఇలాంటివి ఏమాత్రం విషయాలు, విశేషాలూ కావు. ఆత్మార్పణ చేసుకోవలసినంత అవమానాలూ కావు. గ్వాలియర్‌ సంస్థానం రద్దు కాకుండా ఉంటే, ఇప్పుడు గ్వాలియర్‌ను పరిపాలిస్తుండేవాడిని అనుకోవడం వంటిదే.. కమల్‌నాథ్‌ లేకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయి ఉండేవాడిని అనుకోవడం!

లేకుండా ఏదీ ఉండదు జీవితంలో. స్వాతంత్య్ర సంగ్రామాలు ఉంటాయి. సంస్థానాల విలీనాలూ ఉంటాయి. సి.ఎం. పదవికి పోటీ ఉంటుంది. పోటీలో ఉన్న ప్రత్యర్థిని గెలిపించడం కోసం ఓడిపోవడమూ ఉంటుంది. నాన్నగారు ఇదంతా పైనుంచి చూస్తూ.. ‘క్షత్రియ పుత్రుడివి అనిపించావు ఆదిత్యా’ అని గర్వపడే ఉంటారు. 

ముప్పై ఏళ్ల క్రితం నాన్న అడిగింది వాళ్లు ఇవ్వలేదు. ముప్పై ఏళ్ల తర్వాత వాళ్లు ఇస్తానన్నది నేను తీసుకోలేదు. ఇది కూడా నాన్న గర్వించే విషయమే. 

నాన్న రైల్వే మినిస్టర్‌గా ఉన్నారు. హెచ్‌.ఆర్‌.డి. మినిస్టర్‌గా ఉన్నారు. టూరిజం మినిస్టర్‌గా ఉన్నారు. సివిల్‌ ఏవియేషన్‌ మినిస్టర్‌గా ఉన్నారు. చీఫ్‌ మినిస్టర్‌గా మాత్రం లేరు. కమల్‌నాథ్‌ని గెలిపించడానికి ఖడ్గాన్ని ఒరలోంచి తియ్యకుండానే ఓడిపోయాను నేను. ఖడ్గాన్ని ఒరలోంచి తీసి కూడా పార్టీ ఎంపిక చేసిన మనిషిని గెలిపించడానికి ఓడిపోయారు నాన్న. నాన్న ఎంత గొప్పవారు! 

పెద్దత్త, చిన్నత్త కబురు పంపారు. ‘‘కలుద్దాం’’ అన్నారు పెద్దత్త వసుంధరరాజే.  ‘‘కలిసి మాట్లాడుకుందాం’’ అన్నారు చిన్నత్త యశోధరారాజే. 

‘‘వద్దు పెద్దత్తా, చిన్నత్తా.. మీరొచ్చి నన్ను కలిస్తే మీరు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అనుకుంటారు. నేనొచ్చి మిమ్మల్ని కలిస్తే నేను బీజేపీలో చేరబోతున్నానని అనుకుంటారు’’ అన్నాను.

 ‘‘అయితే నువ్వే వచ్చి మమ్మల్ని కలువు’’ అన్నారు పెద్దత్త, చిన్నత్త. 

అత్తలిద్దరూ నన్ను బీజేపీలోకి రమ్మని అడుగుతున్నట్లు అర్థమైంది. 

‘‘కుంతల రాజ్యంలో న్యాయం జరగలేదని శకుంతల రాజ్యానికి వెళ్లిపోవడం న్యాయమేనా పెద్దత్తా, చిన్నత్తా?!’’ అని అడిగాను.

‘‘రాజపుత్రుడైన మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంత్రిగానే బతికారు. నువ్వూ ఆ బతుకే బతుకుతావా ఆదిత్యా?’’ అన్నారు అత్తలిద్దరూ భారంగా. 
మౌనంగా ఉన్నాను. 

‘‘ఆదిత్యా.. నీకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడు పెమా ఖండూ బీజేపీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీకన్నా ఏడాది చిన్నవాడు, నీ పేరే ఉన్నవాడు ఆదిత్యనాథ్‌ బీజేపీలో ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నీ ఈడువాడే నీకన్నా పదినెలలు చిన్నవాడు విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ బీజేపీలో త్రిపురకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీలోకి వచ్చెయ్‌. నువ్వెందుకింకా ఆ వయోవృద్ధుల పార్టీలోనే ఉన్నావు? శిరస్సుపై కిరీటం పెట్టకపోవడం, శిరస్సును ఖండించడం రెండూ ఒకటే’’ అన్నారు పెద్దత్త.

‘‘శిరస్సును ఖండించినంత మాత్రాన క్షత్రియపుత్రుడు క్షతగాత్రుడౌతాడా పెద్దత్తా..’’ అని అడిగాను. 

‘‘పార్లమెంటులో చీఫ్‌ విప్‌గా ఉండడం, చీఫ్‌ మినిస్టర్‌గా పవర్‌లో ఉండడం రెండూ ఒకటేనా ఆదిత్యా.. ఆలోచించు’’ అన్నారు చిన్నత్త. 

‘‘ఆలోచించడానికేం లేదు చిన్నత్తా’’ అని చెప్పాను. 

పవర్‌.. ఇస్తుంటే తీసుకోవడంలో లేదు. వస్తుంటే వద్దనడంలో ఉంది. ఆ విషయం బీజేపీలో ఉన్నవాళ్లకు చెప్పినా అర్థం కాదు.

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top